NXT Conclave 2025 : దశాబ్దాలుగా ప్రపంచానికి అవసరమైన మానవ వనరుల్ని మాత్రమే అందిస్తు వస్తున్న భారత్.. నేడు అంతర్జాతీయ కర్మాగారంగా మారుతోందని సంతోషం వ్యక్తం చేశారు. 2047 నాటికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు అవుతుందని అప్పటి వరకు దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. భారత్ అంటే కేవలం శ్రామిక శక్తి మాత్రమే కాదని.. ఇప్పుడు ప్రపంచ శక్తిగా మారామని వ్యాఖ్యానించారు. దేశ రాజధాని దిల్లీలో నిర్వహించిన NXT సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. ప్రపంచం ఇప్పుడు మనల్ని గమనిస్తోందన్నారు. మనపై పూర్తి విశ్వాసాన్ని, విశ్వసనీయతను ఉంచుతోందని అన్నారు.
భారత్ లో తయారీని పెంచేందుకు చేపట్టిన ‘వోకల్ ఫర్ లోకల్’ మంచి ఫలితాల్ని అందిస్తుందని వెల్లడించిన ప్రధాని మోదీ.. ఈ విధానం కింద స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేపట్టిన చొరవను ప్రముఖంగా ప్రస్తావించారు. ఆ ఫలితంగా.. భారతీయ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఏర్పడిందని అన్నారు. భారత్ అంటే ఇప్పుడు సెమీకండక్టర్ల నుంచి విమాన వాహక నౌకల వరకు తయారు చేస్తోందని.. వీటిని దేశీయ అవసరాలు తీర్చుకోవడంతో పాటు ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేస్తోందని వివరించారు. భారత్ ను సందర్శించేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయని అన్నారు.
దేశంలో తన ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం ఉంచారని.. గత 60 ఏళ్లల్లో తొలిసారి ఒకే ప్రభుత్వానికి వరుసగా మూడుసార్లు అధికారం అప్పగించారన్న ప్రధాని మోదీ.. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ గత 11 ఏళ్లుగా అనేక విజయాలు సాధించినట్లు తెలిపారు. ప్రపంచ దేశాలకు భారత్ పై నమ్మకం పెరిగిందని.. మన చిరు ధాన్యాలు, పసుపు సహా అనేక ఉత్పత్తులు స్థానిక మార్కెట్ల నుంచి ప్రపంచ మార్కెట్లకు విస్తరించాయని, ప్రపంచంలోని మొత్తం పసుపు ఎగుమతుల్లో.. ఏకంగా 60% కంటే ఎక్కువ మన దగ్గర నుంచే సరఫరా అవుతోందని వెల్లడించారు. ప్రపంచ వేదికపై భారతీయ ఉత్పత్తులు తమదైన ముద్ర స్తున్నాయని అన్నారు.
ప్రపంచానికి ఉత్పత్తులను అందించడమే కాదని.. ఇంటర్నేషనల్ సప్లై చైన్ లో విశ్వసనీయమైన దేశంగా మారుతోందని అన్నారు. దేశీయంగానూ అనేక మంది జీవితాలు వేగంగా పేదరికం నుంచి బయటిపడి.. మెరుగైన స్థితికి చేరుకుంటున్నాయని అన్నారు. దేశంలో తొలిసారి విద్యుత్ కనెక్షన్లు అందుకున్న ప్రజలు 2.5 కోట్లకు పైగానే ఉందన్న ప్రధాని.. పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకునే, సాధించగల సామర్థ్యం మన దేశానికి ఉందని నిరూపించుకుంటున్నామని అన్నారు. దేశంలోని విప్లవాత్మక మార్పులకు ‘కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన’ అనే విధానంతో సాధ్యమవుతోందన్న ప్రధాని.. గత దశాబ్ద కాలంలో దాదాపు 1,500 వాడుకలో లేని చట్టాలను రద్దు చేసినట్లు వెల్లడించారు. ఆ వాడుకలో లేని చట్టాలలో ఒకటి నాటక ప్రదర్శనల చట్టం అని అన్నారు. దీని ద్వారా 70 ఏళ్లుగా బహిరంగ ప్రదేశాల్లో నృత్యం చేసే వ్యక్తులను అరెస్టు చేసేందుకు వీలు కల్పిస్తుందని అన్నారు.
Also Read : Delhi Govt : ఆ వాహనాలకు పెట్రోల్, డీజిల్ బంద్ – వాహనదారులకు షాకిచ్చిన ప్రభుత్వం
ప్రపంచానికి సున్నాను పరిచయం చేసిన భారత్.. ఇప్పుడు అనంతమైన ఆవిష్కరణలకు కేంద్రంగా మారుతోందని అన్నారు. భారత్ రోజురోజుకు అద్భుతమైన ఆవిష్కరణలు చేస్తోందని అన్నారు. భారతదేశం సరసమైన, అందుబాటులో ఉండే పరిష్కారాలను సృష్టిస్తోందన్నారు. వాటిలో ఒటకి యూపీఐ పేమెంట్ వ్యవస్థ అన్నారు. ఈ విధానాన్ని ఫ్రాన్స్, UAE, సింగపూర్ వంటి దేశాలు తమ ఆర్థిక పర్యావరణ వ్యవస్థలతో అనుసంధానిస్తున్నాయని తెలిపారు.