Rahul Gandhi on Ambani Wedding| దేశంలో అత్యంత సంపన్నుడు, లక్షల కోట్ల ఆస్తి యజమాని అయిన ముకేశ్ అంబానీ తన కొడుకు పెళ్లి వేల కోట్లు ఖర్చు పెట్టాడని.. అదంతా ప్రజల సొమ్ము అని కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ మంగళవారం హర్యణా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
హర్యణాలోని సోనీపత్‌లో జరిగిన ఎన్నికల కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ”మీరందరికీ ఒక విషయం తెలుసా?.. అంబానీ గారు తన కొడుకు పెళ్లికి వేలు కోట్లు ఖర్చు పెట్టాడని. ఆ ధనం ఎవరిది? మీది. ప్రజలది. మీరు మీ పిల్లల వివాహాలు చేయాలంటే మీ బ్యాంక్ అకౌంట్లలో డబ్బులండవు. పెళ్లి ఖర్చుల కోసం లోన్ తీసుకోవాలి. ఇదంతా నరేంద్ర మోదీ గారు చేసిన పని. ఆయన దేశంలో ఒక సిస్టమ్ తయారు చేశారు. దేశంలోని కేవలం 25 మంది మాత్రమే పెళ్లిళ్లకు వేల కోట్లు ఖర్చు చేలగలరు. కానీ ఒక రైతు తన ఇంట్లో పెళ్లి కోసం బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలి. సామాన్యుల జేబులు ఖాళీ చేసి ఆ ధనమంతా ఆ 25 మంది ధనికుల జేబుల్లోకి వెళుతోంది అదే నిజం. ఇది మన రాజ్యాంగంపై దాడ కాకపోతే.. మరేంటి?..” అని ప్రశ్నించారు.
Also Read: రూ.7కోట్లు దోపిడికి గురైన ప్రముఖ బిజినెస్‌మెన్.. మీరు మోసపోకుండా జాగ్రత్తపడండి!
రిలయన్స్ కంపెనీ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం ప్రముఖ వ్యాపావేత్త వీరేన్ మర్చంట్ కూతురు రాధికా మర్చంట్ తో జూలై నెలలో జరిగింది. ముంబై నగరంలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో అట్టహాస వేడుకగా ఈ పెళ్లి కార్యక్రమం సాగింది. ఈ పెళ్లిలో బాలీవుడ్ సెలెబ్రిటీలు, దేశంలోని అందరూ రాజకీయ నాయకులు ఈ పెళ్లికి హాజరు కాగా… ఈ గ్రాండ్ వెడ్డింగ్ గురించి ప్రపంచంలోని అన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి.
హర్యాణా ఎన్నికలు మరి కొన్ని రోజుల్లో జరుగనుండగా.. రాహుల్ గాంధీ ఈ పెళ్లికి జరిగిన ఖర్చు గురించి ప్రస్తావిస్తూ.. ప్రధాని మోదీ, బిజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. తన ప్రసంగంలో బిజేపీపై మరో దాడి చేస్తూ.. భారత సైన్యంలో అగ్నివీర్ పథకం తీసుకువచ్చిన బిజేపీ ప్రభుత్వం.. దేశ సైనికులకు పెన్షన్, క్యాంటీన్ సదుపాయాలు, అమరుడి హోదా ఇవ్వకుండా మొండి చేయి చూపించిందని అన్నారు.
అక్టోబర్ 5న హర్యాణాలో అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ జరుగనుండగా.. రాష్ట్రంలో బిజేపీ, కాంగ్రెస్ మధ్య ఈసారి గట్టిపోటీ నెలకొంది. మూడోసారి అధికారంలో రావాలని బిజేపీ ప్రయత్నిస్తుండగా.. పదేళ్ల తరువాత అధికారం పొందాలని కాంగ్రెస్ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది.