BigTV English

Hindi vs Tamil : హిందీపై తమిళ తంబీల గోలేంటి? తెలుగు రాష్ట్రాలు సైలెంట్ ఎందుకు?

Hindi vs Tamil : హిందీపై తమిళ తంబీల గోలేంటి? తెలుగు రాష్ట్రాలు సైలెంట్ ఎందుకు?

Hindi vs Tamil : దేశంలో ఎప్పుడు హిందీ గురించిన ప్రస్తావన వచ్చినా.. తమిళనాడు వ్యతిరేకించేందుకు ముందుంటుంది. అది ఏ విషయమైన తమిళ నాయకులు మాత్రం హిందీని రాష్ట్రంలోకి అనుమతించేదే లేదని కరాఖండిగా చెబుతుంటారు. ఇందుకోసం రాజకీయ పోరాటాన్నీ సాగిస్తుంటారు. ఇటీవల తమిళనాడులో మళ్లీ ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. జాతీయ విద్యావిధానంలో భాగంగా అన్నీ రాష్ట్రాలు త్రిభాష సూత్రాన్ని అనుసరించాలని కేంద్రం నూతనంగా అమలు చేస్తున్న జాతీయ విద్యావిధానం-2020 స్పష్టం చేస్తోంది. కానీ.. తమిళనాడులో ఎప్పటికీ.. తమిళం, ఇంగ్లీష్ తప్పా హిందీ అమలు సాధ్యం కాదంటూ రాద్దాంతం మొదలు పెట్టింది. అక్కడి ప్రాంతీయ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు హిందీని బలవంతంగా రుద్దుతున్నారంటూ ఆందోళన చేస్తున్నారు.


ఈ విధానమే నెమ్మదిగా కర్ణాటకకు సైతం పాకుతుంది. కన్నడ ప్రజలు సైతం హిందీ మాట్లాడేది లేదని అంటున్నారు. ఇదే సందర్భంలో దక్షిణాధిలోనే ఉన్న తెలుగు రాష్ట్రాలు, కేరళ మాత్రం ఈ భాష ఆందోళనలను కనీసం పట్టించుకోవడం లేదు. సరికదా.. అసలు ఈ రెండు రాష్ట్రాల్లో చర్చలు కూడా జరగడం లేదు. స్థానిక భాషలపై ప్రభావం చూపుతుందని తమిళనాడు, కర్ణాటక గొడవ చేస్తుండగా.. ఈ రెండు రాష్ట్రాలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయి. ఈ పరిస్థితులకు ప్రధాన కారణాలేంటి.?

తమిళనాడులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. అక్కడ ఓ సభలో మాట్లాడుతూ.. వేల ఏళ్ల పురాతనమైన తమిళం భాషను మాట్లాడలేకపోతున్నందుకు క్షమించాలని కోరారు. అక్కడ ఇంకో భాష ఉద్యమానికి సిద్ధమంటూ సీఎం స్టాలిన్ ప్రకటించిన నేపథ్యంలో.. ఈ పర్యటన, వ్యాఖ్యాలు ఆసక్తికరంగా మారాయి. మరోవైపు.. హిందీ భాష అమలును వ్యతిరేకిస్తూ.. తమిళనాడు బీజేపీకి చెందిన నాయకురాలు, ప్రముఖ నటి ఖుష్బూ.. పార్టీకి రాజీనామా చేయడంతో.. ఈ అంశం మరింత చర్చనీయాంశంగా మారింది. హిందీని బ్యాగ్ డోర్ ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశపెట్టే వ్యూహాల్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమంటూ స్టాలిన్, అతని కొడుకు, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానిస్తున్నారు.


తెలుగు రాష్ట్రాల్లో హిందీపై కనిపించని వ్యతిరేకత

నిరక్షరాస్యతలో మంచి స్థానాల్లో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలు, కేరళ.. చాలా కాలం నుంచి స్థానిక మాతృ భాషతో పాటుగా హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విద్యాభ్యాసం సాగుతూనే ఉంది. పైగా.. ఇక్కడ హిందీపై పెద్దగా వ్యతిరేకత ఎప్పుడూ కనిపించదు. దక్షిణాధి రాష్ట్రాల్లోని అన్ని ప్రత్యేకతలున్నా, చదువులో ముందు వరుసలో ఉన్నా.. తమిళనాడు మాదిరి మాత్రం వ్యతిరేకించిన దాఖలాలు కనిపించవు. అందుకు అనేక కారణాలు ఉన్నాయంటారు పరిశీలకులు.

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ రాష్ట్రంలో మాతృ భాషలకు విలువ ఇస్తూనే విద్యార్థులకు విస్తృతమైన సమాచారాన్ని అందుకునేందుకు ఇతర భాషల్ని నేర్పించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక్కడి ప్రజల ముందు చూపు కూడా హిందీ భాషా వ్యతిరేకత లేకండా ఉండేందుకు కారణం అంటున్నారు. హిందీ, ఇంగ్లీష్ నేర్చుకుంటే దేశంలో ఎక్కడైనా ఉద్యోగ, ఉపాధీ అవకాశాలు పొందవచ్చనే ఆలోచన ఇక్కడి ప్రజల్లో ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

వాస్తవానికి ఏపీ ఎప్పుడూ హిందీని వ్యతిరేకించిన దాఖలాలు లేవు. ఒకవేళ వ్యతిరేకించాలన్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో అది వీలు కాదని అంటున్నారు. ఎందుకంటే.. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉండడంతో.. రాజకీయ వైఖరుల్ని, కేంద్రానికి ఇబ్బంది కలిగే అంశాల జోలికి వెళ్లే అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగంగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో హిందీ వ్యతిరేకత గురించి పెద్దగా చర్చ జరగడం లేదు. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. ఇక్కడ హైదరాబాద్ వంటి మల్టీలింగ్వల్ సిటీలో హిందీ మాట్లాడే వారి సంఖ్య ఎక్కువ. తెలంగాణ ప్రజలు హిందీ భాషను పెద్ద సమస్యగా చూడడం లేదు. హైదరాబాద్ కు చుట్టుపక్కల జిల్లాల్లోనూ హిందీ బాగానే మాట్లాడుతుంటారు. పైగా.. మహారాష్ట్ర బోర్డర్ ఉన్న జిల్లాల్లో అయితే.. హిందీ, కాస్తోకూస్తో మరాఠి సైతం ఎలాంటి అభ్యంతరాలు లేకుండా మాట్లాడేస్తుంటారు. కాబట్టి.. తెలంగాణ జిల్లాల్లో ఎక్కడా హిందీపై వ్యతిరేకత కనిపించదు. పైగా.. ఇక్కడి విద్యార్థులు దేశంలోని విస్తృత అవకాశాల్ని అందిపుచ్చుకునేందుకు హిందీని నేర్చుకోవాలని చూస్తుంటారు.

భాషాభిమానంలో తమిళ, కన్నడ రాష్ట్రాలు ముందేనా?

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో హిందీ వ్యతిరేకత బలంగా వ్యక్తమవుతోంది. దీనికి అనేక కారణాలున్నాయి. వాటిలో మొదటిది.. రాజకీయ కారణాలు. తమిళనాడులో మొదటి నుంచి భాష, సంస్కృతిని ఆధారంగా చేసుకునే రాజకీయాలు నడిచాయి. అక్కడి వారిలో చాలా మందికి హిందీ సహా ఇతర భాషలు వచ్చినా వాళ్లు మాత్రం తమిళంలోనే మాట్లాడుతుంటారు. అదేమిటంటే.. భాషాధిమానం అంటుంటారు.

అక్కడి రాజకీయ పార్టీలు దశాబ్దాలుగా నూరిపోయిన విధానం కారణంగా అలాంటి ఆలోచన అక్కడి ప్రజల్లో నాటుకుపోయిందని చెబుతుంటారు. ఇప్పటికీ తమిళనాడు రాజకీయ పార్టీలకు భాషా సంరక్షణ ఓ కీలక అంశంగానే ఉంది. ఈ కారణంగా హిందీ వ్యతిరేకతను వారు రాజకీయ ప్రయోజనాలకు వినియోగిస్తుంటారు. అలాగే.. తమిళ, కన్నడ భాషలను మాట్లాడే ప్రజలు తమ భాషను కాపాడుకోవాలనే ఉద్దేశంతో హిందీని వ్యతిరేకిస్తున్నారు.

వేరే ఇతర భాషలు ప్రవేశిస్తే.. తమ భాషలోని ప్రభావం, చాలా పదాలు కనుమరుగు అవుతాయని అక్కడి భాషాభిమానుల భయం. అందుకే.. ఇక్కడి వాళ్లు ఎక్కువగా హిందీని వ్యతిరేకిస్తున్నారు. ఇక కర్ణాటక విషయానికి వస్తే.. ఇక్కడి రాజధాని నగరమైన బెంగళూరులో హిందీ మాట్లాడే ఉత్తరాది ప్రజల సంఖ్య పెరుగుతుండటంతో కన్నడ ప్రజలు భాషాపై మరింత ఆందోళన చెందుతున్నారు.

భాషా పరిరక్షణలో జనాభా అంశం?

చంద్రబాబు నాయుడు ఇటీవల దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్తరాది ప్రజల సంఖ్య పెరుగుతోందని, భాషను కాపాడుకోవాలంటే మన జనాభాను కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. చాలా సందర్బాల్లో జనాభా పెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడుతున్నారు. ఇది భాష సంరక్షణకు సంబంధించిన కొత్త కోణం అంటున్నారు. భవిష్యత్‌లో స్థానిక భాషలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అన్నా, ఈ భాషలు కనుమరుగు అవ్వకూడదన్నా.. స్థానిక జనాభా పరిరక్షణ చాలా ముఖ్యమంటున్నారు.

దక్షిణాదిలో భాషా సంరక్షణ విషయంలో వివిధ రాష్ట్రాలు భిన్న ధోరణులను అవలంభిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలు హిందీ భాషపై సానుకూల, ఆశావాద దృక్పథంతో వ్యవహరిస్తుంటే.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు మాత్రం హిందీని బలంగా వ్యతిరేకిస్తున్నాయి. వారి స్థానిక భాషల పరిరక్షణపై దృష్టి పెడుతున్నాయి. భవిష్యత్‌లో ఈ భాషా రాజకీయం ఎలా మారుతుందో చూడాలి.

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×