ISRO : ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ సీ-56 ప్రయోగం సక్సెస్ అయ్యింది. సింగపూర్‌కు చెందిన డీఎస్-సార్ ప్రధాన ఉపగ్రహంతోపాటు 6 చిన్న ఉపగ్రహాలను ఎర్త్ ఆర్బిట్‌లోకి ప్రవేశించాయి. 420 కిలోల బరువుగల 7 ఉపగ్రహాలను PSLV C-56 నింగిలోకి మోసుకెళ్లింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఆదివారం ఉదయం 6.31 గంటలకు PSLV-C56 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఇది ఈ ఏడాది ఇస్రో చేపట్టిన మూడో వాణిజ్య ఉపగ్రహ ప్రయోగం.
ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్ తెలిపారు. ఉపగ్రహాలను కచ్చితమైన కక్ష్యలోకి వాహక నౌక ప్రవేశపెట్టిందని వివరించారు. ప్రయోగాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేసిన శాస్త్రవేత్తలకు అభినందించారు.
PSLV శ్రేణిలో మరిన్ని ప్రయోగాలు చేపడతామని సోమనాథ్ ప్రకటించారు. ఆగస్టులో కానీ సెప్టెంబర్ కానీ మరో PSLV ప్రయోగం చేపడతామన్నారు. ఇస్రోపై నమ్మకం ఉంచి ఉపగ్రహాలను ప్రయోగించే బాధ్యత అప్పగించిన సింగపూర్ ప్రభుత్వానికి సోమనాథ్ కృతజ్ఞతలు తెలిపారు.