Bomb Threat to Jaipur Schools During the Voting: సార్వత్రిక ఎన్నికల వేళ బాంబు బెదిరింపులు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయి. ఆదివారం ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు మరవకముందే మరో బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. సోమవారం ఉదయం జైపూర్‌లోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి, గుర్తు తెలియని వ్యక్తి పాఠశాల భవనాల్లో పేలుడు పదార్థాల గురించి హెచ్చరిస్తూ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఈమెయిల్ పంపారు.
బెదిరింపు సందేశాలను అనుసరించి, అనేక పాఠశాలను పోలీసు అధికారులు ఖాళీ చేయించారు. అలాగే బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, పోలీసు బలగాలను పాఠశాలల వద్దకు పంపించారు అధికారులు.
జైపూర్ పోలీసు కమిషనర్ బిజు జార్జ్ ఈ బెదిరింపుల స్వీకరణను ధృవీకరించారు. “పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని బాంబు బెదిరింపులకు సంబంధించిన సమాచారం మాకు అందింది. ప్రతిస్పందనగా, మేము మా పోలీసు బలగాలను, బాంబ్ స్క్వాడ్ బృందాలను ప్రభావిత ప్రాంతాలకు మోహరించాము.” అని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు.
Also Read: ఢిల్లీలో హై అలర్ట్.. ఎయిర్‌పోర్ట్, 10 ఆసుపత్రులకు బాంబు బెదిరింపు..
ఆదివారం ఢిల్లీ ఎయిర్ పోర్టుతో పాటు, బురారీ ఆసుపత్రి, సంజయ్ గాంధీ ఆసుపత్రి సహా 10 ఆసుపత్రులు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. కాగా గత కొన్ని రోజుల నుంచి ఢిల్లీ, అహ్మదాబాద్ సహా పలు ప్రాంతాల్లో పేలుడు పదార్థాలు అమర్చినట్లు బెదిరింపు ఈమెయిల్స్ వస్తూనే ఉన్నాయి.
సార్వత్రిక ఎన్నికల వేళ బాంబు బెదిరింపు ఈమెయిల్స్ కలకలం సృష్టిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా స్కూల్స్‌ను టార్గెట్ చేయడంతో తల్లిదండ్రలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.