Big Stories

Rahul Gandhi : రాహుల్ కేంబ్రిడ్జ్ స్పీచ్ పై పార్లమెంట్ లో రగడ.. సారీ చెప్పాలని బీజేపీ డిమాండ్.. కాంగ్రెస్ కౌంటర్..

Rahul Gandhi : లండన్ లో రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్ లో ప్రకంపనలు సృష్టించాయి. తాజాగా ప్రారంభమైన రెండో విడత పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో దుమారం రేపాయి. రాహుల్‌ క్షమాపణలు చెప్పాల్సిందేనని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి.

- Advertisement -

ఉదయం 11 గంటలకు లోక్‌సభ మొదలవ్వగానే రాహుల్ వ్యాఖ్యలను కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ప్రస్తావించారు. లండన్‌ గడ్డపై రాహుల్‌ గాంధీ భారత్‌ను అవమానించారని మండిపడ్డారు. దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని విదేశాలను కోరారని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలను సభ్యులంతా ఖండించాలని కోరారు.
రాహుల్‌ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని రాజ్‌నాథ్‌ డిమాండ్‌ చేశారు. బీజేపీ మిత్రపక్ష నేతలు రాజ్ నాథ్ కు వంతపాడాయి.

- Advertisement -

రాజ్‌నాథ్ విమర్శలపై కాంగ్రెస్ సభ్యులు ఎదురుదాడికి దిగారు. ప్రధాని మోదీ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విదేశాల్లో విమర్శలు గుప్పించారని గుర్తుచేస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో లోక్ సభలో కాసేపు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో స్పీకర్‌ ఓం బిర్లా సభను వాయిదా వేశారు.

అటు రాజ్యసభలోనూ ఇదే విషయంపై వివాదం రేగింది. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ రాహుల్‌ వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఓ సీనియర్‌ నాయకుడు విదేశీ గడ్డపై భారత ప్రజాస్వామ్యాన్ని అవమానించడం సిగ్గుచేటన్నారు. రాహుల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

అయితే గోయల్‌ వ్యాఖ్యలను రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే తీవ్రంగా ఖండించారు. రాజ్యసభలో సభ్యుడు కాని వ్యక్తిని సభకు పిలిచి క్షమాపణ చెప్పాలని అడగడం ఆమోదనీయం కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ దన్‌ఖడ్‌ సభను వాయిదా వేశారు.

ఇటీవల రాహుల్‌ గాంధీ లండన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్శిటీలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాని మోదీ హయాంలో భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోందని విమర్శించారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఇప్పుడు ఈ వివాదం పార్లమెంట్ కు చేరింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News