Stray Dogs: దేశ రాజధాని ఢిల్లీలో వీధి కుక్కల వ్యవహారంపై సుప్రీంకోర్టు స్పందించింది. న్యాయస్థానం తీర్పుపై అధికారులు రంగంలోకి దిగారు. వీధి కుక్కలన్నింటినీ సాధ్యమైనంత త్వరగా స్టెరిలైజ్ చేసి షెల్టర్లకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు ఢిల్లీ-ఎన్‌సీఆర్ అధికారులు. న్యాయస్థానం తీర్పుపై జంతువు హక్కు సంఘం-పెటా రియాక్ట్ అయ్యింది. ఇది అశాస్త్రీయమని, అసమర్థమైనది వ్యాఖ్యానించింది. అసలేం జరిగింది? సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇవ్వడానికి కారణమేంటి?
దేశ రాజధాని ఢిల్లీలో వీధుల్లో కుక్కలు కనిపించరాదని సోమవారం ఢిల్లీ ప్రభుత్వ అధికారులను ఆదేశించింది సుప్రీంకోర్టు. వాటిని సాధ్యమైనంత త్వరితంగా స్టెరిలైజ్ చేసి షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. ఆయా కుక్కల కాటు వల్ల రేబీస్ వ్యాధి వ్యాప్తి చెందుతోందని అభిప్రాయపడింది. ఈ విషయంలో పిల్లలు గురవుతుండడంతో పరిస్థితి చాలా దయనీయంగా ఉందని వ్యాఖ్యానించింది.
వీధి కుక్కల కోసం వెంటనే షెల్టర్లు ఏర్పాటు చేయాలన్నది ప్రధాన పాయింట్. ప్రస్తుతం ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో దాదాపు 5,000 డాగ్స్ ఉన్నట్లు ఓ అంచనా. 6 నుంచి 8 వారాలలో షెల్టర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టంచేసింది. తమ ఆదేశాలను అడ్డుకోవడానికి ప్రయత్నించే వ్యక్తులు, సంస్థలు కాని ప్రయత్నిస్తే కఠినచర్యలు తీసుకుంటామని జస్టిస్ పార్దీవాలా-జస్టిస్ ఆర్ మహదేవన్‌తో కూడిన ధర్మాసనం గట్టిగా హెచ్చరించింది.
కోర్టు ధిక్కరణ ప్రక్రియ చేపడతామని వ్యాఖ్యానించింది. వీధి కుక్కలను పట్టుకోవడానికి వచ్చే సిబ్బందిని ఎవరైనా అడ్డుకుంటే వారిపై చట్టపరంగా చర్యలు తప్పవన్నది సుప్రీంకోర్టు మాట. ఇంకా లోతుల్లోకి వెళ్తే.. ఢిల్లీలో వీధి కుక్కల కాటులో రేబీస్ వ్యాధి సోకుతున్న కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ వ్యవహారంపై జూలై 28న సుమోటో కేసుపై ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
ALSO READ: పాకిస్తాన్ ని చావుదెబ్బ కొట్టాం.. ఆపరేషన్ సిందూర్ అరుదైన వీడియో
ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వంతోపాటు గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్ మున్సిపల్ అధికారులకు ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. అన్ని వీధి కుక్కలను తొలగించి షెల్టర్లలో ఉంచాలని పేర్కొంది. ప్రజల విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఆదేశాలు జారీ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ విషయంలో ఎలాంటి మనోభావాలు ఉండరాదని సూచించింది కూడా.
రేబీస్‌కి శిశువులు, పిల్లలు బలి కారాదని తేల్చి చెప్పింది. ఈ చర్య వల్ల స్వేచ్ఛగా రోడ్లపై తిరుగుతామన్న విశ్వాసాన్ని పిల్లలు-వృద్ధులకు కలిగించవచ్చని తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం. కోర్టు తీర్పుపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.