Sanju Samson : టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్ మొన్న విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి రెచ్చిపోయాడు. ఈ సారి ఏకంగా ఒక్క బంతికే రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి కేరళ టీ20 క్రికెట్ లీగ్ లో టీమిండియా ఆటగాడు సంజూ శాంసన్ సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. ప్రధానంగా రెండు మ్యాచ్ ల్లో ఏకంగా 16 సిక్సర్లు బాదాడు. తొలి మ్యాచ్ లో 7 సిక్సర్లు, రెండో మ్యాచ్ లో మరింత రెచ్చిపోయి 9 సిక్సర్లు కొట్టాడు. త్రిస్సూర్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో సంజూ శాంసన్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. నోబాల్ అయిన ఓ బంతికి రెండు సిక్సర్లు బాది 13 పరుగులు రాబట్టాడు. ఈ మ్యాచ్ లో సంజూ 46 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేశాడు. అంతకు ముందు తొలి మ్యాచ్ లో శాంసన్ సెంచరీతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.
Also Read : Swastik Chikara’s father: నా కొడుకు క్రికెట్ ఆడకున్నా పర్వాలేదు… కోహ్లీకి నీళ్లు ఇచ్చి బతికేస్తాడు
సంజూ మరోసారి విధ్వంసం..
అరైస్ కొల్లాం సైలర్స్ పై 51 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 121 పరుగులు చేసాడు. సంజూ శాంసన్ బీభత్సం ధాటికి సైలర్స్ పై అతను ప్రాతినిథ్యం వహిస్తున్న కొచ్చి బ్లూ టైగర్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. చివరి బంతికి ఆరు పరుగులు అవసరం కాగా.. ఆషిక్ సిక్సర్ కొట్టి టైగర్స్ ను విజయతీరాలకు చేర్చాడు. తాజాగా త్రిస్సూర్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఇంచు మించు ఇలాంటి డ్రామానే చోటు చేసుకుంది. అయితే గెలిచింది మాత్రం సంజూ శాంసన్ జట్టు కాదండోయ్.. సంజూ విధ్వంసం తరువాత బ్లూ టైగర్స్ త్రిస్సూర్ ముందు 189 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఛేదనలో టైటాన్స్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయినప్పటికీ ఓపెనర్ అహ్మద్ ఇమ్రాన్ (72) ఒంటరిపోరాటం చేసి గెలుపు పై ఆశలు కోల్పోకుండా చేసాడు. ఇమ్రాన్ ఔట్ అయిన తరువాత టైటాన్స్ గెలిపించే బాధ్యత కెప్టెన్ సిజిమోన్ జోసఫ్ (42 నాటౌట్), అర్జున్ (31 నాటౌట్ ) తీసుకున్నారు.
అజినాష్ హ్యాట్రిక్..
ముఖ్యంగా చివరి 5 ఓవర్లలో గెలుపునకు 66 పరుగులు అవసరమైన దశలో సిజిమోన్, అర్జున్ చెలరేగి ఆడారు. వరుసగా ఓవర్ కు 12, 16, 13, 10, 15 పరుగులు పిండుకున్నారు. చివరి మూడు బంతులకు 12 పరుగులు అవసరమైన తరుణంలో సిజిమోన్ సిక్సర్, డబుల్, బౌండరీ బాది తన జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్ సంజూ శాంసన్ ఔట్ అయిన తరువాత బ్లూ టైగర్స్ ఇన్నింగ్స్ కాస్త లయ తప్పిందనే చెప్పాలి. సంజూ ఔట్ అయిన తరువాత అజినాస్ అనే బౌలర్ వరుసగా మరో రెండు వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. సంజూ క్రీజులో ఉన్నంత సేపు టైగర్స్ స్కోర్ 200 పరుగులు మార్కును తాకేవిధంగా కనిపించింది. సంజూ శాంసన్ ఔట్ కాగానే ఆతరువాత వరుస వికెట్లు కోల్పోవడంతో టైగర్స్ 188 పరుగులకే పరిమితమైంది. మరోవైపు ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో సంజూ శాంసన్ చోటు దక్కిన విషయం తెలిసిందే. తుది జట్టులో అతని స్థానం పై మాత్రం పలు అనుమానాలు నెలకొనడం గమనార్హం.
?igsh=Y2kyY3I2OW85Zm1y