NEET Exam Paper Leak: దేశ వ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పేపర్ లీక్ చేశారని, పరీక్షల్లో రిగ్గింగ్ చేశారని జరిగిందని కొంతమంది అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ అభ్యర్థులు కోర్టులను సైతం ఆశ్రయించారు. నీట్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు.
దర్యాప్తులో సంచలన విషయాలు..
బీహార్‌లో నీట్ అక్రమాలపై జరుగుతున్న దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నీట్ అక్రమాలకు సంబంధించి బీహార్ పోలీసులు ఇప్పటివరకు 14మందిని అరెస్టు చేశారు. వీరిలో ఇంజనీర్ కూడా ఉండడం గమనార్హం. దర్యాప్తులో నీట్ పేపర్ లీక్ చేసిన ముఠా.. రూ.30లక్షల చొప్పున చాలామందికి అమ్మినట్లు బయటపడింది. ఇదే విషయంపై రూ.30 లక్షలు ఇచ్చి నీట్ పేపర్ కొనుగోలు చేశామని ప్రాథమిక విచారణలో కొంతమంది అభ్యర్థులు అంగీకరించారు.
పక్కా ప్లాన్..
బీహార్‌లో పేపర్ లీక్ చేసిన వ్యక్తులు తెలివిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. లీకేజీ వ్యవహారం బయటకు పొక్కకుండా పక్కా ప్లాన్ చేశారు. ఎవరైతే డబ్బులు ఇచ్చారో..ఆ అభ్యర్థులను ప్రత్యేక ప్రాంతాలకు తరలించారు. అక్కడే వారికి పేపర్ ఇచ్చారు. జవాబులు కూడా చెప్పి నేరుగా పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లినట్లు తెలిసింది. మధ్యలో ఎవరినీ కలవనివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో బయటపడింది.
కొనసాగుతున్న దర్యాప్తు
నీట్ పేపర్ లీకేజీపై బీహార్ పోలీసు శాఖకు చెందిన ఈఓయూ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇప్పటికే పలువురు అభ్యర్థులతో పాటు అనుమానితులను ప్రశ్నించింది. మొత్తం 13మంది అభ్యర్థులు ఈ పేపర్ లీక్‌లో భాగస్వాములైనట్లు అధికారులు తెలిపారు. ఇందులో నలుగురిని అరెస్ట్ చేయగా.. మరో 9మందికి నోటీసులు జారీ చేశారు. సోమ, మంగళవారాల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. వీరంతా బీహార్ లో వేర్వేరు జిల్లాలకు చెందిన వారు కావడం విశేషం.