Social Media Ban: నేపాల్ యువత చేపట్టిన జన్-జడ్ ఉద్యమం తీవ్ర హింసాత్మకంగా మారింది. దీంతో షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ జారీ చేసింది ప్రభుత్వం. కాగా.. ఇప్పటివరకు 20 మంది చనిపోగా.. వందమందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతున్న వారిలో దాదాపు 30 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ క్రమంలోనే నేపాల్ హోం శాఖ మంత్రి రాజీనామా చేశారు.
ఈనెల 4న ఎక్స్, ఫేస్‌బుక్‌లను నిషేధించిన ప్రభుత్వం
ప్రస్తుతం ఇంకా నేపాల్ కుర్రోళ్లు రగలిపోతునే ఉన్నారు. దీనికి కారణం అక్కడి ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధిం విధించటమే. ఈనెల 4 నుండి అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాం బ్యాన్ చేసింది నేపాల్ ప్రభుత్వం. దాంతో నాలుగు రోజులుగా పిచ్చెక్కిపోయిన కుర్రోళ్లు.. వీధుల్లోకి వచ్చారు. రణరంగం చేశారు. అంతేకాదు ఇప్పుడు నేపాల్ వీధుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్లు యుద్ధమే చేస్తు న్నారు. సోషల్ మీడియా లేకుండా ఎలా అంటూ గొంతెత్తి నిరసిస్తున్నారు.
నేపాల్ హోంశాఖ మంత్రి రమేష్ లేఖక్ రిజైన్
నేపాల్ టెలి కమ్యూనికేషన్ మంత్రిత్వశాఖ ఐదేళ్ల క్రితం ఓ నిబంధన తీసుకొచ్చింది. సోషల్ మీడియా సంస్థలు అన్నీ కూడా విధిగా ప్రభుత్వం దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలని.. అందు లోనూ నేపాల్ సంస్కృతి సంప్రదాయాలు, పద్దతులు, కంటెంట్ విషయంలో నియంత్రణ ఉండాలని స్పష్టం చేసింది. అయితే ఐదేళ్లుగా ఏ కంపెనీ అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లాయి. ఈ క్రమంలోనే నేపాల్ సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని సమర్థిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తమ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోని యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టా, వాట్సాప్ ఛానెళ్లను కట్ చేసింది.
ఖాట్మాండులో పెద్ద ఎత్తున యువత ఆందోళన
ఇక చేతిలో మొబైల్ ఫోన్.. అందులో సోషల్ మీడియా లేనిదే నిద్రపట్టని నేపాల్ కుర్రోళ్లు ఒక్కసారిగా అన్నీబ్యాన్ కావటాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఒక్కసారిగా ఖాట్మాండులో విధ్వంసానికి దిగారు. నేపాల్ పార్లమెంట్‌ను ముట్టడించారు. దాంతో టియర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. బనేశ్వర్ అనే ప్రాంతంలో పరిస్థితి అదుపు తప్పటంతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ యువకుడు చనిపోయాడు. ఆ తర్వాత నిరసనలు దేశం అంతా వ్యాపించాయి. జన్-జడ్ పేరుతో ఇప్పుడు నేపాల్‌ను రణరంగంగా మార్చేశారు.
సోషల్ మీడియాపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డెక్కిన యువత
సోషల్ మీడియాను బ్యాన్ చేస్తేనే ఇంతలా ఆందోళనలు చేస్తారా అంటూ ప్రశ్నించిన వాళ్లకు.. నేపాల్ కుర్రోళ్లు చెబుతున్న సమాధానం షాకింగ్‌గా ఉంది. తాము ఆందోళన చేస్తున్నది సోషల్ మీడియా నిషేధం గురించి కాదు.. ప్రభుత్వం అవినీతిని సోషల్ మీడియా లో ప్రశ్నిస్తున్నందుకే అంటూ సమాధానం ఇస్తున్నారు. సోషల్ మీడియాను అణిచివేయటం అంటే ప్రభుత్వ వైఖరి ఏంటో అర్థం కావటం లేదా అని ఎదురుప్రశ్నించారు. ఇక దేశంలో పరిస్థితులు అదుపు తప్పటంతో సైన్యాన్ని రంగంలోకి దించింది నేపాల్ ప్రభుత్వం. ఆర్మీ, పోలీసుల కాల్పుల్లో తొమ్మిది మంది చనిపోయారు.
నేపాల్ ప్రభుత్వానికి పొంచివున్న ముప్పు
ఓవరాల్‌గా నేపాల్ దేశం ఇప్పుడు సోషల్ మీడియాకు దూరంగా.. యువత ఆందోళనకు చాలా దగ్గరగా ఉంది. సోషల్ మీడియా బ్యాన్ ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కోవచ్చు అనుకున్న అక్కడి ప్రభుత్వానికి ఇప్పుడు యువత ఆందోళన రూపంలో అంతకంటే పెద్ద ప్రమాదం పొంచి ఉంది.
తీవ్ర ఉద్రిక్తతలు, హింసాత్మక ఘటనల నేపథ్యంలో.. వెనక్కు తగ్గిన నేపాల్ ప్రభుత్వం
తీవ్ర ఉద్రిక్తతలు, హింసాత్మక ఘటనల నేపథ్యంలో సోషల్ మీడియాపై నిషేధం విషయంలో నేపాల్ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. పరిస్థితి చేయి దాటిపోయిందని గ్రహించిన ప్రభుత్వం చివరకు సామాజిక మాధ్యమాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ మేరకు క్యాబినెట్ సమావేశం నిర్వహించిన అనంతరం ఓ స్పష్టమైన ప్రకటన చేసింది నేపాల్ ప్రభుత్వం. జరిగిన ఘటనలకు బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు నేపాల్ హోంశాఖ మంత్రి రమేశ్ లేఖక్.