Govt Employees DA Hike| భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన తాజా కేంద్ర కేబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, అలాగే రైతులకు వరాల జల్లు కురిపించింది. కేంద్ర మంత్రివర్గం కేంద్ర ఉద్యోగులకు శుభవార్త అందించింది. కరవు భత్యాన్ని 2 శాతం పెంచేందుకు ఆమోదం తెలిపింది. మార్చి నెలలో కరవు భత్యం పెంపు ప్రకటన చేయడం జరిగింది.
ఇంతకుముందు ఉన్న 53 శాతం డిఏ ను 2 శాతం పెంచుతూ 55 శాతానికి చేయాలని నిర్ణయించింది. ఇది గత 78 నెలల్లో కేంద్ర ఉద్యోగులకు కరువు భత్యంలో వచ్చిన అత్యధిక పెరుగుదల. దీంతో ఉద్యోగులకు డీఏ రెండు నెలల బకాయిలతో మార్చి నెల జీతంతో పాటు ఇవ్వబడుతుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కరవు భత్యం ప్రస్తుత ద్రవ్యోల్బణ రేటు, వారి మూల వేతనం ఆధారంగా చెల్లించబడుతుంది. ఇదే విధంగా పెన్షనర్లకు కూడా కరవు ఉపశమనం లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్లపై ద్రవ్యోల్బణ భారాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం ఈ కరవు భత్యాన్ని సంవత్సరానికి రెండు సార్లు సవరించుకుంటుంది, ఇది ద్రవ్యోల్బణ రేటు ఆధారంగా మారుతుంది.
కొత్త కరవు భత్యం రేట్లు జనవరి నుంచి జూన్ వరకు అర్ధసంవత్సరానికి, జూలై నుంచి డిసెంబర్ వరకు తదుపరి అర్ధసంవత్సరానికి వర్తిస్తాయి. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసే వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఈ పెరుగుదలతో ఎటువంటి ప్రయోజనం ఉండదు.
డీఏను 2 శాతం పెరగడంతో, ప్రభుత్వ ఉద్యోగుల కరవు భత్యం 55 శాతానికి చేరింది. ఈ పెరుగుదల 2024 జనవరి నుండి జూలై-డిసెంబర్ వరకు ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) డేటా ఆధారంగా జరిగింది. ఒక ఉద్యోగి మూల వేతనం రూ. 18,000 అయితే, 2% పెరుగుదల తరువాత అతనికి ప్రతి నెలకు రూ. 360 అదనంగా లభిస్తుంది. అంటే, ఒక సంవత్సరంలో అతనికి రూ. 4,320 అదనపు ఆదాయం ఉంటుంది. మరొక వైపు, ఒక పెన్షనర్ ప్రాథమిక పెన్షన్ రూ. 9,000 అయితే, 2% పెరుగుదలతో అతనికి ప్రతి నెలకు రూ. 180 అదనంగా లభిస్తుంది. అంటే, అతనికి ఒక సంవత్సరంలో పెన్షన్‌లో రూ. 2,160 ప్రయోజనం ఉంటుంది.
ఈ 2% డీఏ పెంపు ద్వారా 48.56 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 66.55 లక్షల మంది పెన్షనర్లకు లాభం చేకూరనుంది. తాజా కేబినెట్ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వంపై రూ. 6,614 కోట్ల భారం పడనుంది. పెరిగిన డీఏ జనవరి 2025 నుండి అమల్లోకి రానుంది. గత ఏడాది జులైలో డీఏను 50% నుండి 53%కి పెంచారు. ప్రతి సంవత్సరం రెండు సార్లు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల డీఏను సవరించుకుంటూ ఉంటుంది. పెరుగుతున్న ధరల పెరిగిన భారాన్ని తట్టుకునేందుకు ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
డీఏ అంటే ఏమిటి?
డీఏ అంటే “Dearness Allowance” (కరువు భత్యం)ని సూచిస్తుంది. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రకారం వారి మూల వేతనాన్ని సర్దుబాటు చేసేందుకు ఇచ్చే మొత్తంగా ఉంటుంది. ప్రతి 10 సంవత్సరాల తర్వాత వేతన సంఘంలో ప్రాథమిక వేతనం నిర్ణయించబడుతుంది. కానీ, డీఏ ఉద్యోగుల జీతంలో కాలానుగుణంగా పెరుగుదలని నిర్ధారిస్తుంది.
రైతులపై భారం తగ్గించేందుకు పోషక ఆధారిత ఎరువులపై కేంద్రం సబ్సిడీ ఇస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో పోషక ఆధారిత పీఅండ్‌కే ఎరువులకు రూ. 37,216 కోట్ల సబ్సిడీ మంజూరు చేసింది. న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ పథకం కింద 28 రకాల పోషక ఆధారిత ఎరువుల గరిష్ట చిల్లర ధరను తయారీదారులు లేదా దిగుమతిదారులు తగిన స్థాయిలో నిర్ణయించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొవిడ్ వచ్చాక అంతర్జాతీయ మార్కెట్‌లో డీఏపీ ధరలు బాగా పెరిగాయి. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు మరియు ధరల అస్థిరతను తగ్గించేందుకు డీఏపీ గరిష్ట చిల్లర ధరను 50 కిలోల బ్యాగ్‌కు రూ. 1,350 వరకు కేంద్ర ప్రభుత్వం పరిమితం చేసింది.
అలాగే, నాన్-సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీని ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (PLI) కిందకు తీసుకొచ్చారు. దీనికోసం ఆరు సంవత్సరాలకు గాను రూ. 22,919 కోట్ల వెచ్చించనున్నారు. దీని ద్వారా సుమారు రూ. 59,350 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. దీని ద్వారా ప్రత్యక్షంగా 91 వేల మందికి, పరోక్షంగా మరికొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.