Pakistan Airlines: భారతదేశాన్ని దెబ్బతీయాలనే దురుద్దేశంతో పాకిస్థాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బెడిసికొట్టింది. పాక్ దేశానికి ప్రతి ఏటా వచ్చే కోట్లాది డాలర్ల ఆదాయానికి గండి పడింది. దీంతో పాకిస్థాన్ కు భారీ ఆర్థిక నష్టం కలగనుంది. కశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తమ గగనతలం మీద నుంచి భారత విమానాల రాకపోకలను నిషేధిస్తూ పాకిస్థాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
దీంతో భారత విమానయానాలు ఇక ప్రత్యమ్నాయ మార్గాల ద్వారా రాకపోకలు సాగించాల్సి వస్తోంది. దీని వల్ల భారత విమానయాన సంస్థలపై కాస్త ఆర్థిక భారం పడనుంది. విమాన ప్రయాణ సమయం ఒక్కటే కాకుండా ఇంధన ఖర్చు కూడా పెరగనుంది. అయితే, పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయం పట్ల.. భారతదేశం కన్నా పాక్ కే ఎక్కువ నష్టం ఉంటుందిని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నిర్ణయం వల్ల పాక్ కూడా భారీగా నష్ట పోతోందని, మొత్తంగా చూస్తే పాకిస్థాన్ పైనే దీని ప్రభావం ఎక్కువ ఉంటుందని చాలా మంది విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో భారత్ ను ఇబ్బంది పెట్టాలని చూసి.. పాక్ తన గోతిని తానే తవ్వుకున్నట్లు అయిందని ఆర్థిక వేత్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
మామూలుగా.. విమానాలు ఒక దేశ గగనతలం మీద నుంచి వెళ్తే.. ఆ దేశానికి ‘ఓవర్‌ఫ్లైట్ ఫీజులు’ చెల్లించాల్సి ఉంటుంది. పశ్చిమ దేశాలకు వెళ్లే భారత విమానాలు ఎక్కువగా పాకిస్థాన్ దేశ గగనతలాన్ని ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. అయితే పాక్ గగనతలాన్ని వినియోగించుకున్నందుకు ఏటా మిలియన్ల డాలర్లు ఆ దేశానికి చెల్లించాల్సి వస్తుంది. తాజా ఆంక్షల వల్ల పాక్ కు ఈ ఆదాయం రాదు. దీంతో ప్రభావం పాక్ ఆర్థిక వ్యవస్థపై గణనీయంగా ఉంటుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.
పాకిస్థాన్ ప్రభుత్వ ఆంక్షల కారణంగా ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి భారత విమానయాన సంస్థలు తమ సర్వీసులను ప్రత్యామ్నాయ, సుదీర్ఘ మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ, అమృత్‌సర్, జైపూర్, లక్నో వంటి నగరాల నుంచి యూరప్, ఉత్తర అమెరికాకు వెళ్లే విమానాలు అరేబియా సముద్రం మీద నుంచే వెళ్తుంటాయి. దీని కారణంగా ప్రయాణ సమయం రెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు పెరుగుతుంది. ఫలితంగా ఇంధన ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని.. విమానయాన సంస్థల అధికారులు పేర్కొన్నారు.
పాకిస్తాన్ మీదుగా ఎగురుతున్న బోయింగ్ 737 విమాన ప్రయాణానికి దాదాపు 580 డాలర్ల ఓవర్ ఫ్లైట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పెద్ద విమానాలు ఇంకా ఎక్కువ చెల్లించాయి. తన గగనతలాన్ని బ్లాక్ చేయడం ద్వారా, పాకిస్తాన్ ఓవర్ ఫ్లైట్ ఆదాయాన్ని కోల్పోవడమే కాకుండా.. అంతరాయం కలిగించిన మార్గాలు, ఆలస్యంగా జరిగే కార్యకలాపాల వల్ల భారీ నష్టాలను చవిచూసే అవకాశం ఉంది.
Also Read: AIIMS Mangalagiri: సువర్ణవకాశం.. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు, రూ.లక్షల్లో జీతం..
గతంలో పాకిస్థాన్ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్ని ఆర్థికంగా విపరీతంగా నష్టపోయింది. 2019లో పుల్వామా దాడి తర్వాత కూడా పాకిస్థాన్ ఇదే విధంగా గగనతలాన్ని మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. అప్పట్లో దాదాపు 400 విమానాల ప్రయాణానికి ప్రభావితం కాగా.. పాకిస్థాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (సీఏఏ), పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) సుమారు 100 మిలియన్ డాలర్ల మేర నష్టపోయినట్లు అంచనా. ప్రస్తుత చర్యలతో పాకిస్థాన్ మరోసారి అలాంటి ఆర్థిక నష్టాలనే ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.