Indian Railway Rules: ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించేందుకు భారతీయ రైల్వే పలు నియమ, నిబంధనలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం చేసేందుకు ఈ రూల్స్ ఎంతగానో ఉపయోగపడుతాయి. ఇక నిత్యం రైళ్లలో పెద్దలతో పాటు ఎంతో మంది పిల్లలు ప్రయాణం చేస్తుంటారు. పిల్లల ఛార్జీలకు సంబంధించి రైల్వే సంస్థ కొన్ని నియమాలను రూపొందించింది. వారి వయసు ఆధారంగా టికెట్ రేట్లను నిర్ణయించింది. కొంత మంది ఉచితంగా ప్రయాణిస్తే, మరికొంత మంది హాఫ్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. మరికొంత మంది ఫుట్ టికెట్ తీసుకోవాలి. పిల్లలకు సంబంధించి టికెట్ నిబంధనలకు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
5 ఏళ్ల వరకు ఉచితంగానే రైలు ప్రయాణం
భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఈ సౌకర్యం జనరల్, రిజర్వ్డ్ కోచ్ లలో అందుబాటులో ఉంది. అయితే, బెర్త్ లు లభించవు. ఒకవేళ తమ పిల్లలకు కూడా బెర్త్ కావాలనుకుంటే, వారు పూర్తి ఛార్జీ చెల్లించాలి ఉంటుంది.
5 నుంచి 12 ఏళ్ల వరకు సగం ఛార్జీ వసూలు
5 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు రైలులో సగం ఛార్జీ వసూలు చేస్తారు. అంటే, పెద్దవారితో పోల్చితే పిల్లలకు హాఫ్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వేషన్ చేసుకునేటప్పుడు మీరు పిల్లల కోసం సీటు కావాలంటే తప్పకుండా పూర్తి ఛార్జీ చెల్లించాలి. సీటు అవసరం లేదనుకుంటే సగం ఛార్జీ చెల్లిస్తే సరిపోతుంది. చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్, సెకండ్ క్లాస్ సీటింగ్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ AC కేటగిరీలలోని పిల్లలకు NSOB (నో సీట్ ఆప్షన్) ఎంపిక అందుబాటులో లేదు. ఈ క్లాస్ లలో ప్రయాణించాలంటే, పిల్లల కోసం పూర్తి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది.
12 ఏళ్లు నిండితే ఫుల్ ఛార్జీ వసూలు
ఇక పిల్లల వయసు 12 సంవత్సరాలు దాటితే పూర్తి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. హాఫ్ టికెట్ నిబంధన 5 నుంచి 12 ఏళ్ల మధ్య పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది.
Read Also: వందే భారత్ లోకో పైలట్ జీతం ఎంత? ఆ ఉద్యోగానికి కావల్సిన అర్హతలేంటీ?
హాఫ్ టికెట్ తీసుకోవాలంటే ఏ పత్రాలు చూపించాలి?
రైల్వే నిబంధనల ప్రకారం పిల్లలకు హాఫ్ టికెట్ తీసుకోవాలంటే వారి బర్త్ సర్టిఫికేట్ చూపించాలి. ఒకవేళ అది లేకపోతే, ఇతర గుర్తింపు పత్రాలను సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది. పిల్లల అసలు వయస్సు తెలుసుకోవడానికి ఈ పత్రాలను అడుగుతారు. పిల్లల వయస్సును దాచి ఈ నియమాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు ఈ సర్టిఫికేట్లు చూపించాలి. మీ పిల్లలు 5 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండి, టికెట్ కొనకుండా ప్రయాణం చేస్తూ పట్టుబడితే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే పిల్లల వయసును బట్టి టికెట్లను తీసుకోవాల్సి ఉంటుంది.
Read Also: ప్రయాణీకులకు అలర్ట్.. ఇకపై చర్లపల్లి మీదుగా జన్మభూమి ఎక్స్ ప్రెస్ రాకపోకలు!