Morbi Bridge Deaths : గుజరాత్ మోర్బీ బ్రిడ్జ్ కూలిన దుర్ఘటనలో 130 మందికి పైగా మరణించారు. అందులో 47 మంది చిన్నారులే ఉండడం హృదయ విదారకమైన విషయం. మృతి చెందిన వారిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. ప్రమాదంలో నదిలో పడ్డవారిలో కేవలం 130 మంది మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. మిగిలిన వారు నది బురదలో కూరుకుపోయి ఉంటారని సహాయక చర్యలు చేపడుతున్న వారు అంటున్నారు.
బ్రిటీష్ కాలం నాటి పురాతల బ్రిడ్జ్ ఎన్నో ఏళ్లుగా వడకంలో లేకుండా ఉంది. ఏడు నెలల క్రితం ఈ బ్రిడ్జిని రిపేర్ చేయమని ‘ఒరెవా’ అనే గోడగడియార రిపేరు సంస్థకి అప్పగించారు. గత నెల 26వ తేదీ నుంచి ఈ బ్రిడ్జ్.. ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. మచ్చూ నదిపై ఉండే కేబుల్ బ్రిడ్జ్‌ను సందర్శించి చూడ్డానికి అనేక మంది సెలవులు కావడంతో అక్కడికి వచ్చారు. దివాలీ సెలవులు.. ఆదివారం కూడా కావడంతో తల్లితండ్రులు తమ పిల్లలను మోర్బీ బ్రిడ్జ్ వద్దకు తీసుకొచ్చారు. ఒక్క సారిగా బ్రిడ్జ్ తెగిపోయి.. చిన్నారులతో సహా అందరూ ఆ నదిలో పడిపోవడం.. తలచుకుంటే భయానకంగా ఉంటుంది. ఈత వచ్చినా.. ఆ నదిలో ఉన్న బురద వల్ల అది సాధ్యం కాకపోవచ్చు.