ఆపరేషన్ సిందూర్ తో భారత్-పాక్ మధ్య యుద్ధం అనధికారికంగా మొదలైందనే చెప్పాలి. దాడులు, ప్రతిదాడులతో సరిహద్దుల్లో బాంబుల మోత మోగిపోతోంది. పాక్ లోని 9 ఉగ్రవాద శిబిరాలను భారత్ టార్గెట్ చేయగా, భారత్ లోని పలు సైనిక స్థావరాలను, ఆధ్యాత్మిక మందిరాలపై దాడులు చేసేందుకు పాక్ విళ ప్రయత్నాలు చేసింది. ఆపరేషన్ సిందూర్ తో పాక్ పై భారత్ పైచేయి సాధించింది. పాక్ కుటిల యత్నాలను తిప్పికొట్టింది. అయితే ఈ దశలో మీడియా, సోషల్ మీడియాలో పలు కథనాలు ఆసక్తిగా మారాయి. యుద్ధం గురించిన ఏ వార్త అయినా ఇప్పుడు రెండు దేశాల ప్రజలకు ఆసక్తిని కలిగించడం ఖాయం. అందుకే మీడియా, సోషల్ మీడియా పూర్తిగా యుద్ధ వార్తలతో నిండిపోయాయి.
ఆ వార్తల్లో నిజమెంత..?
భారత్-పాక్ మధ్య జరుగుతున్న దాడుల్లో భారత్ దే పైచేయి అనే విషయం తెలిసిందే. అయితే పాకిస్తాన్, ఆ దేశ మీడియా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం ఇక్కడ విశేషం. తప్పుడు వార్తలతో ఆ దేశ మీడియా తిమ్మిని బమ్మిని చేయాలని చూస్తోంది. ఇటు భారత మీడియా మాత్రం సంయమనం పాటిస్తోందనే చెప్పాలి. అదే సమయంలో సోషల్ మీడియా కాస్త కంట్రోల్ తప్పుతోందన్న అనుమానాలున్నాయి. ఆస్తినష్టం, ప్రాణ నష్టం విషయాల్లో అత్యుత్సాహం ప్రదర్శించి లేనిపోని తప్పుడు లెక్కలు చెప్పడం ఎవరికీ మంచిది కాదు. ఆ అత్యుత్సాహం సోషల్ మీడియాలో కొంతమేర కనపడుతోంది.
రక్షణ శాఖ విజ్ఞప్తి..
యుద్ధం నేపథ్యంలో భారత రక్షణ శాఖ ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. మీడియా ఛానల్స్, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు సంయమనం పాటించాలని సూచించింది. భద్రతా దళాలకు చెందిన రక్షణ కార్యకలాపాలు, కదలికలను ప్రత్యక్ష ప్రసారం చేయొద్దని చెప్పింది. సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేయడం వల్ల భద్రతా దళాల ఆపరేషన్స్‌కు అవాంతరం ఏర్పడుతుందని, మన జవాన్ల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. మన రక్షణ రహస్యాలను అత్యుత్సాహంతో మనం శత్రుమూకలకు ఇవ్వొద్దని రక్షణ శాఖ స్పష్టం చేసింది. రక్షణ శాఖ కదలికలకు సంబంధించిన వీడియోలను ఎవరూ రికార్డ్ చేయొద్దని, ఒకవేళ రికార్డ్ చేసినా వాటిని సోషల్ మీడియాలో ఉంచొద్దని సూచించింది.
మీడియా ఛానల్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ విజ్ఞప్తి
భద్రతా దళాలకు చెందిన రక్షణ కార్యకలాపాలు, కదలికలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ఆపాలని సూచించిన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్
అలాంటి సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేయడం వల్ల భద్రతా దళాల ఆపరేషన్స్‌కు మరియు… pic.twitter.com/q9aJ8XTVup
— BIG TV Breaking News (@bigtvtelugu) May 9, 2025
తెలంగాణ పోలీస్ హెచ్చరిక..
కేంద్రం ఆదేశాలతో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీస్ విభాగాలు కూడా పౌరులకు పలు సూచనలు చేశాయి. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ పోలీస్ శాఖ హెచ్చరించింది. సున్నితమైన అంశాలను పోస్ట్ చేసేటప్పుడు ముందు వాటిని నిర్ధారించుకోవాలని చెప్పింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలు ప్రచారంలోకి తెస్తే చట్టప్రకారం శిక్షార్హులు అవుతారని హెచ్చరించింది. తెలిసీ తెలియక తప్పుడు వార్తల్ని షేర్ చేసినా, ప్రజల్ని తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేసినా ఇబ్బందులపాలవ్వాల్సి వస్తుందని చెప్పింది.
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు. సున్నితమైన అంశాలను పోస్ట్ చేసేటప్పుడు తొలుత వాటిని నిర్ధారించుకోండి. తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేసి ఇబ్బందులపాలు అవ్వొద్దు.#telanganapolice #FactCheck pic.twitter.com/B9kbs279ZE
— Telangana Police (@TelanganaCOPs) May 9, 2025
మనమేం చేయాలి..?
యుద్ధం నేపథ్యంలో దాదాపుగా ప్రజలంతా మీడియాకు అతుక్కుపోతున్నారు. చాలామంది సోషల్ మీడియాలో వచ్చే వార్తల్ని షేర్ చేస్తున్నారు, తమ వాట్సప్ స్టేటస్ లలో పెడుతున్నారు. అయితే మనం చూసే ప్రతి వార్త నిజం కాకపోవచ్చు, వాటిల్ని నిర్థారించుకున్న తర్వాతే మనం నమ్మాలి, అధికారిక న్యూస్ సోర్స్ ల ద్వారానే ఈ నిర్థారణ జరగాలి. తప్పుడు వార్తలు, రెచ్చగొట్టే వార్తల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఇలాంటి వాతావరణంలో మరింత ఉద్రిక్తతలు తలెత్త వచ్చు. శత్రుదేశాల పన్నాగం కూడా ఇదే. అందుకే ఉద్రిక్తతలు కలిగించే పోస్ట్ లకు దూరంగా ఉండాలి. సైన్యానికి మానసిక స్థైర్యాన్నిచ్చే పోస్ట్ ల వరకు పర్వాలేదు కానీ, సైనిక సామర్థ్యాలను ప్రశ్నించేలా, కించపరిచే వ్యాఖ్యానాల జోలికి వెళ్లొద్దు.