Big Stories

Rahul Gandhi : భారత్ జోడో యాత్ర @ 100 రోజులు.. కాంగ్రెస్ లో కొత్త జోష్..

Rahul Gandhi : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర వందో రోజులకు చేరుకుంది. డిసెంబర్ 5 నుంచి రాజస్థాన్‌ లో పాదయాత్ర కొనసాగుతోంది. రాహుల్ తో కలిసి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా నడుస్తున్నారు. ఈ నెల 24న ఢిల్లీలో రాహుల్ అడుగు పెడతారు. ఎనిమిది రోజుల విరామం తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణా, పంజాబ్‌ మీదుగా యాత్రను కొనసాగించి జమ్మూ-కశ్మీర్‌ లో ముగిస్తారు. రాహుల్‌ గాంధీ మొత్తం 3500 కి.మీ నడుస్తారు. ఇప్పటికే 2800 కి.మీలు పూర్తి చేసుకున్నారు.

- Advertisement -

కన్యాకుమారి-కాశ్మీర్
రాహుల్ గాంధీ సెప్టెంబర్‌ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు 7 రాష్ట్రాలను చుట్టేశారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో యాత్ర పూర్తైంది. ప్రస్తుతం రాజస్థాన్ లో ఉన్న రాహుల్ మరో నాలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర చేస్తారు. 3 నెలలకుపైగా యాత్రను కొనసాగిస్తున్న రాహుల్‌ గాంధీ.. అన్ని వర్గాల ప్రజలను పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. వారి సమస్యలు తెలుకుంటున్నారు. కాంగ్రెస్ ను అధికారంలోనికి తీసుకురావాల్సి అవసరాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. కష్టాల్లో ఉన్నవారికి భరోసా కల్పిస్తూ రాహుల్ ముందుకు సాగుతున్నారు.

- Advertisement -

విమర్శలు..సవాళ్లు
బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేయడమే తన లక్ష్యమని రాహుల్‌ గాంధీ స్పష్టం చేస్తున్నారు. అయితే బీజేపీ మాత్రం పాదయాత్ర ప్రారంభం నుంచి రాహుల్‌ పై విమర్శలు గుప్పిస్తోంది. కాషాయ నేతలు వివాదస్పద కామెంట్స్ చేస్తున్నారు. రాహుల్ ధరించిన టీ-షర్ట్ ధర రూ. 41 వేలని కామెంట్ చేశారు. రాహుల్ ఆహార్యంపై బీజేపీ నేతలు విమర్శలు చేశారు. ఇరాక్‌ నియంత సద్దాం హుస్సేన్‌ లా కనిపిస్తున్నారని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ కామెంట్స్ చేయడం వివాదాన్ని రేపింది.

మరోవైపు ఈ యాత్ర మహారాష్ట్రలో కొనసాగుతున్న సమయంలో సావర్కర్‌ పై రాహుల్ చేసిన విమర్శలు ఆ రాష్ట్రంలో అగ్గి రాజేశాయి. ఆ వ్యాఖ్యలను కాంగ్రెస్ మిత్రపక్షం శివసేన కూడా ఖండించింది. సామర్కర్ పై చేసిన విమర్శలపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. అటు మధ్యప్రదేశ్‌లో పాదయాత్ర జరుగుతున్న సమయంలో రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ అగ్రనేతల మధ్య ఆధిపత్య పోరు మరోసారి తెరపైకి వచ్చింది. ఇలా ప్రతిపక్షాల నుంచే కాక మిత్రపక్షాలు, పార్టీ నుంచి రాహుల్ కు పాదయాత్ర సమయంలో సవాళ్లు ఎదురయ్యాయి. ఆ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు.

సెలబ్రిటీల మద్దతు
రాహుల్‌ గాంధీకి పలు రంగాల ప్రముఖులు సంఘీభావం తెలిపారు. బాలీవుడ్ నటులు పూజా భట్‌, రియా సేన్‌, స్వరభాస్కర్‌, రష్మీ దేశాయ్‌ యాత్రలో పాల్గొని రాహుల్ కు మద్దతు పలికారు. మాజీ నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఎల్‌. రాందాస్‌, శివసేన నేత ఆదిత్య ఠాక్రే, ఎన్‌సీపీ నేత సుప్రియా సూలే, ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘరాం రాజన్‌ ఈ యాత్రలో రాహుల్‌తో కలిసి నడవడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తించింది.

కాంగ్రెస్ లో ఆశలు
రాహుల్ భారత్ జోడో యాత్ర సాగుతున్న సమయంలోనే గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. హిమాచల్‌లో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీతో ఘన విజయం సాధించింది. అయితే గుజరాత్‌లో మాత్రం ఘోర పరాజయం పాలయ్యింది. కానీ ఈ రెండు రాష్ట్రాల్లో రాహుల్ యాత్ర సాగకపోవడం విశేషం. వచ్చే ఏడాది జరగనున్న కర్ణాటక, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ ఎన్నికల్లో రాహుల్ పాదయాత్ర ప్రభావం కచ్చితంగా కనిపిస్తుందని రాజకీయ పండితులు చెబుతున్నారు. మొత్తంమీద రాహుల్‌ గాంధీ భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News