Meghalaya : మేఘాలయలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నేషనల్ పీపుల్స్ పార్టీ అధినేత కాన్రాడ్ .కె. సంగ్మా ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఫాగు చౌహన్.. సంగ్మా చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అస్సోమ్ ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ హాజరయ్యారు.
మేఘాలయాలో 11 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. సంగ్మా కేబినెట్ లో ఎన్‌పీపీకి చెందిన ఏడుగురు, యూడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ, హెచ్‌ఎస్‌పీడీపీ నుంచి ఒకొక్కరికి స్థానం దక్కింది.
ఇటీవల జరిగిన మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌పీపీ 26 సీట్ల గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే 60 స్థానాలున్న మేఘాలయ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీ మాత్రం లభించలేదు. దీంతో బీజేపీ, యూడీపీ, ఇతర పార్టీలతో కలిసి కాన్రాడ్ సంగ్మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. గతంలో కూడా ఆయన మేఘాలయ సీఎంగా ఉన్నారు. ఇప్పుడు వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు.
సోమవారం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ తిమోతి షిరా వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అసెంబ్లీ స్పీకర్‌ను మార్చి 9న ప్రత్యేక హౌస్‌లో సెషన్‌లో ఎన్నుకునే అవకాశం ఉంది.