అమెరికా భారత్ నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై భారీగా పన్నులు పెంచింది. పెరిగిన పన్నులు నేటి నుంచి అమలులోకి వచ్చాయి కూడా. 5 రంగాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి, మరో 5 రంగాలపై కూడా భారం స్పష్టంగా కనపడుతోంది. ఈ దశలో భారత్ ఏం చేయాలి. రష్యానుంచి ఆయిల్ దిగుమతుల్ని ఆపేయడం సమస్యకు తక్షణ పరిష్కారంగా కనపడుతున్నా దానివల్ల నష్టం కూడా ఎక్కువే. అదే సమయంలో అమెరికా దెబ్బకు భారత్ భయపడిందన్న అపవాదు కూడా మోయాల్సి ఉంటుంది. అందుకే ఈసారి మోదీ వ్యూహం మార్చారు. మరోసారి మేడిన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అంటున్నారు. అంతే కాదు.. దేశీయంగా విధిస్తున్న సుంకాలను తగ్గించారు కూడా.
వాహన రంగానికి రాయితీలు..
ఇటీవల వాహనరంగానికి కేంద్రం భారీగా పన్ను రాయితీ ఇచ్చింది. మరికొన్ని రంగాలపై కూడా జాలి చూపెడతానంటోంది. ఇదంతా అమెరికా టారిఫ్ ప్రభావమే. ఆల్రడీ ట్రంప్ భారీగా వడ్డింపులు మొదలు పెట్టారు, అందుకే భారత కేంద్ర ప్రభుత్వం జాలి చూపెట్టడం మొదలు పెట్టింది. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు, మార్కెట్ ని బలపరిచేందుకు స్థానిక సుంకాలను తగ్గిస్తోంది. ఆల్రడీ వాహన రంగానికి ప్రోత్సాహకాలను ప్రకటించిన మోదీ, దీపావళికి భారీ బొనాంజా ప్రకటిస్తానంటూ ఊరిస్తున్నారు. లక్షలాది చిరు వ్యాపారాలకు ఇది మేలు చేస్తుందని అంటున్నారు. ముఖ్యంగా జీఎస్టీలో పలు మినహాయింపులు ఉంటాయని వ్యాపార వర్గాలు ఆశిస్తున్నాయి.
స్వావలంబన మంత్రం..
ఇటీవల స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మోదీ ప్రసంగంలో మేడ్ ఇన్ ఇండియా ప్రస్తావనకు వచ్చింది. చిన్న దుకాణాల యజమానులు తమ షాపుల బయట “స్వదేశీ” లేదా “మేడ్ ఇన్ ఇండియా” అనే బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారాయన. నిరాశతో కాకుండా గర్వంతో మనం స్వావలంబన పొందాలి అని అన్నారాయన. అంటే అమెరికా పన్నుల భారం మోపినా మనం కుంగిపోకూడదని, మన మార్కెట్ ని మరింత మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు మోదీ. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక స్వార్థం పెరుగుతోందని, ఇబ్బందులు వస్తే కూర్చుని ఏడవకూడదని, పైకి ఎదగాలని, ఇతరులు మనల్ని తమ గుప్పిట్లో పెట్టుకోడానికి అనుమతించకూడదని సెలవిచ్చారు. ఆ తర్వాత రెండు మూడు బహిరంగ వేదికలపై కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు మోదీ.
ఉపాధి దెబ్బతినకుండా..
అమెరికా టారిఫ్ ల వల్ల మన రొయ్యల ఎగుమతి రంగం తీవ్రంగా దెబ్బతింటుంది. దీనివల్ల కేవలం ఎగుమతి దారులే నష్టపోరు, వారిపై ఆధారపడిన కూలీలు, చిరు ఉద్యోగులు కూడా ప్రభావితం అవుతారు. దీన్ని నివారించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. దుస్తుల రంగంపై కూడా ట్రంప్ టారిఫ్ ప్రభావం ఉంది. దీని వల్ల దర్జీలు, దుస్తుల కర్మాగారాల్లో పనిచేసే చిరుద్యోగులు నష్టపోతున్నారు. ఆ మార్కెట్ ని పడిపోకుండా నిలబెట్టాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. ఎగుమతి ఆధారిత పరిశ్రమల్లో లక్షలాది మంది జీవనోపాధిని సుంకాలు దెబ్బతీస్తున్నాయి. వారంతా ఉపాధి కోల్పోకుండా ఉండాలంటే, ఆయా రంగాలకు పన్ను రాయితీలను కేంద్రం ప్రకటించాలి. వారి ఉత్పత్తులకు కొత్త మార్కెట్ ని వెదికి చూపించాలి.
భారత్ లో తయారీ -భారత్ లో ఖర్చు..
భారత్ లో తయారీని మోదీ నొక్కి చెబుతున్నారు. అదే సమయంలో భారత్ లోనే ఖర్చు అనే కొత్త నినాదం కూడా తెరపైకి తెచ్చారు. విదేశీ వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, భారత్ లో తయారైన వస్తువుల కొనుగోలుకి ఆసక్తి చూపించాలని ఆయన అన్నారు. అయితే దీనికంటే ముందు కేంద్రం ఉత్పత్తిదారులపై కనికరం చూపాలి. అలా చేస్తేనే సరసమైన ధరకు లభించే స్వదేశీ ఉత్పత్తులకు దేశీయంగా మంచి మార్కెట్ ఉంటుంది. ఇవన్నీ జరిగితే అమెరికా సుంకాల ప్రభావం నుంచి భారత్ త్వరలోనే గట్టెక్కే అవకాశం ఉంటుంది.