Jagannath Temple: ఒడిశా పూరీ జగన్నాథ ఆలయానికి ఓ లెక్క ఉంది. అక్కడ చేసే పూజలకు ఆచార వ్యవహారాలు ఉన్నాయి. రథయాత్రలు జరిగే సమయానికి ఓ నియమం ఉంది. జగన్నాథుడి భక్తులకు ఒక సెంటిమెంట్ ఉంది. మరి అదే ఆలయ రూపం.. అదే ఆలయ పేరు.. అవే రథయాత్రలు.. అచ్చం అలాగే పూజలు వీటితో 12వ శతాబ్దానికి చెందిన పూరీ ఆలయ ఆచార వ్యవహారాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం వచ్చిందంటున్నారు. అందుకే కాపీరైట్ ప్రొటెక్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఎందుకు ఈ జగన్నాథ ఆలయం చుట్టూ వివాదం పెరుగుతోంది?
దిఘాలో జగన్నాథ్ ధామ్ అని పేరు పెట్టడంపై అభ్యంతరాలు
ఒక్కసారి ఈ టెంపుల్ చూస్తే.. దూరం నుంచి చూస్తే అంతా ఏమనుకుంటారు.. పూరీలోని జగన్నాథస్వామి ఆలయమే అనుకుంటారు. కానీ ఇది బెంగాల్ లోని మేదినిపూర్ జిల్లా దిఘాలో ఏర్పాటైన కొత్త ఆలయం. బెంగాల్ గవర్నమెంట్ నిర్మించింది. కలింగన్ ఆర్కిటెక్చర్ లో నిర్మించారు. జగన్నాథ బలభద్రులు సుభద్రాదేవి సమేతంగా భక్తులకు దర్శనమిస్తున్నారు. జగన్నాథుడి కొత్త ఆలయం నిర్మించడంలో తప్పేమి ఉంది అని అనుకోవచ్చు. తప్పు లేకపోయినా అసలైన పూరి జగన్నాథ ఆలయం నుంచి ఒడిశా నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఎందుకంటే జగన్నాథుడి శాశ్వత నివాసం పూరీనే అని, ఆ పేరును దిఘాలోని టెంపుల్ కు జగన్నాథ్ ధామ్ అని పేరు పెట్టడం కరెక్ట్ కాదన్న వాదన తెరపైకి వచ్చింది. అదీ సంగతి.
పూరి సంప్రదాయాలపై కాపీరైట్ దిశగా చర్యలు
ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే.. బెంగాల్ లో తృణమూల్ ప్రభుత్వం. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం. ఈ వ్యవహారం రాజకీయంగా వేడెక్కడానికి ఇది కూడా ఒక రీజన్ అయింది. పైగా మమతా బెనర్జీ జగన్నాథ్ ధామ్ అని పేరు పెట్టడంతో మ్యాటర్ చాలా దూరం వెళ్లింది. ఓవైపు బెంగాల్ ప్రభుత్వం, ఇంకోవైపు ఇస్కాన్.. ఎప్పుడు పడితే అప్పుడు.. ఎలా పడితే అలా పూజలు చేస్తే ఎలా అన్న చర్చ మొదలైంది. అందుకే ఒడిశా ప్రభుత్వం పురీ జగన్నాథ ఆలయంలో జరిగే ఆచారాలు, సంప్రదాయాలు, రథయాత్ర వంటి కార్యక్రమాలను కాపీరైట్ చేయాలని డిసైడ్ అవడం కీలకంగా మారింది. ఈ చర్య ఆలయ సంప్రదాయాలను కాపాడడానికి, అనధికారికంగా ఇతరులు వాడకుండా చూసే ఉద్దేశం అంటున్నారు పూరీ గజపతి మహారాజా దివ్యసింగ దేబ్.
పేరు మార్చాలని బెంగాల్ సీఎంకు లేఖ రాసిన ఒడిశా సీఎం
జగన్నాథ ఆలయ ఆచారాలు శతాబ్దాల నాటి సంప్రదాయాలతో రన్ అవుతున్నాయి. వీటిని రక్షించడం తమ బాధ్యత అని అంటున్నారు. బెంగాల్‌లోని దీఘాలో నిర్మించిన కొత్త ఆలయాన్ని జగన్నాథ ధామ్ అని పిలవడంపై ఒడిశా ప్రభుత్వం, ఆలయ పండితులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జగన్నాథ ధామ్ అనే పేరు సాంప్రదాయకంగా పురీలోని జగన్నాథ ఆలయానికి మాత్రమే వాడాలని, ఇతరులు ఈ పేరును వాడుకోవడం సంప్రదాయానికి విరుద్ధమంటున్నారు. ఈ విషయంలో ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి లేఖ కూడా శారు. దిఘాలోని ఆలయ పేరును మార్చాలని కోరారు. జగన్నాథ ఆలయం ఒడిశా సంస్కృతికి గుండె లాంటిదని దాని పేరును ఇతర ప్రాంతాల్లో ఉపయోగించడం ఒడిశా ప్రజల మనోభావాలకు ఇబ్బంది అన్నారు.
విదేశాల్లో ఎప్పుడంటే అప్పుడు రథయాత్రలు
అంతే కాదు ఇస్కాన్ సంస్థ కూడా విదేశాల్లో జగన్నాథ రథయాత్రలను చేస్తుంటుంది. అయితే సంప్రదాయబద్ధంగా ముహూర్తం ప్రకారం నిర్వహించాల్సిన ఈ రథయాత్రలను సంవత్సరం పొడవునా నిర్వహించడం కరెక్ట్ కాదంటున్నారు గజపతి మహారాజా. ఈ విషయంలో ఇస్కాన్‌తో చర్చలు జరుగుతున్నాయని, ఈ పద్ధతిని ఆపేయాలని కోరామన్నారు. సో ఒడిశా వాసుల మనోభావాల ప్రకారం చూసినా పూజల విషయంలో కాపీరైట్ వ్యవహారాలు కొత్త చర్చలకు తెరలేపాయి. అంతే కాదు దిఘాలోని టెంపుల్ నిర్మాణంలో పూరీ ఆలయంలో కీలకమైన వారు పాలు పంచుకున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి.
దిఘా జగన్నాథ ఆలయాన్ని నిర్మించిన బెంగాల్ ప్రభుత్వం
దిఘా జగన్నాథ ఆలయాన్ని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వమే నిర్మించింది. ఈ ప్రాజెక్టును 2018లో సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. నిర్మాణ బాధ్యతను వెస్ట్ బెంగాల్ హౌసింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కు అప్పగించారు. దిఘా-శంకర్‌పూర్ డెవలప్‌మెంట్ అథారిటీ ఈ ఆలయ నిర్మాణం కోసం 20 ఎకరాల భూమిని సమకూర్చింది. 2022 మేలో అక్షయ తృతీయ సందర్భంగా నిర్మాణం ప్రారంభమై, 2025 ఏప్రిల్ 30న ఆలయం ప్రారంభోత్సవం జరిగింది. ఈ ఆలయ నిర్మాణానికి 250 కోట్ల దాకా ఖర్చు అయింది. ఇది బెంగాల్ ప్రభుత్వ నిధులతో నిర్మించారు. అయితే వచ్చే ఏడాది బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో జగన్నాథుడి చుట్టూ పెద్ద జగడమే నడుస్తోంది.
నెక్ట్స్ మమతా బెనర్జీ ఏం చేయబోతున్నారు?
పూరీ జగన్నాథ ఆలయానికే ప్రత్యేకమైన రథయాత్రలు మిగితా చోట్ల జరిగితే ఇబ్బందా? పూరీ ఆలయ పవిత్రతకు భంగమా..? దేవత విగ్రహాల తయారీ రహస్యమేంటి? అదే కలపను బెంగాల్ ఆలయంలో ఉపయోగించారన్నది నిజమా? ఈ రెండు ఆలయాల చుట్టూ అసలు ఇంతలా కాపీ పేస్ట్ వ్యవహారం ఏం జరిగింది.. అది కాపీ రైట్ ప్రొటెక్ట్ దాకా ఎలా వెళ్లింది.. నెక్ట్స్ మమతా బెనర్జీ ఏం చేయబోతున్నారు? ఒడిశా గవర్నమౌంట్ చర్యలు ఎలా ఉండబోతున్నాయ్?
అసూయపడుతున్న వాళ్లే విమర్శిస్తున్నారన్న దీదీ
ఓట్లు పడాలంటే అన్ని వర్గాల ప్రజల మద్దతు అవసరం. హిందూ ఆలయాన్ని నిర్మించడం ద్వారా మమతా బెనర్జీ ఆ విషయంలో పొలిటికల్ గా ఏదైనా స్టెప్ వేశారా అన్న చర్చ జరుగుతోంది. దీంతో మ్యాటర్ బెంగాల్, ఒడిశా ప్రభుత్వాల మధ్య కొత్త చర్చకు దారి తీసింది. బెంగాల్ లో కొత్త జగన్నాథ్ టెంపుల్ నిర్మించడం తప్పు కాదని, అయితే ఆ ఆలయానికి జగన్నాథ్ ధామ్ అని పేరు పెట్టడాన్ని ఒడిశాలోని బిజెపి ప్రభుత్వం విమర్శించింది. అయితే మమతా బెనర్జీ కూడా కౌంటర్ ఎటాక్ చేశారు. దిఘా ఆలయాన్ని విమర్శిస్తున్న వారు అసూయపడుతున్నారన్నారు. కాళీఘాట్ స్కైవాక్, దక్షిణేశ్వర్ స్కైవాక్ నిర్మించినప్పుడు, దుర్గా పూజ చేసినప్పుడు మాట్లాడని వారు.. ఇప్పుడు జగన్నాథ్ ధామ్ పేరు పెట్టగానే ఎందుకు మాట్లాడుతున్నారని క్వశ్చన్ చేశారు. అంతే కాదు విగ్రహాల తయారీకి వేప కలపను తీసుకెళ్లామనడం కరెక్ట్ కాదన్నారు. అలా పూరీ నుంచి విగ్రహాల తయారీ కోసం కలపను దొంగలించాల్సిన అవసరం లేదన్నారు.
పూరీలో పని చేసే వాళ్లు దిఘా వెళ్లొద్దన్న ఆలయ కమిటీ
నిజానికి పూరీ జగన్నాథ ఆలయంలో రకరకాల పూజాధికాలు నిర్వహించేందుకు వేర్వేరుగా సహాయకులు ఉంటారు. దేవుడి గర్భగుడిలో ఉండేవారు, మహాప్రసాదం తయారు చేసే వారు, ఆలయానికి అలంకరణలు చేసే వారు, దేవతామూర్తులను కాపాడే బాధ్యతలను ఇలా రకరకాల సేవల ఆధారంగా పూరీలో అనేక సంఘాలు ఉన్నాయి. అయితే బెంగాల్ దిఘాలో నిర్మించిన ఆలయంలో జగన్నాథుడి సేవల్లో పాల్గొనేందుకు పూరీ సంఘాల్లో ఉన్న వారికి బెంగాల్ ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది. కొందరు దిఘాకు వెళ్లారు. ఇంకొందరు ఆగిపోయారు. అదీ సంగతి.
కళింగన్ నిర్మాణ శైలిలో నిర్మాణం
బెంగాల్ మేదినీపూర్ జిల్లాలోని దిఘా ఒడిశా పూరీ నుంచి 350 కిలోమీటర్ల దూరంలో ఉంది. పూరీలో ఎలాగైతే జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర పూజలు అందుకుంటున్నారు. 213 అడుగుల ఎత్తులో ఈ ఆలయాన్ని నిర్మించారు. కళింగన్ నిర్మాణ శైలిలో రాయితో కట్టారు. హైందవేతరులు, విదేశీయులు దిఘా మందిరంలోకి ప్రవేశానికి అర్హులు. పూరీలో మాత్రం హిందువులనే అనుమతిస్తారు. ఇది శతాబ్దాలుగా వస్తున్న ఆచారం. దిఘా ఆలయంలో విగ్రహాలు, పూరీలో విగ్రహాలు ప్రత్యేకమైన కలపతో తయారైనవే. ఇక్కడ మరో వివాదం ఏంటంటే.. పూరీలో విగ్రహాలను నబకలేబర అనే ప్రత్యేక ఆచారం ద్వారా మారుస్తారు. ఈ నబకలేబర ఆచారం సాధారణంగా ప్రతి 12 నుండి 19 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇది హిందూ పంచాంగం ప్రకారం నిర్దిష్ట ఖగోళ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. పూరీలో చివరగా 2015లో విగ్రహాలు తయారు చేశారు. అప్పుడు మిగిలిపోయిన కలపను దిఘాలో విగ్రహమూర్తులను తయారు చేయడానికి వాడారన్న ప్రచారం జరగడంతో ఒక్కసారిగా విమర్శలు పెరిగాయి.
అత్యంత రహస్యంగా, శాస్త్రోక్తంగా విగ్రహాల తయారీ
మరో విమర్శ ఏంటంటే.. జగన్నాథ బలభద్ర సుభద్ర విగ్రహాలను తయారు చేయడం అత్యంత రహస్యంగా నిర్వహిస్తారు. దైతపతి సేవకులు, శాస్త్రీయ నిబంధనల ప్రకారం రహస్యంగా, పవిత్రంగా నిర్వహిస్తారు. శాస్త్రోక్తంగా పరమ పవిత్రంగా చేయాల్సి ఉంటుంది. ఇది పూరిలోనే సాధ్యం. కానీ బెంగాల్ దిఘ ఆలయంలో చెక్కతో విగ్రహాలను ఎవరు తయారు చేశారు.. ఎలా చేశారు.. పూరిలో మిగిలిపోయిన కలపను ఎవరు తరలించారు.. ఇలాంటివన్నీ చర్చకు వచ్చాయి. జగన్నాథుడి విగ్రహాలు చెక్కతో తయారైనవి కాబట్టి, కాలం గడిచే కొద్దీ అవి దెబ్బతింటాయి. అందుకే వాటిని మారుస్తుంటారు. అయితే పూరీలోని కలపను దిఘాకు తీసుకెళ్లలేదని శ్రీ జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు చేసి గుర్తించింది.
పూరీ జగన్నాథ ఆలయం ఒడిశాకు కీలకం
పూరి ఆలయాన్ని తూర్పు గంగా రాజవంశ రాజు అనంతవర్మన్ 10వ శతాబ్దంలో పునర్నిర్మించాడు. ఇక్కడి రథయాత్ర ఏటా అద్భుతంగా జరుగుతుంటుంది. పూరీ జగన్నాథ ఆలయం హిందూ మతంలోని నాలుగు ధామాల్లో ఒకటి. బద్రీనాథ్, ద్వారక, రామేశ్వరం, పూరీ ఈ నాలుగింటికీ చాలా ప్రత్యేకత ఉంటుంది. అయితే ఇదే పేరును ఇతర దేవాలయాలకు పెట్టడం ద్వారా పూరీ ఆలయానికి ప్రత్యేకమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను తగ్గిస్తుందని ఒడిశా ప్రభుత్వం, పూరీ శంకరాచార్య నిశ్చలానంద సరస్వతి, ముక్తి మండప పండిత సభ, భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
2023లో పూరీకి 97.25 లక్షల పర్యాటకులు
పూరీ జగన్నాథ ఆలయం ఒడిశాలో ప్రముఖ పర్యాటక, ఆర్థిక, ఆధ్యాత్మక కేంద్రం. 2023లో ఒడిశాకు 97.25 లక్షల మంది దేశం నలు మూలల నుంచి వచ్చారు. ఇందులో 13.59 లక్షలు అంటే 14 శాతం భక్తులు బెంగాల్ నుండే ఉన్నారు. అంటే పెద్ద సంఖ్యే. అందుకే దిఘా ఆలయం పూరీ ఆలయాన్ని పోలి ఉండడంతో పూరీకి వచ్చే పర్యాటకుల సంఖ్య తగ్గే అవకాశం ఉందన్న ఆందోళన కూడా ఉంది. అయితే కొత్తగా నిర్మించిన ఆలయాలకు చారిత్రకంగా వెలసిన ఆలయాలకు ప్రాధాన్యత వేర్వేరుగా ఉంటుంది. సో ఇదంతా గొడవ ఎందుకని చెప్పి జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ జగన్నాథ ధామ్, శ్రీ మందిరం, మహాప్రసాదం, నీలాచల ధామ్, నీల చక్రం వంటి పదాలను పేటెంట్ చేయాలని నిర్ణయించింది. అయితే దేవుని పూజలను కాపీరైట్ చేయడం సాధ్యం కాదని మరికొందరు అంటున్నారు. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందన్నది చూడాలి.