తమిళనాడులో పంబన్ వంతెన ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. దేశంలోనే ఈ టెక్నాలజీ ఉపయోగించి నిర్మించిన మొట్టమొదటి బ్రిడ్జ్ ఇది. అయితే ఇలాంటి అపురూప ఘట్టంలో పాల్గొనాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ మాత్రం ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. కారణాలు అందరికీ తెలిసినవే. బీజేపీ, డీఎంకే మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. త్రిభాషా సూత్రం విషయంలో ఈ విభేదాలు మరింత రచ్చకెక్కాయి. నీట్ విషయంలో మరింత ముదిరిపోయాయి. డీలిమిటేషన్ విషయంలో ఆల్రడీ గొడవ జరుగుతూనే ఉంది. దీంతో ప్రధాని పాల్గొనే కార్యక్రమాన్ని ఉద్దేశపూర్వకంగానే స్టాలిన్ బాయ్ కాట్ చేశారనే వాదన వినపడుతోంది. అయితే స్టాలిన్ మాత్రం మరోలా స్పందించారు. నీలగిరి ప్రాంతంలో జరిగే మరో కార్యక్రమంలో తాను పాల్గొనాల్సి వచ్చిందన్నారు. అది ముందే నిర్ణయించిన కార్యక్రమం కావడంతో అటు వెళ్లానని, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇద్దరు మంత్రులు ప్రధాని మోదీకి స్వాగతం పలికారన్నారు.
మోదీకి కోపమొచ్చింది.
పంబన్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి తమిళనాడు సీఎం స్టాలిన్ గైర్హాజరు కావడంతో ప్రధాని మోదీ నొచ్చుకున్నారని స్పష్టమవుతోంది. అయితే ఆయన నేరుగా స్టాలిన్ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ తమిళనాడు ప్రభుత్వాన్ని మాత్రం పరోక్షంగా విమర్శించారు. తమిళనాడు రాష్ట్రానికి కేంద్రం నిధులు పెంచినప్పటికీ.. కొందరు నిరాశ వ్యక్తం చేస్తున్నారని అన్నారు మోదీ.
ఏడ్చే అలవాటు..
కొంతమంది కారణం లేకుండా ఎప్పుడూ ఏడుస్తుంటారని, అది వారికి అలవాటు అని స్టాలిన్ పై పరోక్షంగా సెటైర్లు వేశారు ప్రధాని మోదీ. కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు భారీగా నిధులిస్తోందని, గతంతో పోలిస్తే మూడు రెట్లు అధికంగా ఇప్పుడు నిధులు అందుతున్నాయని అన్నారు. తమిళనాడు అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్న ఆయన.. 2014 నుంచి తమిళనాడు అభివృద్ధిపై కేంద్రం ఫోకస్ పెంచిందని, అంతకు ముందు రైల్వే ప్రాజెక్టులకు ఏటా రూ.900 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చేదని, ఈ ఏడాది తమిళనాడుకు రైల్వే బడ్జెట్ లో రూ.6,000 కోట్లకు పైగా కేటాయింపులున్నాయని అన్నారు. అభివృద్ధి చెందిన భారత్ లో తమిళనాడు పాత్ర గొప్పదని అన్నారు మోదీ. తమిళనాడు ఎంత బలంగా ఉంటే మన దేశం అంత వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
సంతకాల సంగతేంటి..?
ఇక త్రిభాషా విధానంపై తమిళనాడు నేతలు చేస్తున్న రచ్చను కూడా మోదీ వెటకారం చేశారు. తమిళ నాయకులు కొందరు తనకు లేఖలు రాస్తుంటారని, వారిలో ఒక్కరు కూడా మాృతభాష తమిళంలో సంతకం చేయరని దెప్పిపొడిచారు. తమిళ భాషను గౌరవించండి.. తమిళంలో సంతకం చేయండి అని సూచించారు మోదీ. ఇక నీట్ వ్యవహారంపై కూడా మోదీ సున్నితంగా స్పందించారు. నీట్ ని రద్దు చేయాలని, తమ రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లను తామే భర్తీ చేసుకుంటామని తమిళనాడు ప్రభుత్వం చేస్తున్న వాదనను ఆయన కొట్టిపారేశారు. తమిళనాడులో తమిళంలో వైద్య విద్యను అందించాలని సూచించారు. మొత్తమ్మీద మోదీ తమిళనాడు పర్యటన మరోసారి మటాల యుద్ధానికి దారితీసిందనే చెప్పాలి. మోదీ వ్యాఖ్యలకు స్టాలిన్ నుంచి ఇంకా కౌంటర్లు మొదలు కాలేదు. రాబోయే రోజుల్లో ఈ గొడవ మరింత ముదిరేలా ఉంది.