Kannada Psychological Crime Thriller: ఓ మారుమూల పల్లెటూరిలో వరుసగా యువతుల శవాలు కనిపిస్తుంటే… ఆ హత్యలన్నీ ఒకేలా ఉంటే ? పైగా చనిపోయిన వారంతా పెళ్లికూతురు గెటప్ లోనే కనిపిస్తే ? గ్రామస్తులు మాత్రం ఇదంతా ఓ దెయ్యం పనే అని నమ్మితే… అసలు నిజాన్ని బయట పెట్టాల్సిన పోలీస్ ఆఫీసరే తన మైండ్ తో పోరాడుతున్న వ్యక్తి అయితే పరిస్థితి ఎలా ఉంటుంది ? నిజంగా ఆ ఊరిని వెంటాడుతున్నది కొల్లిదేవ్వనా ? లేక దాని వెనుక ఓ మనిషి ఉన్నాడా ? ఈ ప్రశ్నల చుట్టూ నడిచే డార్క్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ‘రక్కసపురదోళ్’ (Rakkasapuradhol). మరి ఈ థ్రిల్లర్ మూవీని ఎక్కడ చూడవచ్చు ? ఏ ఓటీటీలో ఉంది ? అనేది తెలుసుకుందాం పదండి.
కథ 1999లో జరుగుతుంది. శివ తెలివైన పోలీస్ ఆఫీసర్. అయితే మద్యం అలవాటు, తీవ్రమైన మానసిక సమస్యల కారణంగా అతడి కెరీర్ దెబ్బతింటుంది. చివరకు సస్పెన్షన్ కు గురవుతాడు. కొంతకాలం తర్వాత అతడిపై ఉన్న సస్పెన్షన్ ను తొలగించిన అధికారులు… పెద్దగా క్రైమ్ జరగని రక్కసపుర అనే మారుమూల గ్రామానికి బదిలీ చేస్తారు. అక్కడ కూడా అతడి కదలికలపై డిపార్ట్‌మెంట్ నిఘా ఉంటుంది.
అంతా ప్రశాంతంగా ఉందనుకుంటున్న సమయంలో గ్రామంలో వరుస హత్యలు మొదలవుతాయి. పెళ్లికూతురు మాదిరిగా అలంకరించిన యువతుల మృతదేహాలు కనిపిస్తాయి. అంతేకాదు… వారి ముఖాలు కాలిపోయి ఉండటంతో ఈ హత్యలు మరింత భయానకంగా మారతాయి. గ్రామస్తులు మాత్రం ఈ ఘటనలకు కారణం కొల్లిదేవ్వ అనే దెయ్యమేనని బలంగా నమ్ముతారు. భయంతో రాత్రి వేళల్లో బయటకు రావడానికి కూడా జంకుతుంటారు.
కానీ శివ మాత్రం దెయ్యాల కథను నమ్మడు. తన వ్యక్తిగత సమస్యలతో ప్రతిరోజూ పోరాడుతూనే హత్యల వెనుక ఉన్న నిజాన్ని వెతకడం మొదలుపెడతాడు. ఆధారాలను పరిశీలిస్తూ వెళ్లిన కొద్దీ… ఈ హత్యలకు అతీంద్రియ శక్తులకు సంబంధం లేదని, సిద్దయ్య అనే వ్యక్తి వెనుక ఉన్నాడనే అనుమానం బలపడుతుంది. చివరకు శివ ఆ దిశగా దర్యాప్తు వేగం పెంచుతాడు.
అయితే నిందితుడిని పట్టుకునేలోపే సిద్దయ్య అనుమానాస్పదంగా మరణిస్తాడు. దీంతో కేసు మరింత చిక్కుముడిగా మారుతుంది. ఇంతకాలం తాను చూసింది నిజమేనా ? తన మానసిక పరిస్థితి కారణంగా ఏమైనా ఊహించుకుంటున్నాడా ? అనే అనుమానం శివలో మొదలవుతుంది. దెయ్యం నిజంగానే ఉంటే… దాని తర్వాతి టార్గెట్ తానేనా ? అన్న భయం కూడా వెంటాడుతుంది. చివరికి రక్కసపురలో జరుగుతున్న వరుస హత్యల వెనుక ఉన్న అసలు నిజం ఏంటి ? శివ ఈ కేసును ఎలా ముగించాడు ? అనేదే సినిమాలో చూడాల్సిన మిస్టరీ.
రవి సారంగ దర్శకత్వం వహించిన ‘రక్కసపురదోళ్’లో రాజ్ బి. శెట్టి, అర్చనా కొట్టిగె, సాయికుమార్, గోపాల్ కృష్ణ దేశ్‌పాండే, శ్రీధర్ తదితరులు నటించారు. సైకలాజికల్ థ్రిల్, క్రైమ్, హారర్ టచ్‌తో సాగే ఈ సినిమా ప్రస్తుతం Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం కన్నడ ఆడియో మాత్రమే అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూడొచ్చు. తెలుగు ఆడియో ప్రస్తుతానికి లేదు. డార్క్ మిస్టరీలు, సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్స్ నచ్చేవాళ్లకు ఇది మంచి ఆప్షన్.
Read Also: సినిమా ప్రపంచం వెనుక ఉన్న అసలు రంగులు… నవ్వులతో పాటు కన్నీళ్లు పెట్టించే వినోదాత్మక ప్రయాణం