Nimisha Priya case: చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. భారతీయ నర్సు నిమిషప్రియ విషయంలో అదే జరిగింది. ఆమె ఉరిశిక్షను రద్దు చేస్తున్నట్లు యెమెన్ అధికారులు కీలక ప్రకటన చేశారు. దీంతో ప్రియ కుటుంబసభ్యులు ఆనందంలో మునిగితేలుతున్నారు.
మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిష ప్రియ బిగ్ రిలీఫ్. ఆమె ఉరిశిక్షను రద్దు చేస్తున్నట్లు యెమెన్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. భారత గ్రాండ్ ముఫ్తీ,సున్నీ లీడర్ కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం నుంచి సోమవారం రాత్రి ఈ ప్రకటన వెల్లడైంది.
ఈ నిర్ణయం తీసుకునే ముందు యెమెన్ రాజధాని సనాలో ఓ కీలక సమావేశం జరిగింది. ఈ భేటీకి ఉత్తర యెమెన్ అధికారులు, అంతర్జాతీయ దౌత్య ప్రతినిధులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ప్రియ ఉరిశిక్ష రద్దు కోసం భారత గ్రాండ్ ముఫ్తీ విజ్ఞప్తి మేరకు యెమెన్‌లో సూఫీ ముఖ్య పండితుడు షేక్ హబీబ్ ఒమర్ బిన్ హఫీజ్ చర్చల కోసం ఓ బృందాన్ని నియమించారు.
మరోవైపు అబుబాకర్ ముస్లియార్ ఉత్తర యెమెన్ ప్రభుత్వం-అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వం నెరిపారు. ఆ చర్చలు ఫలించడంతో నిమిషప్రియ ఉరిశిక్ష రద్దుకు యెమెన్ అంగీకరించినట్లు ముఫ్తీ కార్యాలయం వెల్లడించిన ప్రధాన సారాంశం.
విదేశాంగ వెర్షన్ ఏంటి?
నర్సు నిమిషప్రియ ఉరిశిక్ష రద్దు వ్యవహారంపై భారత విదేశాంగ శాఖ వర్గాలు రియాక్ట్ అయ్యాయి. కొంతమంది వ్యక్తుల నుంచి వచ్చిన సమాచారం అవాస్తవమని తేల్చింది. దీనిపై యెమెన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం తమకు రాలేదని పేర్కొంది. దీంతో నిమిష ప్రియ కేసు మళ్లీ మొదటికి వచ్చింది.
ALSO READ: స్టార్‌లింక్‌పై కేంద్రం ఆంక్షలు.. కేవలం వారికి మాత్రమే, నెట్ స్పీడ్‌కు బ్రేకులు
మత పండితుల జోక్యంతో నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు అయినట్లు పేర్కొంది. ఆమె విడుదలపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. నిమిష ప్రియ జైలు నుంచి విడుదల అవుతుందా? జీవిత ఖైదు పడే అవకాశం ఉందా? అనే దానిపై ఉత్కంఠ కంటిన్యూ అవుతుంది. మరణించిన యెమెన్ పౌరుడు తలాల్ మహదీ కుటుంబసభ్యులతో చర్చల తర్వాత తదుపరి నిర్ణయం వెలువడే ఛాన్స్ ఉంది.
భారత ప్రభుత్వం,గ్రాండ్ ముఫ్తీ అబూ బకర్ అహ్మద్ సహా కొంతమంది మత పెద్దలు ఈ కేసులో జోక్యం చేసుకున్నారు. యెమెన్ హౌతీ అధికారులు గతంలో శిక్షను సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఉరిశిక్షను అధికారికంగా రద్దు చేయడంతో నిమిషాకు కొత్త జీవితం ఇచ్చినట్లైంది.
షేక్ అబూ బకర్ అహ్మద్ ఇస్లామిక్ పండితుడు. షరియా చట్టంపై ఆయనకు లోతైన పరిజ్ఞానం ఉంది. భారతదేశంలో గ్రాండ్ ముఫ్తీ అనే బిరుదు అనధికారికంగా ఉన్నప్పటికీ, దేశంలోని సున్నీ ముస్లిం సమాజంలో ఓ కీలకమైన వ్యక్తిగా పరిగణించబడతారు.