
NDRF : షాలీమార్-చెన్నై కోరమాండల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైన 30 నిమిషాల్లోపే ఎన్డీఆర్‌ఎఫ్ తొలి బృందం ఘటనాస్థలికి చేరుకుంది. వెంటనే సహాయక చర్యలు చేపట్టింది. బోగీల్లో చిక్కుకున్న వారిలో చాలామందిని కాపాడింది. ఈ బృందం అంత వేగంగా అక్కడకు చేరుకోవడానికి కోరమాండల్‌లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారమే కారణం. అతను కూడా ఎన్డీఆర్ఎఫ్ లోనే పని చేస్తున్నారు. ఆ వ్యక్తి ప్రమాదం జరిగిన నిమిషాల వ్యవధిలోనే జీపీఎస్ లొకేషన్, ప్రమాదం ఫొటోలను ఎన్డీఆర్ఎఫ్ ఉన్నతాధికారులకు పంపారు.
రైలు ప్రమాదానికి గురైన సమయంలో ఎన్డీఆర్ఎఫ్ జవాన్ వెంకటేశన్ ఎన్‌కే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బీ-7 కోచ్‌లోని 68 నెంబర్ సీటులో ఉన్నారు. శుక్రవారం రాత్రి దాదాపు 7 గంటల సమయంలో రైలు ప్రమాదానికి గురైంది. అతనికి ఎదురుగా స్లీపర్ బెర్తులో పడుకొన్న వ్యక్తి కిందపడ్డాడు. ఓ తల్లిచేతిలో ఉన్న బిడ్డ కిందపడింది. భారీ బాంబుపేలుడు జరిగిందేమోనని వెంకటేశన్ భావించారు. వెంటనే అప్రమత్తమై రైలు బోగి నుంచి బయటకు వచ్చేశారు.
ఫోన్‌లో టార్చ్‌ను ఆన్ చేసి కోచ్‌ల్లో చిక్కుకొన్న వారిలో కొందరిని కాపాడారు. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడకు చేరుకొన్న స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. పరిస్థితి ఘోరంగా ఉండటంతో వెంటనే ఇన్‌స్పెక్టర్‌కు ఈ విషయాన్ని ఫోన్‌లో తెలిపారు. ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకున్నారు. ప్రమాద ఫోటోలను అధికారులకు పంపారు. వారికి జీపీఎస్ లొకేషన్ షేర్ చేశారు.
వెంకటేశన్ ద్వారానే తొలుత సమాచారం అందిందని ఎన్డీఆర్‌ఎఫ్ డీఐజీ మొహిసీన్ షాహెది తెలిపారు. దీంతో హెడ్‌క్వార్టర్స్‌లోని సీనియర్ అధికారి అప్రమత్తమయ్యారని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే బాలేశ్వర్‌లోని తొలి ఎన్డీఆర్‌ఎఫ్ బృందం ఘటనా స్థలికి చేరిందన్నారు. ఆ తర్వాత మిగిలిన బృందాలు అక్కడకు వచ్చాయని వివరించారు. 300 మంది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వేగంగా స్పందించడం వల్లే వందల మందిని కాపాడగలిగారు.
Perni Nani : పవన్ కళ్యాణ్ వీకెండ్ పొలిటీషియన్ : పేర్ని నాని