Priyanka Gandhi Oath Taking| కేరళలోని వయనాడ్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఇటీవల కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ విజయం సాధించారు. ఈ క్రమంలో ప్రియాంక గాంధీ గురువారం నవంబర్ 28, 2024న పార్లమెంటులోని లోక్ సభ లో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆమె కేరళ సంప్రదాయానికి చెందిన కసవు చీరలో కనిపించారు. మలయాళీ మహిళలు పండుగ వేళ గోల్డెన్ బార్డర్ కలిగిన తెల్లని కసవు చీర ధరిస్తారు. ప్రియాంక గాంధీ కూడా ఈ కసవు చీర ధరించి చేతిలో భారత రాజ్యాంగ కాపీని పట్టుకొని వయనాడ్ ఎంపీగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.
52 ఏళ్ల ప్రియాంక గాంధీ ఎంపీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆమె సోదరుడు, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ, తల్లి సోనియా గాంధీ, భర్త రాబర్ట్ వాడ్రా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆమె పిల్లలు కూడా వచ్చారు. కేరళ చీరలో ఆమె ప్రమాణ స్వీకారం చేయడం అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆమె వయనాడ్ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు సంకేతంగా ఈ చీర ధరించారు.
ప్రియాంక గాంధీ ఎంపీగా ప్రవేశించడంతో ప్రస్తుతం పార్లమెంటులో గాంధీ కుటుంబం నుంచి ఎంపీల సంఖ్య మూడుకు చేరింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లోక్ సభలో ఉండగా.. వారి తల్లి సోనియా గాంధీ రాజ్య సభలో ఉన్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సోనియా గాంధీ నిరాకరించారు.
Also Read: అజ్మేర్ దర్గాలో శివాలయం?.. దర్గా కమిటీ, ప్రభుత్వానికి కోర్టు నోటీసులు
అయితే బిజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వీయా.. ప్రియాంక గాంధీ ప్రమాణ స్వీకారంపై అభ్యంతరకర ట్వీట్ చేశారు. “వయనాడ్ నుంచి కొత్త ముస్లిం లీగ్ ఎంపీ ప్రమాణ స్వీకారం చేశారు. గాంధీ కుటుంబ చరిత్రలో ఇదీ ఒక ఘట్టం” అని ట్వీట్ లో రాశారు.
అందువల్లే రాహుల్ గాంధీ సంప్రదాయ కాంగ్రెస్ సీటు అయిన రాయ్ బరేలీతో పాటు కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీ చేశారు. అయితే రెండు లోక్ సభ స్థానాల నుంచి కూడా రాహుల్ భారీ మెజారిటీతో గెలుపొందారు. దీంతో ఆయన వయనాడ్ ఎంపీ సీటుకు రాజీనామా చేయాల్సి వచ్చింది. వయనాడ్ లోక్ సభ ఉపఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేయగా ఆమెకు మొత్తం 6.22 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఆమె సమీప అభ్యర్థి సిపిఎం పార్టీ నాయకుడు సత్యన్ మోకెరీ కంటే ఆమెకు 4 లక్షల ఓట్లు ఎక్కువ లభించాయి. దీంతో రాహుల్ గాంధీకి వచ్చిన మెజారిటీ కంటే ప్రియాంక గాంధీ ఎక్కువ లీడ్ తో విజయం సాధించి రికార్డు సృష్టించారు.
ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. తాను పార్లమెంటులో వయనాడ్ ప్రజల గొంతుకగా పనిచేస్తానని అన్నారు.
అంతకుముందు రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి ఎంపీగా పోటీ చేస్తే.. ఆయనకు 6.47 లక్షలు లభించాయి. సమీప అభ్యర్థి కంటే రాహుల్ గాంధీకి 3.64 లక్షల ఓట్ల ఎక్కువ సాధించి భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే ప్రియాంక గాంధీ 4 లక్షల మెజరిటీ సాధించి తన సోదరుడి రికార్డుని బద్దలు కొట్టింది.
ప్రియాంక గాంధీతో పాటు గురువారం మహారాష్ట్ర నాందేడ్ ఎంపీగా విజయం సాధించిన కాంగ్రెస్ నాయకుడు రవీంద్ర చవాన్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు.