Pahalgam Terror Attack| జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ బైసరన్ ప్రాంతంలో మంగళవారం పర్యాటకులపై దాడి చేసినట్లుగా ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)’ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. కశ్మీర్ ప్రత్యేక దేశ సాధన కోసమే వారు పోరాడుతున్నట్లుగా ప్రకటించినట్లు జాతీయ మీడియా కథనం.
ద రెసిస్టెన్స్ ఫ్రంట్ చరిత్ర
ఈ ఉగ్రవాద సంస్థ కొత్తగా పుట్టుకొచ్చింది. ఆర్టికల్ 370 రద్దైన అనంతరం కశ్మీర్ స్వయం ప్రతిపత్తి కోసం పోరాటం చేస్తున్నట్లు గతంలో పలుమార్లు ప్రకటించికుంది. అయితే ప్రారంభంలో టిఆర్‌ఎఫ్.. ఆన్‌లైన్‌లో ఉగ్ర కార్యకలాపాలను నిర్వహించేది.
ఆ తరువాత ఆరు నెలల వ్యవధిలో లష్కరే తోయిబా, తెహ్రీకె మిల్లత్ ఇస్లామియా, గజనవి హింద్ వంటి ఇతర ఉగ్ర సంస్థల సభ్యులను చేర్చుకొని భౌతికంగా ఒక ఉగ్రవాద గ్రూపుగా ఏర్పడింది. ఈ సంస్థ వెనుక పాకిస్థాన్ హస్తం ఉన్నట్లు నిఘా సంస్థలు తెలిపాయి. పాకిస్థాన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్‌ఐ అండదండలతోనే ఈ టిఆర్ఎఫ్ ఏర్పాటు జరిగినట్లు జాతీయ మీడియా తెలిపింది. లష్కరే తోయిబా చర్యలపై నుంచి ప్రపంచం దృష్టిని మరల్చేందుకు రూపొందించబడినదని భద్రతా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
లష్కరే తోయిబా ఉగ్రవాద కార్యకలాపాల కారణంగా 2018లో పాకిస్థాన్‌ను ఆర్థిక చర్యల టాస్క్‌ఫోర్స్ (FATF) నిషేధిత దేశాల జాబితాలో చేర్చింది. ఈ చర్యల నుంచి తప్పించుకోవడానికే ప్రపంచం దృష్టిలో తాము మారిపోయినట్లు నటిస్తూ.. పాకిస్థాన్ కొత్తగా టిఆర్ఎఫ్‌ను ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. 2019లో ఏర్పాటైన టిఆర్ఎఫ్ ఉగ్రదాడులను కొనసాగిస్తోంది. కశ్మీర్‌లో తమ ఉనికిని చాటుకోవాలనే ఉద్దేశంతో ఈ దాడులను చేస్తోంది. దీంతో భారత ప్రభుత్వం 2023లో టిఆర్ఎఫ్‌ను అధికారికంగా ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది.
ద రెసిస్టెన్స్ ఫ్రంట్ నాయకుడు షేక్ సజ్జాద్
ఈ టిఆర్ఎఫ్‌ను స్థాపించిన వ్యక్తి షేక్ సజ్జాద్ గుల్ అలియాస్ షేక్ సజ్జాద్. అతను కశ్మీర్‌కు చెందిన మిలిటెంట్. 2018 జూన్ 14న శ్రీనగర్‌లో ప్రముఖ జర్నలిస్టు షుజాత్ బుఖారీ, అతని భద్రతా సిబ్బందిపై హత్యా కుట్రను ప్లాన్ చేశాడు సజ్జాద్ గుల్. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద నిరోధక చట్ట ప్రకారం.. అతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది. అంతేకాదు షేక్ సజ్జాద్ గతంలో లష్కరే తోయిబా కమాండర్‌గా కూడా పని చేశాడు. టిఆర్ఎఫ్ లో సాజిద్ జాట్, సలీం రెహ్మానీ అనే ఇద్దరు సభ్యులు ఉన్నారు, వీరంతా గతంలో లష్కరే తోయిబాలో పనిచేసినవారే.
అన్ని మతాలవారిపై దాడులు చేసిన టిఆర్ఎఫ్
ఇప్పటివరకు టిఆర్ఎఫ్ చేసిన దాడుల్లో అన్ని మతాలకు చెందినవారున్నారు. కశ్మీరీ పండిట్లు, ముస్లింలు, సిక్కులు, హిందువులు అందరూ ఈ టిఆర్ఎఫ్ బాధితులే.
Also Read: వెళ్లి మోడీకి చెప్పుకో.. భర్తను చంపి భార్యతో టెర్రరిస్ట్ చెప్పిన మాటలు ఇవే!
జుమ్ము కశ్మీర్ లో టిఆర్ఎఫ్ చేసిన కీలక దాడుల జాబితా..
2020 ఏప్రిల్ 1న కుప్వారాలోని కేరన్ సెక్టార్‌లో నాలుగు రోజుల పాటు జరిగిన ఎదురు కాల్పుల్లో మొదట సారి టిఆర్ఎఫ్ పేరు వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత 2020 అక్టోబర్ 30న కశ్మీర్‌లోని కుల్గాంలో ముగ్గురు బిజేపీ కార్యకర్తలను హతమార్చింది. మళ్లీ అదే సంవత్సరం నవంబర్ 26న రాజధాని శ్రీనగర్ సమీపంలోని లాయేపోరా ప్రాంతంలో భారత సైన్యంలోని రాష్ట్రీయ రైఫిల్స్ పై దాడి చేసి, ఇద్దరు సైనికులను టిఆర్ఎఫ్ ఉగ్రవాదులు కాల్చి చంపారు.
తిరిగి మూడేళ్ల తరువాత 2023 ఫిబ్రవరి 26న పుల్వామాలో సంజయ్ శర్మ అనే కశ్మీరీ పండిట్‌ను ఈ ఉగ్రవాదులు హత్య చేశారు. 2024 అక్టోబర్ 20లో కూడా గండేర్‌బల్‌లోని సోన్‌మార్గ్ ప్రాంతంలో ఒక వైద్యుడు, మరో ఆరుగురు వలస కార్మికులను కాల్చి చంపారు. తాజాగా 2025 ఏప్రిల్ 22న పహల్గాంలో పర్యాటకులపై టిఆర్ఎఫ్ దాడులు చేసింది.