Pahalgam Terror Victim Recount| జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడి తీవ్ర కలకలం రేపింది. ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందిన పహల్గాంలో విహారయాత్రకు వెళ్లిన పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవికంగా దాడి చేశారు. ఈ దాడిలో మొత్తం 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ దాడిలో చనిపోయిన వారి కుటుంబాలు జరిగిన ఉదంతం గురించి చెబుతుంటూ హృదయం కలచి వేస్తుంది.
పహల్గాం ఉగ్ర దాడుల్లో చనిపోయిన పుణె వ్యాపారవేత్త సంతోష్ జగడాలె కూడా ఉన్నారు. ఆయన ఆ సమయంలో తన కుటుంబంతో సహా అక్కడ ఒక టెంట్ లో ఉండగా.. బయట నుంచి తుపాకీ కాల్పుల మోత వినిపించింది. ఆ తరువాత జరిగిన ఘటన గురించి అక్కడే ఉన్న సంతోష్ జగడాలె కూతురు అసావారి వివరించింది.
“కశ్మీరీ ప్రజల దుస్తులు ధరించిన ఓ నలుగురు తుపాకీతో కాల్పులు జరుపుతున్నారు. ఆ సమయంలో నేను మా అమ్మ ప్రగతి, నాన్నా సంతోష్ సమీపంలోని ఓ టెంట్ లో ఉన్నాము. మాతో పాటు పక్కనే టెంట్లు వేసుకొని ఇతర టూరిస్టులు కూడా ఉన్నారు. తుపాకీ కాల్పులు వినగానే బయట ఎక్కడో పోలీసులకు దుండగులకు ఏదో కాల్పులు జరుగుతున్నట్లుగా భావించాం. కానీ ఆ తుపాకీ కాల్పులు క్రమంగా మా పక్కనే ఉన్న టెంట్ నుంచి వినిపించాయి. అప్పుడే కాల్పులు ఆగిపోయాయి. కానీ మేమంతా బయటికి వెళ్లకూడదని భావించాం. అయితే అప్పుడే కాల్పులు జరిపే వ్యక్తి ‘బయటికి రారా చౌదరి అంటూ ఒకరిని లాక్కొని వచ్చాడు. ఆ తరువాత మా నాన్నను కూడా బయటికి తీసుకెళ్లారు.
నీవు మోడీని సమర్థిస్తున్నావా?, నీవు హిందువు కదా?’ అని ప్రశ్నించారు. ఆ తరువాత మా నాన్నను ఒక ఇస్లాం మంత్రం జంపించమని చెప్పారు. మా నాన్న అది చేయలేకపోయారు. అంతే ఆ వెంటనే మూడు బుల్లెట్లు.. ఒకటి మా నాన్న తల, ఒకటి చెవు, ఒకటి వీపు భాగంలోకి దూసుకెళ్లాయి. అంతటితో ఆగలేదు. పక్క టెంట్ లో ఉన్న మా బాబాయ్ ని కూడా లాక్కొని వచ్చి తుపాకీతో కాల్చి చంపారు. అంతా అయిపోయాక 20 నిమిషాల తరువాత పోలీసులు వచ్చారు. నన్ను మా అమ్మను అక్కడి నుంచి పోలీసులు, భద్రతా బలగాలు తీసుకెళ్లాయి. మా నాన్న, బాబాయ్ ఇంకా బతికే ఉన్నారేమోనని అనిపించింది.” అని ఆమె ఎంతో బాధపడుతూ చెప్పింది.
పహల్గాంలో ఉగ్రవాదుల చేత మరణించిన మొత్తం 26 మందిలో ఇద్దరు విదేశీయులు ఉన్నారు. మిగతా 24 మందిలో ఆరుగురు మహారాష్ట్రకు చెందినవారున్నారు. పుణె వ్యాపారవేత్త సంతోష్ జగడాలెతో పాటు మిగిలిన అయిదుగురిలో అతుల్ మానె, సంజయ్ లెలె, హేమంత్ జోషి, కౌస్తుంభ్ గన్ బోటె, దిలీప్ దోసాలె ఉన్నారు.
వీరిలో అతుల్ మానె (45) రైల్వేలో సీనియర్ సెక్షన్ ఇంజినీర్ గా ఉద్యోగం చేస్తున్నారు. ఆయన స్నేహితుడు వివేకానంద సామంత ఆయనను గుర్తు చేసుకుంటూ ప్రతిరోజు తనతో లోకల్ ట్రెయిన్ లో కలిసి ప్రయాణించే వాడని పహల్గామ్ ఇద్దరం కలిసి వెళదామనుకుని ప్లాన్ చేసుకున్నామని .. కానీ తాను వెళ్లలేకపోయానని తెలిపారు. నవి ముంబై నుంచి పహల్గాం టూర్ కు వెళ్లిన 39 మందిలో దిలీప్ దోసాలె కూడా ఉన్నారు.
ఉగ్రవాదులు దాడి చేయగానే అక్కడ ఉన్న పర్యటాకులు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. ఈ క్రమంలో నాగ్ పూర్ కు చెందిన ఒక మహిళ కింద పడి తొక్కిసలాటకు గురైంది. దీంతో ఆమె కాలికి రెండు ఫ్రాక్చర్లు అయినట్లు తెలిపింది.
Also Read: కశ్మీర్ పహల్గాం దాడి చేసింది ఈ మృగాలే.. అందుకే చంపాం అంటూ ప్రకటన
పహల్గాంలో ప్రకృతి మనోహరంగా ఉండడంతో దాన్ని కశ్మీర్ మినీ స్విట్జర్ ల్యాండ్ అని కూడా అంటారు. ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతంలో పర్యాటకులు రావడంతో స్థానికులకు మంచి బిజినెస్ కూడా జరుగుతుంది. కానీ ఉగ్రవాద దాడులు జరగడంతో వారందరూ సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందుకే ఉగ్రదాడులు జరగగానే పోలీసులతో పాటు స్థానికులు కూడా గాయపడిన వారిని కాపాడేందుకు సాయం చేశారు. చాలా మంది పర్యాటకులను తమ గుర్రాలపై కూర్చొబెట్టి అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
2019లో జమ్మూ కశ్మీర్ లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి తరువాత ఇదే అతిపెద్ద దాడి. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే కొత్త ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యతలు వహిస్తూ ప్రకటించింది. పాకిస్తాన్‌కు చెందిన నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాదులే ఈ కొత్త ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేశారు.