BigTV English

Mahayuti Alliance Victory in elections: ఎన్డీయే ‘మహా’ గెలుపు.. సీఎం కుర్చీ కోసం పోటాపోటీ, ఆయనకే ఎక్కువ ఛాన్స్!

Mahayuti Alliance Victory in elections: ఎన్డీయే ‘మహా’ గెలుపు.. సీఎం కుర్చీ కోసం పోటాపోటీ, ఆయనకే ఎక్కువ ఛాన్స్!

⦿ మహాయుతి కూటమి అఖండ విజయం
⦿ 288కి 230 సీట్లు కైవసం చేసుకున్న అధికార పక్షం
⦿ మహా వికాస్ అఘాడి 51 స్థానాలకే పరిమితం
⦿ 7 స్థానాల్లో గెలిచిన ఇతరులు
⦿ అభివృద్ధి గెలిచిందన్న ప్రధాని మోదీ
⦿ మహా సీఎం ఎవరు?.. స్పష్టత ఇవ్వని కూటమి నేతలు
⦿ ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్న ఫడ్నవీస్!
⦿ మరోసారి సీఎం పీఠం ఆశిస్తున్న షిండే!
⦿ కూటమిలో చర్చించి ఖరారు చేస్తామంటూ ప్రకటనలు


ముంబై, స్వేచ్ఛ: యావత్ దేశం ఆసక్తిగా గమనించిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పాలక పక్షానికే ప్రజలు తిరిగి పట్టం కట్టారు. ఎగ్జిట్ పోల్ అంచనాలను ప్రతిబింబిస్తూ మరాఠా గడ్డపై మరోసారి బీజేపీ సారధ్యంలోని మహాయుతి (ఎన్డీయే) కూటమి సర్కారు కొలువుదీరబోతోంది. రాష్ట్రంలో 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా రికార్డు స్థాయిలో 230 స్థానాలు గెలుచుకొని మహాయుతి కూటమి అఖండ విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ 145 సీట్లు కాగా బీజేపీ సింగిల్‌గా 132 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కూటమికి చెందిన షిండే శివసేన-54, అజిత్ పవార్ ఎన్సీపీ-41, జేఎస్ఎస్-2, ఆర్ఎస్‌జేపీ-1 చొప్పున స్థానాలను గెలుచుకున్నాయి. ఈ కూటమికి 50 శాతానికిపైగా ఓట్లు దక్కాయి. ఇక శరద్ పవార్ ఎన్సీపీ, ఉద్ధవ్ థాక్రే శివసేన, కాంగ్రెస్ పార్టీలతో కూడిన విపక్షాల మహా వికాస్ అఘాడి చతికిలపడింది. కేవలం 51 స్థానాలకే పరిమితమైంది. అత్యధిక నియోజకవర్గాల్లో విపక్షాల అభ్యర్థులు భారీ వ్యత్యాసంతో ఓడిపోయారు. ఉద్ధవ్ థాక్రే శివసేన పార్టీ అత్యధికంగా 21 సీట్లు గెలుచుకుంది. కూటమిలోని మిగతా పార్టీల్లో కాంగ్రెస్-17, ఎన్సీపీ(శరద్ పవార్)-10, ఎస్పీ-2, పీఏడబ్ల్యూపీవోఐ-1 చొప్పున, ఇతరులు-7 సీట్లు గెలుచుకున్నారు. మహా వికాస్ అఘాడి కూటమికి 34 శాతం ఓట్లు, ఇతరులకు 16 శాతం ఓట్లు దక్కాయి.

అభివృద్ధి గెలిచింది: ప్రధాని మోదీ
మహారాష్ట్రలో ఎన్డీయే గెలుపుపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మహాయుతి కూటమికి చారిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టిన మహారాష్ట్ర ప్రజలకు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ‘‘ ఇది అభివృద్ధి విజయం. చక్కటి పాలన గెలుపు. ఉమ్మడిగా కలిసి ఉంటే ఇంతకంటే గొప్ప విజయం సాధించగలం!’’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన మహారాష్ట్ర సోదర, సోదరీమణులు.. ముఖ్యంగా రాష్ట్ర యువత, మహిళలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. కూటమిపై రాష్ట్ర ప్రజలు చూపించిన ఆప్యాయత అసమానమైనదని, రాష్ట్ర పురోగతి కోసం పనిచేస్తానని ఈ సందర్భంగా వాగ్దానం చేస్తున్నానంటూ ఎక్స్ వేదికగా స్పందించారు.


విపక్షాల ఆరోపణలకు ఎన్నికల్లో గెలుపు ద్వారా గట్టి సమాధానం ఇచ్చామని సీఎం ఏక్‌నాథ్ షిండే వ్యాఖ్యానించారు. గత రెండున్నరేళ్లపాటు విపక్ష పార్టీలు ఆరోపణలకే పరిమితమయ్యాయని, కానీ తాము ప్రతిస్పందించకుండా పాలన మీదే దృష్టిపెట్టామని అన్నారు. ఇంత అద్భుత విజయాన్ని అందించిన మహారాష్ట్ర ఓటర్లకు సీఎం షిండే కృతజ్ఞతలు తెలిపారు. శివసేన పార్టీ ఎవరికి చెందుతుందో ఈ గెలుపు నిర్ణయించిందని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ కీలక నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ… మంచి పాలనకు దక్కిన విజయని అభివర్ణించారు. పూర్తి ఫలితాలు వెలువడిన తర్వాత కూటమి పార్టీ ఎమ్మెల్యేల భేటీ ఉంటుందని ఆయన చెప్పారు. మరో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పందిస్తూ.. ఎన్సీపీ ఎవరికి చెందుతుందో ఈ ఎన్నికల ఫలితాలు నిర్ణయించాయని అన్నారు. కూటమికి మరోసారి అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

ఇంతకీ సీఎం ఎవరు?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి చారిత్రాత్మక విజయం సాధించడంతో తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేది ఎవరు? అనే ఆసక్తికర చర్చ మొదలైంది. కూటమిలో బీజేపీ అత్యధికంగా 133 స్థానాలు కైవసం చేసుకోవడంతో సీఎం పదవిని ఆ పార్టీ ఆశిస్తోంది. సింగిల్‌గా ప్రభుత్వ ఏర్పాటుకు దాదాపు చేరువవ్వడంతో ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీ కోరబోతోందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దేవేంద్ర ఫడ్నవీస్‌కు ముఖ్యమంత్రి పదవిని కాషాయ పార్టీ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఫడ్నవీస్‌కు ఆర్ఎస్ఎస్ మద్దతు కూడా ఉందంటూ కథనాలు వెలువడుతున్నాయి. మరోవైపు ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్ షిండే కూడా రెండోసారి సీఎం పదవిని ఆశిస్తున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి.

లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఎదురైన ఎదురుదెబ్బ నుంచి నేడు అఖండ విజయం సాధించడంలో తన నాయకత్వం విజయవంతమైందని షిండే చెబుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ‘లడ్కీ బహిన్ యోజన’ పథకం తన మానస పుత్రిక అని, తన మనసులోంచి పుట్టిన ఆలోచన అని ఆయన అంటున్నారని కూటమి వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా తదుపరి సీఎం ఎవరు? అనే ప్రశ్నకు మహాయుతి కూటమి నేతలు లౌక్యంతో సమాధానం ఇస్తున్నారు. ఎలాంటి చర్చకు తావివ్వకుండా స్పందిస్తున్నారు. రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది కూటమిలో చర్చించి నిర్ణయిస్తామని ఏక్‌నాథ్ షిండే మీడియాతో అన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ సీఎం పదవిపై కూటమిలో ఎలాంటి వివాదం ఉండబోదన్నారు. ఫలితాలు వెలువడిన మరుసటి రోజు దీనిపై నిర్ణయం ఉంటుందని, భాగస్వామి పార్టీల ఎమ్మెల్యేంతా కలిసి కూర్చొని నిర్ణయిస్తారని ఆయన ప్రకటించారు.

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×