Manipur illigal arms : తీవ్రమైన జాతుల మధ్య అల్లర్లతో అట్టుడుకుతూ.. రాష్ట్రపతి పాలనలోకి వెళ్లిన మణిపూర్ లో ఆ రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లా కీలక ప్రకటన చేశారు. అల్లర్ల సమయంలో ప్రభుత్వ అధికారుల నుంచి దోచుకున్న, ఇతర మార్గాల్లో సమకూర్చుకున్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ఏడు రోజుల్లోగా అప్పగించాలని సూచించారు. అలా ఆయుధాల్ని కలిగి ఉండడం చట్టవిరుద్ధమని తెలిపిన గవర్నర్.. గడుపు లోపు ఆయుధాలను తిరిగి ఇచ్చే ఎవరిపై ఎలాంటి శిక్షార్హమైన చర్యలు తీసుకోమని స్పష్టం చేశారు. లేదంటే.. ఏడు రోజుల గడువు ముగిసిన తర్వాత దోచుకున్న లేదా అక్రమ ఆయుధాలను కలిగి ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గవర్నర్ ఓ ప్రకటన విడుదల చేశారు.
మయన్మార్‌తో సరిహద్దును పంచుకునే మణిపూర్.. మెయితీ, కుకీ అనే డజనుకు పైగా విభిన్న తెగలున్నాయి. వీటి మధ్య జాతి ఘర్షణలు దాదాపు రెండేళ్ల క్రితం ప్రారంభం కాగా.. అనేక సంఘర్ణల్ని ఎదుర్కొంటోంది. తాజాగా.. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతిపాలను విధించింది. ఫిబ్రవరి 9న ముఖ్యమంత్రి బిరేన్ సింగ్, ఆయన మంత్రి మండలి రాజీనామా చేయగా.. ఆ వెంటనే గవర్నర్ అసెంబ్లీని సస్పెండ్ చేశారు. మణిపూర్ లోయ, కొండ ప్రాంతాలలో నివసించే ప్రజలు గత 20 నెలలుగా శాంతి, మత సామరస్యాన్ని దెబ్బతీసే అనేక దురదృష్టకర సంఘటనలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ సాధారణ స్థితిని పునరుద్ధరించేందుకు, ప్రజలు తమ సాధారణ రోజువారీ కార్యకలాపాలకు తిరిగి ప్రారంభించుకునేందుకు అందరు ప్రయత్నించాలని గవర్నర్ కోరారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు శత్రుత్వాలను విరమించుకోవాలని, సమాజంలో శాంతిభద్రతలను కాపాడుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
మణిపూర్ అల్లర్లల్లోకి తుపాకులు
2023 మే 3న జాతి ఘర్షణలు చెలరేగిన తర్వాత మణిపూర్ అంతటా పోలీస్ స్టేషన్లు, ఆయుధశాలల నుంచి 6,000 తుపాకులు దోచుకున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. వాటిలో కొన్నింటిని స్వాధీనం చేసుకున్నా.. ఇంకా 4 వేలకు పైగా తుపాకులు కనిపించడం లేదని చెబుతున్నారు. వీటిలో.. కొన్ని అమెరికన్ మూలం M సిరీస్ అసాల్ట్ రైఫిల్స్ ఉన్నాయని అధికారులు తెలుపుతున్నారు. రాష్ట్రంలోని వివిధ చోట్ల నుంచి దోచుకున్న ఆయుధాలలో దాదాపు 30 శాతం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ఆయుధశాలల నుండి దోచుకున్న అధునాతన ఆయుధాలు మణిపూర్ జాతి వివాదంలోకి ప్రవేశించినట్లుగా తెలిపిన ఉన్నతాధికారులు.. ఇవి భద్రతా సంస్థలకు కొత్త సవాళ్లను విసురుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లోయలో ఆధిపత్యం వహించే మెయిటీ మిలీషియా అరంబై టెంగోల్ (AT) లోని చాలా మంది సభ్యులపై పోలీసు ఆయుధ దోపిడీ కేసుల్లో పేర్లు ఉన్నాయని తెలిపారు.
గవర్నర్ శాంతి పిలుపు
ఈ విషయంలో.. ముఖ్యంగా యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దోచుకున్న, చట్టవిరుద్ధంగా కలిగి ఉన్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ప్రభుత్వానికి అప్పగించాలని సూచించారు. ప్రభుత్వం అనుమతించిన ఏడు రోజుల్లోపు సమీపంలోని పోలీస్ స్టేషన్/ అవుట్‌పోస్ట్/ భద్రతా దళాల శిబిరానికి అప్పగించాలని అభ్యర్థించారు. ఈ ఆయుధాలను తిరిగి ఇవ్వడం ద్వారా శాంతిని పునరిద్ధరించేందుకు చేసే ప్రయత్నంగా అభివర్ణించారు.
Also read : US Immigrants : ట్రంప్ క్రూరత్వం – డేరియన్ అడవులకు అక్రమ వలసదారుల తరలింపు
ఆయుధాల్ని, మందు గుండు సామాగ్రిని నిర్ణీత సమయంలోపు అప్పగిస్తే ప్రభుత్వం ఎలాంటి శిక్షార్హమైన చర్యలు తీసుకోదని భరోసా ఇచ్చారు. ఆ తర్వాత మాత్రం పరిస్థితులు కఠినంగా ఉంటాయని, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ఉంటే చట్టప్రకారం చర్యలుంటాని హెచ్చరించారు. పరిస్థితిని శాంతియుతంగా పరిష్కరించేందుకు, రాష్ట్ర యువత భవిష్యత్తును కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఉజ్వల భవిష్యత్తు కోసం ఆశ, నమ్మకంతో కలిసి మన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందామంటూ మణిపూర్ ప్రజలకు గవర్నర్ అజయ్ కుమార్ భల్లా పిలుపునిచ్చారు.