Priyanka Gandhi Rupee Value | అమెరికా డాలరుతో (US Dollar) భారత కరెన్సీ అయిన రూపాయి మారకం విలువ భారీగా తగ్గిపోవడంపై కాంగ్రెస్ నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. శుక్రవారం రూపాయి విలువ ఒక్కసారిగా 16 పైసలు క్షీణించి చరిత్రలోనే తొలిసారిగా 86.04కి చేరింది. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ ‘ఎక్స్’ వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు.
దశాబ్ద కాలం క్రితం నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అంతా తనకే తెలుసినట్లు రూపాయి విలువని భారత ప్రభుత్వ ప్రతిష్ఠతో ముడిపెట్టి వ్యాఖ్యలు చేసేవారని.. ఇప్పుడు తనే ప్రధానిగా ప్రభుత్వం నడుపుతున్నప్పుడు అంతకంటే దిగజారిన రూపాయి విలువ గురించి ఆయన సమాధానం చెప్పాలని ప్రియాంక గాంధీ ఎద్దేవా చేశారు.
మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో రూపాయి విలువ మరీ క్షీణించలేదని గుర్తు చేశారు.
Also Read: నిద్రపోతూ వేయి జాబ్స్ అప్లై చేసిన యువకుడు.. ఫలితంగా ఏం జరిగిందంటే..
‘‘చరిత్రలోనే తొలిసారిగా రూపాయి మారకం విలువ కనిష్ఠ స్థాయికి చేరుకుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో డాలరుతో రూపాయి మారకం విలువ 58-59 రూపాయలు ఉండేది. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ రూపాయి విలువను భారత దేశ ప్రభుత్వ ప్రతిష్ఠతో ముడిపెట్టేవారు. ప్రపంచంలో ఏ దేశ కరెన్సీ విలువ కూడా ఇంతగా పడిపోదని, అంతా తనకే తెలుసని చెప్పేవారు. మరి ఇప్పుడేమైంది? ఆయనే ప్రధానిగా ఉన్నారు. పతనంలో రూపాయి రికార్డులు సృష్టిస్తోంది. ఈ రోజు చరిత్రలో తొలిసారి రూపాయి విలువ రూ.86.04 క్షీణించింది. రోజు రోజుకూ దాని విలువ క్షీణిస్తోంది. అందువల్ల ఆయన దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి’’ అని కాంగ్రెస్ జెనెరల్ సెక్రటరీ అయిన ప్రియాంక గాంధీ తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ లో పేర్కొన్నారు.
చమురు ధరలల్లో పెరుగుదల, భారత స్టాక్ మార్కెట్లలో నష్టాల కారణంగా ఇండియన్ కరెన్సీ విలువ తగ్గిందని ఫారెక్స్ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు అమెరికా డాలర్ విలువ బలపడింది. అమెరికాలో తదుపరి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న ప్రమాణ స్వీకరాం చేయనున్నారు. ఆ వెంటనే ఆయన అంతర్జాతీయ వాణిజ్యంపై ఆంక్షలు విధిస్తారనే ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో డాలర్ విలువ క్రమంగా ఊపందుకుంటోంది.
ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ లో రూపాయి విలువ డాలర్ మారకంతో 85.88 గా ప్రారంభమైంది ఆ తరువాత ఇంట్రాడే లో 85.85 వరకు పెరిగి ఆ తరువాత 86 మార్క్ ని దాటేసింది. గురువారంతో పోల్చితే 18 పైసలు నష్టంతో రూపాయి విలువ ముగిసింది. గురువారం మార్కెట్ ముగిసే సమయానికి డాలర్ తో రూపాయి మారకం విలువ 85.86గా ఉంది.