పాకిస్తాన్ క్రీడాకారుడిని తన ఇంటికి ఆహ్వానించినందుకు భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రాపై సోషల్ మీడియాలో విమర్శలు వెళ్లువెత్తాయి. అయితే తాను అతడిని ఆహ్వానించింది పహల్గాం దాడికి ముందు అని, తనపై విమర్శలు చేయడంలో అర్థం లేదని అంటున్నారు నీరజ్ చోప్రా. సోషల్ మీడియాలో కొందరు కావాలనే తనను టార్గెట్ చేశారంటున్నారు. ట్విట్టర్లో తన బాధను వ్యక్తపరుస్తూ పోస్టింగ్ పెట్టారు.
అసలేం జరిగింది..?
నీరజ్ చోప్రా పేరు మీదుగా ఎన్సీ క్లాసిక్ జావెలిన్ ఈవెంటే ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మే నెల 24న ఈ పోటీలు బెంగళూరులో జరగాల్సి ఉంది. ఈ పోటీలకు పాకిస్తాన్ స్టార్ జావెలిన్ క్రీడాకారులు, ఒలంపిక్ మెడలిస్ట్ అర్షద్ నదీమ్ ని నీరజ్ చోప్రా ఆహ్వానించారు. బెంగళూరు రావాల్సిందిగా కోరారు. అయితే అర్షద్ ఆ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు. తాను ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ పోటీలకు కసరత్తులు చేస్తున్నానని, ఆ షెడ్యూల్ కి భంగం కలగడం ఇష్టంలేదని, అందుకే తాను రాలేనని తెలిపాడు. అంతే కాదు, తనని ఆహ్వానించినందుకు నీరజ్ చోప్రాకు ధన్యవాదాలు తెలిపాడు పాక్ క్రీడాకారుడు అర్షద్. ఇంతవరకు బాగానే ఉంది. పహల్గాం మారణకాండ జరిగిన తర్వాత ఈ వ్యవహారం అనుకోకుండా హైలైట్ అయింది. పాక్ క్రీడాకారుడిని నీరజ్ ఆహ్వానించడం సరికాదంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది.
పహల్గాం ఘటన తర్వాత పాకిస్తాన్ పై భారత్ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. పాక్ జాతీయుల్ని మన దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. పాక్ కి అందించే నీటి విషయంలో కూడా ఆంక్షలు పెట్టింది. ఇలాంటి సమయంలో పాక్ ఆటగాడిని ఒక భారత్ ఆడగాడు ఆహ్వానించడాన్ని భారతీయులు జీర్ణించుకోలేక పోతున్నారు. నీరజ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. నీరజ్ ఫ్యామిలీని కూడా టార్గెట్ చేశారు. నీరజ్ కి దేశభక్తి లేదని అంటూ ఆయన కుటుంబ సభ్యులపై కూడా ట్రోలింగ్ మొదలు పెట్టారు. అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు.
నీరజ్ ఆవేదన..?
బెంగళూరులో జరిగే ఎన్సీ క్లాసిక్ ఈవెంట్ కి సంబంధించి పాక్ ఆటగాడు అర్షద్ నదీమ్ ఆహ్వానించడంపై నీరజ్ చోప్రా తాజాగా వివరణ ఇచ్చారు. పహల్గాం దుర్ఘటన జరగక ముందే తాను ఆహ్వానం పంపానని చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడిలా తనపై విమర్శలు చేయడం దారుణం అని అన్నాడు. తన కుటుంబాన్ని కూడా అనవసరంగా విమర్శిస్తున్నారని, అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఎప్పుడూ దేశమే ముఖ్యమని అంటున్నారు నీరజ్ చోప్రా.
— Neeraj Chopra (@Neeraj_chopra1) April 25, 2025
దేశం కోసం తాను ఎన్నో ఏళ్లుగా కష్టపడ్డానని, ఇంకా కష్టపడుతూనే ఉన్నానని చెప్పాడు నీరజ్ జోప్రా. అయినా దేశంపై తన చిత్తశుద్ధిని ప్రశ్నించడం బాధగా ఉందని అన్నారు. ఇప్పుడైనా ఎప్పుడైనా దేశ ప్రయోజనాలే తన మొదటి ప్రాధాన్యం అన్నాడు. పహల్గాం ఘటనలో బాధిత కుటుంబాలకు మద్దతుగా నిలుస్తానన్నాడు. ఈ ఘటన విషయంలో తనకు బాధతోపాటు కోపం కూడా ఉందన్నారు. అయితే కారణం లేకుండా తనపై విమర్శలు చేయడం సరికాదన్నారు నీరజ్.