Patna HC on Liquor Policy : బీహార్ లో అమలవుతున్న మద్య నిషేధం చట్టం.. తప్పు దారిపట్టిందంటూ పట్నా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ నిర్ణయం చారిత్రక తప్పిదంగా మారి, అక్కడ అనధికారిక మద్య సరఫరాను పెంచేస్తోందంటూ అభిప్రాయపడింది. చట్టవిరుద్ధంగా అక్రమ మద్యం తయారీ, సరఫరా వ్యవస్థలు ఏర్పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.
మద్యా నిషేధ చట్టం ఉండాలని, స్థానిక ప్రజల కంటే అక్కడి పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులే ఎక్కువ కోరుకుంటున్నారంటూ జస్టిస్ పూర్ణేందు సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ చట్టం ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడాలన్న లక్ష్యాన్ని నెరవేర్చడం కన్నా.. ప్రభుత్వ అధికారులకు పెద్దమొత్తంలో ఆదాయాన్ని అందిస్తోందంటూ ఆగ్రహించారు.
మంచి ఆలోచనతో బీహార్ లో మద్యనిషేధాన్ని అమల్లోకి తీసుకువచ్చిన తర్వాత ఎలాంటి వ్యక్తులపై, ఎలాంటి కేసులు నమోదు చేశారని పట్నా హైకోర్టు ప్రశ్నించింది. మద్యం విక్రయించే, సేవించే పేదలపైనే పోలీసులు, ఎక్సైజ్ కేసులు నమోదు చేస్తున్నారన్న జస్టి్స్ పూర్ణేందు సింగ్.. మద్యం విక్రయాలు జరిపే దళారులు, సిండికేట్లపై ఎందుకు కేసులు నమోదు అవ్వడం లేదని ప్రశ్నించారు. ఈ చట్టాన్ని అధికారులు స్వంత ప్రయోజనాలకు వినియోగించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
పోలీసు స్టేషన్ కు 500 మీటర్ల దూరంలోనే మద్యం గోడౌన్ ఉండగా.. దానిని గుర్తించి నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత పాశ్వాన్ అనే పోలీస్ అధికారి స్థాయిని తగ్గించారు. ఇన్ స్పెక్టర్ స్థాయి నుంచి సబ్ ఇన్ స్పెక్టర్ స్థాయికి డిమోట్ చేస్తూ.. బీహార్ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. తాను ఆ గోడౌన్ పై దాడి చేసిన బృందంలో సభ్యుడినని హైకోర్టుకు తెలిపిన సస్పెండ్ కు గురైన అధికారి.. ఈ సమయంలో గోడౌన్ లోని రూ.4 లక్షల విలువైన మద్యాన్ని గుర్తించి, కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
అయితే.. తమ పరిధిలోని మద్యం అమ్మకాలను ఆపడంలో విఫలమైన పోలీస్ స్టేషన్ అధికారులై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని 2020లో డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. దాని ఆధారంగా.. పోలీస్‌స్టేషన్‌కు 500 మీటర్ల దూరంలో మద్యం గోడౌన్ ఉండాడానికి కారణం.. సంబంధిత అధికారి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే అంటూ పాశ్వాన్‌ను సస్పెండ్ చేశారు.
ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన హైకోర్టు.. పోలీసు, ఎక్సైజ్ అధికారులు మద్యం సిండికేట్లతో చేతులు కలిపి, అక్రమ మార్గాల్లో మద్యాన్ని సరఫరా చేస్తున్నట్లు కనిపిస్తోందని ఆరోపించింది. ఈ కేసులో పోలీస్ అధికారి సస్పెండ్ కు సరైన కారణాలు చూపించలేదని, అతను తన విధుల్ని ఎలా నిర్లక్ష్యం చేశాడో నిరూపించలేదంటూ తెలిపింది.
Also Read : ప్రధాని మోదీ విమానంలో సాంకేతిక సమస్య.. రాహుల్ గాంధీకి ఇబ్బందులు
పోలీసు అధికారి, ఎక్సైజ్ అధికారి మాత్రమే కాదు, రాష్ట్ర పన్ను శాఖ, రవాణా శాఖ అధికారులు కూడా మద్య నిషేధాన్ని ఇష్టపడతారని, వారికి ఇది మంచి డబ్బు సంపాదనా మార్గంగా మారిందని పేర్కొంది. మద్యం సేవించే పేదలు, పేదలపై నమోదైన కేసులతో పోల్చితే కింగ్ పిన్/సిండికేట్ ఆపరేటర్లపై నమోదైన కేసుల సంఖ్య చాలా తక్కువ అని కోర్టు పేర్కొంది.