India Vs Pakistan War : కశ్మీర్.. కశ్మీర్.. కశ్మీర్. దశాబ్దాలుగా జమ్మూ కశ్మీర్ కోసమే పాకిస్తాన్ కక్కుర్తి పడుతోంది. ఆ హిమాలయా రాష్ట్రం భారత్‌లో విలీనం అవడాన్ని తట్టుకోలేక పోతోంది. పీవోకేను అక్రమంగా ఆక్రమించుకున్నాక కూడా సంతృప్తి పడట్లేదు. ఉగ్రవాదులతో మారణహోమం సృష్టిస్తూ.. రావణకాష్టాన్ని రాగిలిస్తూనే ఉంది. కార్గిల్ వార్ తరహా ఘటనలతో చేతులు కాల్చుకున్నాక కూడా బుద్ది మారట్లేదు. ఇప్పుడు పహల్గాం ఉగ్రదాడితో మరోసారి కశ్మీర్‌ను డిస్ట్రర్బ్ చేయాలని చూసింది. ఈసారి చేతులే కాదు.. పాక్ ఒళ్లంతా తగలబెట్టేసింది ఇండియా. ఆపరేషన్ సిందూర్‌తో దాయాది ఇంటికెళ్లి మరీ చంపేసి వచ్చింది. డ్రోన్లు, మిస్సైల్స్‌తో పాకిస్తాన్‌లోని 9 నగరాల్లో అగ్గి పెట్టింది. పాక్‌లో లంకా దహనం జరుగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మళ్లీ కశ్మీర్‌పైనే కన్నుపడింది పాపిస్తాన్‌కు.
కశ్మీరే టార్గెట్
జమ్మూ కశ్మీర్‌ను పాక్‌లో విలీనం చేయడమే ఉగ్రసంస్థల ప్రధాన లక్ష్యం. దీని కోసమే అటు పాక్, ఇటు ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నాయి. ఆపరేషన్ సిందూర్‌కు రివేంజ్‌గా గురువారం రాత్రి భారత్‌లోని 15 నగరాలపై దాడులకు ప్రయత్నించింది పాక్. ఈ దాడిలోనూ కశ్మీర్‌నే ఎక్కువ టార్గెట్ చేసింది. డ్రోన్లు, మిస్సైల్స్‌లో ఎక్కువ భాగం జమ్మూపైనే ఎక్కుపెట్టింది. ఇండియన్ ఆర్మీ దీటుగా ఎదుర్కొంది కాబట్టి సరిపోయింది. లేదంటే, ఈపాటికి కశ్మీర్ పరిస్థితి ఎలా ఉండేదో.
తమకు దక్కలేదనే కోపమా?
జమ్మూతో పాటు 300 కిలోమీటర్ల దూరంలోని కుప్వారా, పఠాన్‌కోట్, గురుదాస్‌పూర్ పై పాక్ అటాక్ చేసింది. జమ్మూ ఎయిర్‌పోర్టుపై దాడులకు ట్రై చేసింది. సరిహద్దు వెంబడి పాక్ సైన్యం విచ్చలవిడిగా కాల్పులు జరుపుతోంది. ఇన్నేళ్లూ ఏ కశ్మీర్ కావాలని అంతటి మారణహోమానికి పాల్పడిందో.. ఇప్పుడు అదే ప్రాంతాన్ని బాంబులతో బుగ్గి చేయాలని చూసింది పాక్. తమకు దక్కనిది మరెవరికీ దక్కకూడదనే కాన్సెప్ట్ కావొచ్చు. గురువారం రాత్రి పాక్ దాడి సక్సెస్ అయి ఉంటే ఏం జరిగేది? కశ్మీర్ ప్రజలు కాలి బూడిదయ్యేవారు. జమ్మూ, శ్రీనగర్ శవాల దిబ్బగా మారేది. కానీ, మన ఆర్మీ ముందు పాక్ ఆటలు సాగలేదు.
కశ్మీర్ ప్రజలు మారేనా?
గురువారం రాత్రి కొన్ని గంటల పాటు యుద్ధ బీభత్సం కొనసాగింది. శుక్రవారం ఉదయం జమ్మూ కశ్మీర్‌లో ప్రశాంతంగా తెల్లవారింది. అక్కడి పౌరులకు పాక్ దాడి చేస్తుందేమోననే భయం ఇప్పుడు తొలగిపోయింది. ఇండియన్ ఆర్మీ తమకు అడ్డుగోడల నిలబడి కాపాడుతుందనే ధైర్యం నెలకొంది. ఇది కదా కావాల్సింది. మరి, తమను చంపాలని చూసిన పాకిస్తాన్‌పై కశ్మీర్ ప్రజల్లో కోపం, ధ్వేషం పెరుగుతుందా? ఇన్నాళ్లూ భారత్ వ్యతిరేక భావజాలంతో ఉన్న కొన్ని వర్గాలు ఇప్పటికైనా కళ్లు తెరుస్తాయా? పాక్‌కు కావలసింది అక్కడి ప్రజలు కాదని.. కేవలం ఆ భూభాగం మాత్రమేననే లాజిక్ ఇప్పటికైనా గ్రహిస్తారా? పాక్ కసాయిలా తమను చంపాలని చూస్తే.. ఇండియా కన్న తల్లిలా తన బిడ్డలను కాపాడుకున్న తీరు అక్కడివారి కళ్లు తెరిపిస్తుందా? ఇప్పటికైనా పాక్ మత్తును వదులుతారా?
నివురు గప్పిన నిప్పులా..
ప్రస్తుతం అక్కడ పరిస్థితి కాస్తా ప్రశాంతగానే కనిపిస్తోంది. భద్రతా బలగాలు భారీగా మోహరించారు. అప్రమత్తత కొనసాగుతోంది. ప్రజలు తమ ఇళ్లలో నుంచి బయటికి రాకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. విద్యాసంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు తాత్కలికంగా సెలవులు ప్రకటించారు. పలు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్థానికులు అపోహలకు లోను కావొద్దని సైన్యం ప్రకటించింది. ఎలాంటి సమాచారమైన ఆర్మీ నుంచి వస్తేనే నమ్మాలని విజ్ఞప్తి చేసింది.
ఉగ్ర చొరబాట్లకు చెక్
మరోవైపు, సరిహద్దుల్లో పాక్ కుట్రలు ఇంకా కొనసాగుతున్నాయి. ఉగ్ర మూకల్ని కశ్మీర్‌లోకి పంపించేందుకు అనువుగా బోర్డర్‌లో కాల్పులకు తెగబడుతోంది. గురువారం రాత్రి బోర్డర్ దాటడానికి వీలుగా సాంబా సెక్టర్‌లోని ధన్‌ధర్ పోస్ట్ దగ్గర పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది. భారత సైన్యం దృష్టి మళ్లించి ఉగ్రవాదులను పంపేందుకు ప్లాన్ చేసింది. పాక్ కుట్రను పసిగట్టిన BSF.. సరిహద్దు దాటడానికి ప్రయత్నించిన.. ఏడుగురు జైషే ఉగ్రవాదులను కాల్చి చంపింది.
Also Read : యుద్ధంపై సోషల్ మీడియాలో ఓవరాక్షన్ వద్దు.. లేదంటే లోపలేసుడే..