PM Modi Flag off 10 Vande Bharat Trains: ప్రజల ప్రయాణాలను మరింత సలుభతరం చేసేందుకు రైల్వేశాఖ మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాలను కలుపుతూ మరో రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కించింది. సికింద్రాబాద్- విశాఖ మధ్య రెండో వందేభారత్ రైలు ప్రధానిమోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. మొత్తం 10 వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు.
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని.. రూ.85 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కొన్నింటిని జాతికి అంకితం చేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 9 పీఎం గతిశక్తి కార్గో టెర్మినల్స్, 11 గూడ్స్ షెడ్లు, 2 జన ఔషధి కేంద్రాలు, 3 రైల్వే కోచ్ రెస్టారెంట్లను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. కొళ్లం – తిరుపతి మెయిల్ ఎక్స్ ప్రెస్, పలు మార్గాల్లో రెండో లైన్, మూడో లైన్, గేజు మార్పిడి, బైపాస్ లైన్లనూ ప్రధాని వర్చువల్ గా ప్రారంభించారు.
Also Read: హర్యానాలో రాజకీయ సంక్షోభం.. సీఎం పదవికి ఖట్టర్ రాజీనామా
లక్నో- డెహ్రాడూన్, పాట్నా – లక్నో, న్యూ జల్ పై గురి – పాట్నా, పూరీ – విశాఖపట్నం, కలబురగి – బెంగళూరు, రాంచీ – వారణాసి, ఖజురహో – ఢిల్లీ, అహ్మదాబాద్ – ముంబై, సికింద్రాబాద్ – విశాఖపట్నం, మైసూరు – చెన్నై రూట్లలో వందేభారత్ రైళ్లు ప్రారంభమయ్యాయి. వీటితో పాటు.. అహ్మదాబాద్ – జామ్ నగర్ వందేభారత్ ను ద్వారక వరకూ, అజ్మీర్ – ఢిల్లీ రైలును చండీగఢ్ వరకు, గోరఖ్ పూర్ – లక్నో రైలును ప్రయాగ్ రాజ్ వరకు, తిరువనంతపురం – కాసర్ గోడ్ వందే భారత్ ను మంగళూరు వరకూ పొడిగించారు. గతేడాది డిసెంబర్ లోనే ప్రధాని ఆరు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. తాజాగా ప్రారంభం కానున్న మరో 10 వందేభారత్ లతో కలిపి వీటి సంఖ్య 51కి చేరింది. ఇవి మొత్తం 45 రూట్లలో రాకపోకలు సాగిస్తున్నాయి.
గురువారం మినహా ఇతర రోజుల్లో వందేభారత్ రైలు సర్వీసులు అందిస్తుంది. రెగ్యులర్ సర్వీసులు మార్చి 13 నుంచి ప్రారంభం కానుండగా.. బుకింగ్‌లు మార్చి 12 నుంచి అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ – విశాఖ వందే భారత్ రైలు ఉదయం 5 గంటల 5 నిమిషాలకు సికింద్రాబాద్ లో బయల్దేరి మధ్యాహ్నం 1.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇది వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగనుంది. మొత్తం 530 మంది ప్రయాణికుల సామర్థ్యంతో నడిచే ఈ రైలులో 7 చైర్ కార్ కోచ్ లు, 1 ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్ ఉన్నాయి. కాగా.. అహ్మదాబాద్ – ముంబై, సికింద్రాబాద్ – విశాఖపట్నం, మైసూరు – చెన్నై రూట్లలో రెండో సెట్ వందేభారత్ ను నడపనున్నారు.