Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన మరోసారి చర్చకు వచ్చింది. ఇటీవల సోనియా కుటుంబాన్ని కలిసేందుకు హర్యానా రైతులు వచ్చారు. ఈ సందర్భంగా సోనియాతో మాట్లాడుతూ.. రాహుల్ పెళ్లి గురించి అడిగారు. జులైలో ఆ రాష్ట్రంలో పర్యటించిన రాహుల్ గాంధీ.. సోనీపట్ జిల్లా మదీనా గ్రామ మహిళా రైతులను కలిశారు. ఆ సమయంలో తమకు ఢిల్లీకి రావాలని ఉందని రాహుల్‌కు చెప్పడంతో.. వారిని ఆహ్వానించారు . ఆ మహిళలంతా ఢిల్లీలో సోనియా నివాసానికి వెళ్లారు. హర్యానా నుంచి వెళ్లిన మహిళా రైతులు ముందుగా ఢిల్లీలోని పలు ప్రాంతాలు సందర్శించారు. అనంతరం 10
జన్‌పథ్‌లోని సోనియాగాంధీ నివాసానికి చేరుకున్నారు.
సోనియా నివాసానికి చేరుకున్న హర్యానా మహిళా రైతులను సాదరంగా ఆహ్వానించారు రాహుల్ కుటుంబ సభ్యులు. వారికి ప్రత్యేక ఆతిథ్యం ఏర్పాటు చేయడమే కాకుండా.. సోనియాతోపాటు ప్రియాంక, రాహుల్ కూడా వారితో కలిసి భోజనం చేశారు. ఆప్యాయంగా ముచ్చటించారు.ఈ సందర్భంగా ఓ మహిళ చిన్నగా.. సోనియా గాంధీ చెవిలో ఓ మాట అడిగింది. రాహుల్‌కు పెళ్లి చేద్దామా అని అంది. అందుకు సోనియా బదులిస్తూ.. మీరే ఓ మంచి అమ్మాయిని చూడండి అనడంతో.. రాహుల్ నవ్వుతూ..అవుతుంది.. అవుతుందిలే అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు రాహుల్ గాంధీ.
రాజీవ్ గాంధీ మరణం గురించి మహిళా రైతులు.. సోనియాను అడగ్గా ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఈ విషయంపై ప్రియాంక బదులిస్తూ.. ఆ సమయంలో అమ్మ చాలా కుంగుబాటుకు లోనయ్యారని.. కొన్ని రోజులపాటు ఆహారం, నీళ్లు ముట్టలేదని చెబుతుండగా.. సోనియా కన్నీటిపర్యంతమయ్యారు. అనంతరం తేరుకుని మహిళలతో సరదాగా ముచ్చటించారు. మహిళా రైతులతో కలిసి నృత్యం చేశారు సోనియా, ప్రియాంక.