BigTV English

Bihar: బీహార్ యాత్రలో సీఎం రేవంత్.. రాహుల్ గాంధీ ప్లాన్ అదేనా!

Bihar: బీహార్ యాత్రలో సీఎం రేవంత్..  రాహుల్ గాంధీ ప్లాన్ అదేనా!

Bihar: మన ఓటు.. మన హక్కు.. మన అధికారం.. ఇదే నినాదంతో రాహుల్ గాంధీ బిహార్ లో ఓటర్ అధికార్ యాత్ర చేపడుతున్నారు. ఓట్ల తొలగింపులో గందరగోళం జరిగింది.. బిహార్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎందుకు.. ఈసీ, బీజేపీ ములాఖత్ అయ్యాయి.. ఇలాంటి ఆరోపణలు చేస్తూ రాహుల్ గాంధీ బిహార్ లో యాత్ర చేపట్టారు. ఈ యాత్రలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా జాయిన్ అయ్యారు. ఇంతకీ ఏంటి ఈ ఓటర్ అధికార్ యాత్ర? బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇంపాక్ట్ చూపుతుందా?


ఓటర్ అధికార యాత్రకు భారీగా యూత్

అవును ఇప్పుడు బిహార్ లో ఓటర్ అధికార్ యాత్ర సంచలనంగా మారుతోంది. ఓటర్ లిస్టులో మతలబులు జరిగాయని, స్పెషల్ రివిజన్ తో గేమ్ మార్చేశారన్న ఆరోపణలతో రాహుల్ గాంధీ బిహార్ ఓటర్లను చైతన్య పరిచేలా యాత్ర చేపట్టారు. ఈ యాత్రకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. బిహార్ యూత్ అంతా రాహుల్ వెంటే కదం తొక్కుతున్నారు. కథ మారుస్తామంటున్నారు. త్వరలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అక్కడ పెద్ద ఎత్తున ఓట్లు తొలగించారని, ఈసీ, బీజేపీ కుమ్మక్కు అయ్యాయని ఇటీవలే రాహుల్ తీవ్ర ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా మ్యాటర్ హీటెక్కింది. సో బిహార్ లో ఈసారి గేమ్ ప్లాన్ మార్చాలన్నది రాహుల్ గాంధీ టార్గెట్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఎన్డీఏతో పోలిస్తే ఇండియా కూటమి ప్రచారంలో స్పీడ్ పెంచింది. బిహార్‌లో ఈసీ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఈ యాత్రను ప్రారంభించారు. ఓటర్ల జాబితాలో ఈసీ సవరణలు చేస్తూ, అక్రమంగా ఓట్లను తొలగిస్తోందని, దీన్ని ఓట్‌ బందీగా రాహుల్ చెబుతున్నారు.


రాహుల్ యాత్రలో పాల్గొన్న సీఎం రేవంత్

పేదలు, వెనుకబడిన వర్గాలు, దళితులు, ఆదివాసీల ఓట్లను ఓటర్ లిస్ట్ నుంచి తొలగిస్తున్నారని, దీన్ని అడ్డుకోవడానికి, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే లక్ష్యంతో ఓటర్ అధికార్ యాత్ర ప్రారంభించారు. ఓటు హక్కు ప్రజాస్వామ్య హక్కు అని, దాన్ని కాపాడటం అంటే రాజ్యాంగ విలువలను పరిరక్షించడమే అంటున్నారు. బీజేపీ, ఈసీ కలిసి ఓటర్ లిస్టులో మార్పులు చేస్తూ, ఎన్నికల్లో బెనిఫిట్ పొందేలా చేస్తున్నాయంటున్నారు. బిహార్‌లో 52 లక్షల ఓట్లను తొలగించడం, మహారాష్ట్రలో కోటి మంది కొత్త ఓటర్లను చేర్చినట్లు రాహుల్ గుర్తు చేస్తున్నారు. సో ఈ ఓటర్ అధికార్ యాత్రలో అన్ని వర్గాల ప్రజలతో రాహుల్ గాంధీ మమేకం అవుతున్నారు. తాజాగా ప్రియాంక గాంధీ, అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో కలిసి హాజరయ్యారు. సుపౌల్‌లో నిర్వహించిన యాత్రలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి పాల్గొన్నారు. ఓటర్ అధికార్ యాత్రకు సపోర్ట్ తెలిపారు. వీరితో పాటే ఇతర ఇండియా కూటమి నేతలు కూడా పాల్గొన్నారు.

సెప్టెంబర్ 1 వరకు ఓటర్ అధికార్ యాత్ర

ఈ ఓటర్ అధికార్ యాత్రను ఆగస్ట్ 17న ససారాం నుంచి ప్రారంభించారు రాహుల్ గాంధీ. మొత్తం 16 రోజుల పాటు, అంటే సెప్టెంబర్ 1 వరకు కొనసాగనుంది. బిహార్‌లోని 20కి పైగా జిల్లాలను కవర్ చేస్తూ, సమస్తీపూర్, దర్భంగా, మధుబని, సీతామడి, షియోహర్, మోతిహారీ, సీవాన్, గోపాల్‌గంజ్, పట్నా వంటి ప్రాంతాల మీదుగా 1,300 కిలోమీటర్లు ఉండబోతోంది. సెప్టెంబర్ 1న పట్నాలో భారీ ర్యాలీతో ఈ యాత్ర ముగియబోతోంది. సో ఈ విషయంపై రాహుల్ గాంధీ సీరియస్ గానే కనిపిస్తున్నారు. ప్రస్తుతం మోడీ ప్రభుత్వం అధికారంలో ఉందని, అయితే ఇండియా కూటమి పవర్ లోకి వచ్చాక ఈసీ అధికారులపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్స్ కూడా ఇస్తున్నారు. ఈ యాత్ర పొలిటికల్ ప్రోగ్రామ్ మాత్రమే కాదని, ప్రజల ఓటు హక్కును కాపాడే ఉద్యమమని అంటున్నారు.

బిహార్‌లో జనం మధ్యే రాహుల్, తేజస్వి

2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి గట్టిగానే పోరాడింది. మెజార్టీకి కొద్ది దూరంలో నిలిచిపోయింది. ఈసారైతే సీన్ మార్చాలనుకుంటున్నారు. అందుకే ఓటర్ లిస్ట్ మెయిన్ అజెండాగా కదులుతున్నారు. జనంతో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్ ప్రజలతో డైరెక్ట్ కాంటాక్ట్ లో ఉండడంతో ఓటర్లలో విశ్వాసం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్జేడీ లీడర్ తేజస్వీ యాదవ్, కాంగ్రెస్ నాయకులు, లెఫ్ట్ పార్టీలు ఈ ఓటర్ అధికార్ యాత్రలో పాల్గొనడం ద్వారా ఇండియా కూటమి యూనిటీని ప్రదర్శిస్తోంది. రాహుల్ గాంధీ గతంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర అలాగే భారత్ జోడో న్యాయ్ యాత్ర కాంగ్రెస్‌కు పొలిటికల్ గా చాలా మైలేజ్ తీసుకొచ్చాయి.

ఇప్పుడు బిహార్ లో ఓటర్ అధికార్ యాత్ర గేమ్ ఛేంజర్ అంటున్నారు. అయితే ఇక్కడ కొన్ని లెక్కలు ఉన్నాయి. బిహార్ లో ఎన్నికలు అంటే.. కుల రాజకీయాలకు పెట్టింది పేరు. వీటికి తోడు ఉపాధి కల్పన, ఆర్థిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలు వంటి స్థానిక సమస్యల చుట్టూ తిరుగుతాయి. అంటే కేవలం ఓటర్ లిస్టు సమస్యే కాకుండా.. స్థానిక బిహారీల సమస్యలను పట్టించుకుంటేనే ఫలితాలు అనుకూలంగా వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. సో రాహుల్, తేజస్వీ పాల్గొంటున్న ఈ యాత్రకు జనం ముఖ్యంగా బిహారీ యూత్ స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ర్యాలీల్లో పాల్గొంటున్నారు. ఓటు హక్కు రక్షణ అన్న థీమ్ కు జనంలో ఆదరణ అయితే కనిపిస్తోంది. అటు సోషల్ మీడియాలోనూ ఈ యాత్రకు సంబంధించిన పోస్ట్‌లు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

బిహార్ మాదిరిగానే తెలంగాణలోనూ ఓట్ చోరీ జరిగిందని, అందుకే బీజేపీ 8 చోట్ల ఎంపీ సీట్లు గెలిచిందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కామెంట్స్ చేయడంతో ఈ స్టోరీ మరో లెవెల్ కు వెళ్లింది. అటు బండి సంజయ్, డీకే అరుణ నుంచి కౌంటర్లు వచ్చాయి. కాంగ్రెస్ నుంచి ఎన్ కౌంటర్లు నడుస్తున్నాయ్. ఓవరాల్ గా పొలిటికల్ హీట్ బిహార్ టూ తెలంగాణ అన్నట్లుగా నడుస్తోంది. మరి తెలంగాణలోనూ ఓట్లు గజిబిజిగా ఉన్నాయా..? ఒకే అడ్రస్ పై వందలాది ఓటర్లు నమోదై ఉన్నారా? ఏది నిజం?

బిహార్ లొ 65 లక్షల ఓట్లు తొలగించిన ఈసీ

బిహార్ లో ఓట్ల తొలగింపుపై ఈసీ ఇచ్చిన రిపోర్ట్ చూద్దాం. ఆగస్ట్ 18న ప్రకటించిన ఓటర్ల డేటా ప్రకారం మొత్తం 65 లక్షల ఓట్లు తొలగించింది. ఇందులో అత్యధిక డిలీషన్స్ ఉన్న 3 జిల్లాల్లో కథ మారబోతోంది. అవి పట్నా, మధుబని, తూర్పు చంపారన్. ఇందులో పురుషుల కంటే మహిళల ఓట్లే ఎక్కువగా తొలగించారు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఈనెంబర్ మూడో వంతు కంటే ఎక్కువే. ఈ మూడు జిల్లాల్లో మొత్తం 10.63 లక్షల ఓట్లను డిలీట్ చేసింది ఈసీ. బిహార్ లో 38 జిల్లాల్లో జరిగిన మొత్తం 65 లక్షల ఓట్ల తొలగింపుల్లో ఇది 16.35 శాతం. ఇందుకు ఈసీ 4 కారణాలు చెప్పింది. శాశ్వతంగా షిఫ్ట్ అయ్యారని, మరణించారని, గైర్హాజరుగా ఉన్నారని, ఇప్పటికే ఓటర్ లిస్టులో నమోదై ఉన్నారని చెప్పింది. బిహార్‌లోని 38 జిల్లాలలో 3.95 లక్షల ఓటర్ల తొలగింపుతో పట్నా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఒకవేళ ఓటర్ లిస్టులో ఎక్కడా లేకపోతే పౌరసత్వ రుజువు సమర్పించాలని EC ఆదేశించింది. సో అదీ మ్యాటర్.

దొంగ ఓట్లతోనే బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలిచిందని కామెంట్

సో ఈ ఓట్ దుమారం తెలంగాణకూ పాకింది. వరంగల్ లో జనహిత పాదయాత్రలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ బీజేపీని కార్నర్ చేశారు. బీజేపీ 8 మంది ఎంపీ సీట్లను దొంగ ఓట్లతోనే గెలిచిందన్నారు. దొంగ ఓట్లపై ప్రశ్నిస్తే ఈసీ బీజేపీకి వత్తాసు పలుకుతోందన్నారు. తెలంగాణలో ఓట్ చోరీ జరిగిందని, మహారాష్ట్రలో ఓటు వేసిన వారు నిజామాబాద్ లో కూడా వేశారన్నారు. దీనికి కేంద్రమంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. 30 ఏళ్లుగా తాను ప్రజాప్రతినిధిగా ఉన్నానన్నారు. వార్డు మెంబర్‌ కానివాళ్లు కూడా విమర్శించడం ఏంటని క్వశ్చన్ చేశారు. దొంగ ఓట్లు అంటూ కాంగ్రెస్‌ నేతలు చేసే దుష్ప్రచారం ప్రజలను అవమానించడమే అని అన్నారు. కాంగ్రెస్‌ నేతలు రాత్రిపూట యాత్రలు చేయడం ఏంటో అర్థం కావడం లేదంటూనే… కరీంనగర్‌లో ప్రతి ఓటూ పరిశీలించి దొంగ ఓట్ల తీసేయాలంటున్నారు. నిజంగానే తెలంగాణలో ఓట్ చోరీ చేసి ఉంటే కాంగ్రెస్ గెలిచిన ఆ ఎనిమిది ఎంపీ సీట్లు కూడా గెలిచి ఉండేవాళ్లమంటున్నారు. ప్రజల ఓట్లతో మహేష్ గౌడ్ ఒక్కసారైనా గెలవాలని ఛాలెంజ్ చేస్తున్నారు బండి సంజయ్.

Also Read: ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడి 30 మంది మృతి..

వీటిపై మరోసారి కాంగ్రెస్ నేతల నుంచి కౌంటర్లు పడ్డాయి. తెలంగాణలో బీజేపీకి ఓట్లు ఎక్కడివని, బీజేపీ దొంగఓట్లపై పోరాటం చేస్తామంటున్నారు. ఓట్ చోరీతోనే తెలంగాణలో బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలిచిందని, కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలు వచ్చే దమ్ముందా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని క్వశ్చన్ చేస్తున్నారు. కరీంనగర్ లో ఒక ఇంట్లో నలభై ఓట్లు ఉన్నాయని, కరీంనగర్ లో బీజేపీ ఎక్కడెక్కడ వీక్ గా ఉందో అక్కడ ఓట్లని నమోదు చేయించారన్నారు. బండిసంజయ్ మెజారిటీ వచ్చిన ఓట్లన్ని ఓట్లచోరీనే అని కరీంనగర్ కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ పూర్తిగా జనం నమ్మకాన్ని కోల్పోయిందని, మహేశ్ కుమార్ గౌడ్ కు మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ. దమ్ముంటే హైదరాబాద్ లో దొంగ ఓట్లు ఏరివేయాలని, తెలంగాణలో నిజంగానే దొంగ ఓట్లు ఉంటే కాంగ్రెస్ కూడా దొంగ ఓట్లతో గెలిచినట్లే లెక్క అంటూ కౌంటర్ విసిరారు. సో ఈ డైలాగ్ వార్ రోజురోజుకూ ముదురుతూనే ఉంది. బిహార్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లెక్కేంటో గానీ.. తెలంగాణలోనూ ఓట్ చోరీ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది.

Story By Vidya Sagar, Bigtv

Related News

Jammu Kashmir: ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడి 30 మంది మృతి..

Trump-Modi: 4సార్లు ట్రంప్ ఫోన్ కాల్ కట్ చేసిన మోదీ.. జర్మనీ పత్రిక సంచలన కథనం

Cloudburst: దోడాలో క్లౌడ్ బరస్ట్.. జమ్మూ ప్రాంతంలో వరదల విజృంభణ.. మళ్లీ ప్రాణనష్టం!

Discount Scheme: వాహనదారులకు ప్రభుత్వం కొత్త స్కీమ్.. ఏ మాత్రం ఆలస్యం వద్దు

PM Modi: రంగంలోకి సుదర్శన చక్ర.. ఇక శత్రువులకు చుక్కలే!

Big Stories

×