పంబన్ బ్రిడ్జ్. దేశంలోనే ఇది ఓ అద్భుతమైన రైల్వే వంతెన. శ్రీరామనవమి సందర్భంగా రేపు(సోమవారం) ఈ బ్రిడ్జ్ ని ప్రధాని నరేంద్రమోదీ లాంఛనంగా ప్రారంభింస్తారు. ఇప్పటికే ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. దేశంలో ఉన్న మొట్టమొదటి మరియు ప్రస్తుతానికి ఏకైక వర్టికల్ బ్రిడ్జ్ ఇదే కావడం విశేషం. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఈ బ్రిడ్జ్ ని జాతికి అంకితం చేయబోతుండటం మరో విశేషం. ఇప్పటి వరకు తమిళనాడు రామసేతుకి కేంద్రంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పంబన్ సేతు కూడా ఇప్పుడు తమిళనాడుకి మరో ప్రధాన ఆకర్షణ కానుంది.
వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్..
మన దేశంలో పంబన్ బ్రిడ్జ్ మొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జి. అంటే సముద్రం మీద ఏర్పాటు చేసిన ఈ బ్రిడ్జ్.. ఓడల ప్రయాణ సమయంలో అడ్డు తొలగి దారిని ఇస్తుంది. సముద్రమట్టానికి సమాంతరంగా, నిట్ట నిలువుగా ఈ బ్రిడ్జ్ పైకి వెళ్తుంది. దాని కిందనుంచి ఓడలు వెళ్లిపోయిన తర్వాత తిరిగి యథాస్థానానికి తెస్తారు. మన దేశానికి ఈ టెక్నాలజీ ఇప్పుడే పరిచయం అవుతున్నా.. ప్రపంచంలో ఇలాంటి బ్రిడ్జ్ లు చాలానే ఉన్నాయి. ఓడలు వెళ్లడానికి అనుకూలంగా నిట్ట నిలువునా రెండుగా చీలిపోయే టెక్నాలజీ ఉన్న బ్రిడ్జ్ లు కూడా ఉన్నాయి. అయితే అలాంటి చీలిక తెచ్చేందుకు ప్రతిసారీ అత్యథిక బరువులు ఉపయోగిస్తుండాలి. వీటిని బాస్క్యూల్ బ్రిడ్జ్ లు అంటారు. ఆ తర్వాత వచ్చిన ఆధునిక టెక్నాలజీతో ఇప్పుడు వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ లను నిర్మిస్తున్నారు. అయితే ఇందులో ఒకే ఒక ప్రతికూలత ఉంది. బాస్క్యూల్ వంతెన రెండుగా విడిపోయినప్పుడు. ఎంత పెద్ద ఓడ అయినా, ఎంత ఎత్తులో ఉన్నా ఆ ప్రాంతం నుంచి వెళ్లగలదు. కానీ వర్టికల్ బ్రిడ్జ్ పైకి లేచినప్పుడు మాత్రం ఆ బ్రిడ్జ్ కంటే తక్కువ ఎత్తులో ఉన్న ఓడలే ఆ ప్రాంతం నుంచి ప్రయాణించగలవు. అయితే ప్రస్తుతం పంబన్ బ్రిడ్జ్ ఉన్న ప్రాంతంలో భారీ ఓడలతో రవాణా జరగదు. సో ఇక్కడ వర్టికల్ బ్రిడ్జ్ కచ్చితంగా సూటవుతుంది.
శ్రీరామనవమి రోజున అంటే రేపు మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రధాని మోదీ పంబన్ నుంచి రిమోట్ ద్వారా ఈ వంతెన వర్టికల్ లిఫ్ట్ మెకానిజాన్ని ప్రారంభిస్తారు. ఆయన ప్రారంభించిన తర్వాత రామేశ్వరం నుంచి తాంబరానికి ప్రత్యేక రైలు వెళ్తుంది. అదే సమయంలో రూ.8,300 కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులకు కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారు, ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్ట్ లను ప్రారంభిస్తారు. అనంతరం మోదీ రామేశ్వరం ఆలయాన్ని సందర్శిస్తారు.
పంబన్ బ్రిడ్జ్ ప్రత్యేకతలు..
మొట్ట మొదటగా పంబన్ రైల్వే బ్రిడ్జిని 1914లో బ్రిటిషర్లు నిర్మించారు. దీన్ని బాస్క్యూల్ మోడల్ లో నిర్మంచారు. అంటే కింద ఓడలు వెళ్లే సమయంలో పైన ఉన్న బ్రిడ్జ్.. రెండుగా చీలిపోతుంది. అయితే ఇది బాగా ఓల్డ్ టెక్నాలజీ. అందులోనూ వందేళ్లు పూర్తి కావడంతో ఈ బ్రిడ్జ్ తుప్పుపట్టి పనికిరాకుండా పోయింది. దీంతో ఇక్కడ రాకపోకలు నిలిపివేశారు. అక్కడ ఉన్న బ్రిడ్జ్ కి సమాంతరంగా కొత్త బ్రిడ్జ్ నిర్మాణాన్ని 2019 మార్చిలో ప్రారంభించారు. రూ. 535 కోట్ల వ్యయంతో 2.08 కి. మీ పొడవున దీన్ని నిర్మించారు. వర్టికల్ లిఫ్ట్ మెకానిజంతో కొత్త వంతెన రూపొందింది. పాత వంతెనను కొంతమేర తొలగించి ఓడల రాకపోకలకు అనువుగా ఆ ప్రాంతాన్ని మార్చారు. కొత్త వంతెన పర్యాటక ఆకర్షణగా కూడా మారుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు.