Marriage Fraud: పంజాబ్‌లో అత్యంత విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. పంజాబ్ సివిల్ సర్వీసెస్ (PCS) ఆఫీసర్‌నని అబద్ధం చెప్పి ఏకంగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సీనియర్ నేతనే ఓ మహిళ బురిడీ కొట్టించింది. వయసు, పెళ్లికి సంబంధించిన నిజాలను దాచి ఆయనను వివాహం చేసుకోవడమే కాకుండా కొద్ది నెలల్లోనే ఇంట్లోని బంగారంతో పరారైంది.
ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, సర్హింద్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అమరీందర్ సింగ్ మండోఫల్ (Amarinder Singh Mandofal) ఈ ఘటనలో బాధితుడిగా మిగిలారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయనకు మన్‌విందర్ కౌర్ అనే మహిళతో వివాహం జరిగింది. తాను పీసీఎస్ ఆఫీసర్‌నని, ఇంకా పెళ్లి కాలేదని సదరు మహిళ, ఆమె కుటుంబ సభ్యులు నమ్మించడంతో అమరీందర్ సింగ్ ఆమెను వివాహం చేసుకున్నారు. అంతేకాకుండా తన వయసును కూడా ఆమె తక్కువగా చూపించి మోసం చేసింది.
వారి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వాన్‌తో పాటు కేబినెట్ మంత్రి తరుణ్‌ప్రీత్ సింగ్ సౌంద్, పలువురు ఎమ్మెల్యేలు, ఆప్ కీలక నేతలు ఈ వేడుకకు హాజరయ్యారు. సదరు నేతలు.. దంపతులతో కలిసి భాంగ్రా నృత్యాలు చేసిన ఫోటోలు, వీడియోలు సైతం అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే పెళ్లయిన కొన్ని నెలలకే ఆ మహిళ తన అసలు రూపాన్ని బయటపెట్టింది. ఇంట్లోని బంగారు, వెండి ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులతో ఆమె పారిపోయింది.
సదరు మహిళ ప్రవర్తనపై అనుమానం వచ్చిన అమరీందర్ సింగ్ ఆమె గురించిన వివరాలను ఆరా తీయడం ప్రారంభించారు. ఆ విచారణలో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెకు ఇదివరకే పెళ్లయి విడాకులు అయ్యాయని, అంతేకాకుండా ఆమెకు 18 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడని తెలిసింది. నకిలీ గుర్తింపు, అబద్ధపు ప్రచారంతోనే తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నారని ఆయన గ్రహించారు.
Also Read: కెప్టెన్ స్మిత్ పుర్రెకు శస్త్రచికిత్స.. విజయవంతంగా నిర్వహించిన సౌదీ వైద్యులు!
ఈ మోసంపై అమరీందర్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫతేగఢ్ సాహిబ్ పోలీసులు రంగంలోకి దిగారు. మన్‌విందర్ కౌర్‌తో పాటు ఆమె సోదరుడు తర్లోచన్ సింగ్, తల్లి వరిందర్‌జిత్ కౌర్, బావ నరేందర్ సింగ్ గోల్డీ, వదిన రూపేందర్ కౌర్, అలాగే మాజీ సర్పంచ్ సురేందర్ సింగ్ రాణాలపై మోసం, ఫోర్జరీ కేసులు నమోదు చేశారు. నిందితులంతా తార్న్ తారన్ జిల్లాలోని భిఖివింద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్ సింగ్ గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Also Read: శంషాబాద్‌లో భారీ చోరీ.. ఏటీఎం బద్దలుకొట్టి రూ.32 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు!