RG Kar Medical College : కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో అత్యాచార ఘటన మరువక ముందే మరో 20 ఏళ్ల వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవటం కలకలం రేపింది. MBBS రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని.. తన హాస్టల్ క్వార్టర్ లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని కనిపించింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై హాస్పిటల్ వద్ద విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.
కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజ్.. ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య జరిగిన సంఘటనపై ఈ కాలేజ్ దేశవ్యాప్తంగా చర్చనీయ అంశంగా మారింది. ఈ ఏడాది జనవరి 20న ఈ కేసులో నేరస్తుడిగా సంజమ్ రాాయ్ ను తేల్చిన కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ ఘటన మరువకముందే మరో వైద్య విద్యార్థిని తన రూమ్ లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోయిన విద్యార్థిని ఐవీ ప్రసాద్ గా గుర్తించిన పోలీసులు.. మృతురాలు ఆ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్టు తెలిపారు.
ఐవీ ప్రసాద్ తన గదిలో ఒంటరిగా ఉన్న సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. శుక్రవారం ఆమె తల్లి పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ స్పందించకపోవడంతో అనుమానం వచ్చి వెంటనే హాస్పిటల్ క్వార్టర్స్ కి వచ్చి చూసింది. గది తలుపులు మూసి ఉండటంతో వెంటనే బద్దలు కొట్టి చూడగా సీలింగ్ కు ఉరివేసుకొని కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ మరణంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని కుటుంబ సభ్యులు చెప్పటంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే బాధితురాలి గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. ఆమె కొన్నాళ్లుగా డిప్రెషన్ తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది.
కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ యాజమాన్యంపై ట్రైనీ డాక్టర్ అత్యాచారం సమయంలోనే పలు ఆరోపణలు ఎదురయ్యాయి. ఈ కాలేజీలో విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని.. సరైన విద్యా అందించకపోగా ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు ఎదురయ్యాయి. ఈ విషయంలో తీవ్ర నిరసనలు సైతం ఎదురయ్యాయి. ఇక ఇప్పుడు మరో విద్యార్థిని చనిపోవడంతో మెడికల్ విద్యార్థులు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీలో ఏం జరుగుతుందో అనే విషయంపై విచారణ జరిపి అసలు విషయాలు బయటకు తీయాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత మంది విద్యార్ధులు బలికాకుండా చూడాలంటూ నిరసన తెలుపుతున్నారు.
ALSO READ : ఈసారి జనాభా లెక్కింపు లేనట్టేనా.. కేంద్రం ఎందుకు వెనకడుగు వేస్తుంది