Monsoon Session 2025: పార్లమెంటు సమావేశాలకు వేళాయింది. వర్షాకాల పార్లమెంటు సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 21 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తరువాత మొదటిసారిగా ఉభయ సభలు సమావేశమవుతున్నాయి. 21 రోజులపాటు జరగనున్న ఈ సమావేశాలు వాడీవేడిగా కొనసాగనున్నాయి.
ఈ సమావేశాల్లో మొత్తం 17 బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం యోచిస్తోంది. అందులో ఎనిమిది కొత్త బిల్లులు ఉండటం గమనార్హం. ఈ బిల్లుల్లో నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు, జియో హెరిటేజ్ సైట్స్, జియో రెలిక్స్ బిల్లు, మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లు, నేషనల్ యాంటీ డోపింగ్ బిల్లు, మణిపూర్ వస్తు సేవల పన్ను బిల్లు వంటి ప్రధాన అంశాలు ఉన్నాయి. ఇవి ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో చర్చకు దిగితే, విస్తృతంగా రాజకీయ ప్రతిస్పందన వచ్చే అవకాశముంది.
ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇన్‌కం ట్యాక్స్ – 2025 బిల్లును కూడా.. ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ బిల్లు పన్నుల పరంగా సంస్కరణలకు దారితీస్తుందా అనే ప్రశ్నపై ఆర్థికవేత్తలు, పార్లమెంటరీ సభ్యులు దృష్టిసారించారు. అదే సమయంలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై.. అభిశంసన తీర్మానాన్ని కూడా పార్లమెంట్ ముందుకు తేర్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇది న్యాయవ్యవస్థపై ప్రభావం చూపే అంశంగా భావిస్తున్నారు నిపుణులు.
ఆపరేషన్ సిందూర్ తరువాత ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలని.. INDIA బ్లాక్ పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చాయి. అయితే కేంద్రం వాటిని పట్టించుకోకుండా.. ప్రస్తుత వర్షాకాల సమావేశాలకే పరిమితమైంది. ఈ అంశం కూడా సభల్లో ప్రతిపక్షాల విమర్శలకు వేదికకావొచ్చు.
ఇక అంతర్జాతీయ అంశాల్లో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు.. భారత్, పాక్ మధ్య కాల్పుల్లో ఐదు యుద్ధవిమానాలు నేలకొరిగినట్లు చేసిన ఆరోపణలు.. కూడా ఉభయ సభల్లో హాట్ టాపిక్‌గా మారనున్నాయి. కాల్పుల విరమణపై కేంద్రం వైఖరిని ప్రశ్నించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.
అంతేకాకుండా, ఇటీవల మణిపూర్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో భద్రతాపరమైన అంశాలు, అడవుల పరిరక్షణ, నీటి వనరుల పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలపై కూడా చర్చకు అవకాశం ఉంది. విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్ధంగా ఉండగా, అధికారపక్షం తన విధానాలు సమర్థించేందుకు వ్యూహాత్మకంగా సిద్ధమవుతోంది.
Also Read: మరాఠీ అర్థంకాని వాళ్లకు చెంపమీద చాచి కొట్టాలి.. ముంబైలో రాజ్ ఠాక్రే రెచ్చగొట్టే వ్యాఖ్యలు
మొత్తానికి, వర్షాకాల సమావేశాలు.. దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా గమనించే రాజకీయ వేదికగా మారనున్నాయి. ప్రధాన బిల్లులు, విమర్శలు, ప్రతిపక్షాల వ్యూహాలు.. అన్నీ కలిసి ఈ సమావేశాలను ఉత్కంఠభరితంగా మలుస్తున్నాయి.