Twitter : టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఎట్టకేలకు ట్విట్టర్ డీల్ ను పూర్తి చేశారు. 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్ ను సొంతం చేసుకున్నారు. ఇలా కొన్న వెంటనే… కొందరు కీలక ఉద్యోగులను అలా సాగనంపేశారు… మస్క్. కొందర్ని అవమానకర రీతిలో ఆఫీస్ నుంచి గెంటేసినంత పని చేశారని అమెరికా మీడియా అంటోంది.
ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌తో పాటు సీఎఫ్‌వో నెడ్ సెగల్, జనరల్ కౌన్సిల్ సీన్ ఎడ్జెట్, లీగల్ పాలసీ హెడ్ విజయ గద్దె సహా మస్క్ మరికొందర్ని తొలగించారు. ట్విట్టర్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు మస్క్ చేసిన ప్రకటనను కోర్టులో సవాల్ చేయడంలో… పరాగ్ అగర్వాల్, నెడ్ సెగల్, సీన్ ఎడ్జెట్, విజయ గద్దె కీలకపాత్ర పోషించారని… అందుకే వారిని సంస్థ నుంచి తప్పించారని ప్రచారం జరుగుతోంది. సీన్ ఎడ్జెట్ ను అయితే… కొందరు ట్విట్టర్ ఆఫీస్ నుంచి బయటికి పంపేశారని అమెరికా మీడియా అంటోంది. ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం జరిగిన రోజునే.. సంస్థలోని కీలక ఉద్యోగులపై తనకు నమ్మకం లేదని ట్విట్టర్ చైర్మన్ బ్రెట్ టేలర్ తో మస్క్ అన్నట్లు సమాచారం.
ట్విట్టర్ ను ఎందుకు కొన్నానో చెప్పారు… మస్క్. డబ్బు కోసం తాను ఈ పని చేయలేదని… మానవాళి, సమాజ శ్రేయస్సు కోసమే సామాజిక మాధ్యమాన్ని సొంతం చేసుకున్నానని చెప్పారు. హింసకు తావులేకుండా… ఆరోగ్యకరమైన వాతావరణంలో అనేక అంశాలపై చర్చించుకునేలా ఓ వేదిక ఉండాలి కాబట్టే… తాను ట్విట్టర్ ను కొన్నానన్నారు. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్లు చెప్పడానికి అందరికీ ట్విట్టర్ ఓ ఫ్రీ ప్లాట్ ఫామ్ కాదని… చట్టాలు, నిబంధనలకు కట్టుబడుతూనే అందరికీ అందుబాటులో ఉండేలా ట్విట్టర్ ను తీర్చిదిద్దుతామన్నారు… మస్క్.