Honeymoon Couple Case : ఇండోర్ హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. రాజా రఘువంశీని చంపి.. ఆ హత్య కేసు నుంచి తప్పించుకోవడానికి ప్లాన్ ఏ, ప్లాన్ బీ, ప్లాన్ సీ..లు కూడా ముందే రెడీ చేసుకున్నారు నిందితులు. టోటల్ ఎపిసోడ్‌లో కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకతం.. అంతా సోనమ్ అనే తెలుస్తోంది. బాయ్‌ఫ్రెండ్ రాజ్ కుష్వాహా ఆమెకు ఫుల్‌గా సపోర్ట్ చేశాడు. ఇద్దరూ కలిసి ఖతర్నాక్ క్రైమ్ కథా చిత్రాన్ని సక్సెస్‌ఫుల్‌గా నడిపించారు. కానీ, అదంతా అట్టర్‌ఫ్లాప్ అవుతుందని వాళ్లు ముందుగా ఊహించలేక పోయారు.
పెళ్లికి ముందే చంపే ప్లాన్
సోనమ్ అండ్ రాజ్.. ఎంత డేంజర్ ప్లాన్ చేశారంటే.. రఘువంశీని పెళ్లికి ముందే చంపాలని ప్లాన్ చేశారు. ఇండోర్‌లోనే అతన్ని వేసేయాలని చూశారు. కానీ కుదరలేదు. ఆ తర్వాత హనీమూన్ కోసం షిల్లాంగ్ వెళ్లే ముందు గౌహతిలో హాల్ట్ అవగా.. అక్కడ మరోసారి మర్డర్ కోసం ట్రై చేశారు. అది కూడా వర్కవుట్ కాలేదు. చివరాఖరికి మేఘాలయలో నరికేసి, నదిలో తోసేసి.. ఇక ఆల్ హ్యాపీస్ అనుకున్నారు. అక్కడితో వారి కుట్ర కంప్లీట్ కాలేదు. ఇంకా ఉంది. సినిమాలు బాగా చూశారో ఏమో కానీ.. పోలీసులు తలుచుకుంటే తాము ఎలాగైనా దొరికిపోతామని గెస్ చేశారు. అలా దొరక్కుండా ఓ మైండ్ బ్లోయింగ్ స్కెచ్ వేశారు. ఎవరైనా ఒక యువతిని చంపేసి.. ఆమె డెడ్‌బాడీని కాల్చేసి.. సోనమ్‌గా నమ్మించాలనేది వాళ్ల ఐడియా. అలా ఆ కేసు క్లోజ్ అయ్యే వరకు సోనమ్ ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలో ఉండాలని భావించారు. కానీ, అది ఇంప్లిమెంట్ చేసేలోగా సీన్ మొత్తం మారిపోయింది. ఆ నలుగురు అడ్డంగా దొరికిపోయారు. పోలీసులు విచారణలో ఈ వివరాలన్నీ బయటకు వచ్చాయి.
ఎలా పారిపోయారంటే..
రాజా రఘువంశీని మర్డర్ చేసేందుకు రాజ్.. తన ముగ్గురు స్నేహితులకు ఖర్చుల కోసం 50 వేలు ఇచ్చాడు. పని పూర్తి అయ్యాక 20 లక్షలు ఇస్తామని డీల్ మాట్లాడుకున్నారు. మే 23న మధ్యాహ్నం 2 గంటల సమయంలో.. మేఘాలయలోని వీసావ్‌డాంగ్ జలపాతం దగ్గర.. ఆ ముగ్గురూ కలిసి అస్సాంలో కొన్న కత్తితో.. సోనమ్ కళ్ల మందే.. రాజాను నరికి చంపి.. మృతదేహాన్ని లోయలో పడేశారు. అది చాలా రిమోట్ ఏరియా కావడంతో ఎవరూ చూడరులే అనుకున్నారు. ఒకవేళ విషయం బయటపడినా అందుకు రెండు మూడు నెలలు టైమ్ పడుతుందని భావించారు. మర్డర్ చేసే టైమ్‌లో ఓ నిందితుడి చొక్కాకు రక్తపు మరకలు అంటాయి. సోనమ్ తాను వేసుకున్న రెయిన్‌కోట్‌ను అతనికి ఇచ్చి కవర్ చేసింది. ఆ తర్వాత దాన్ని కూడా పడేశారు. వాళ్లంతా లోకల్‌గా రెంట్ తీసుకున్న టూవీలర్స్‌పై ఘటనా స్థలం నుంచి వచ్చేశారు. ఆ వెహికిల్స్‌ను ఓ చోట వదిలేసి వెళ్లిపోయారు. పోలీసులు సోనమ్ రెయిన్‌కోట్‌ను, టూవీలర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
మేఘాలయా టు ఇండోర్.. బుర్ఖాలో సోనమ్..
రాజా రఘువంశీని హత్య చేశాక.. సోనమ్ బుర్ఖాలో మేఘాలయ నుంచి పరార్ అయింది. టాక్సీ, బస్సు, రైలు మార్గాల ద్వారా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు వచ్చింది. మొదట షిల్లాంగ్ నుంచి గౌహతికి ట్యాక్సీలో వచ్చింది. అక్కడ బస్సు ఎక్కి బెంగాల్‌లోని సిలిగురి చేరుకుంది. అక్కడి నుంచి బస్సులో పాట్నాకు.. ఆ తర్వాత రైల్లో లక్నో వెళ్లింది. అటునుంచి బస్సులో ఇండోర్ చేరింది సోనమ్. ఇండోర్‌లో ఓ గదిని అద్దెకు తీసుకుని.. లవర్ రాజ్‌ను పలిపించుకుని అతనితో గడిపింది. అక్కడి నుంచి వేరే రాష్ట్రానికి వెళ్లి.. తనను ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పడం వారి ప్లాన్. వెళ్తూ వెళ్తూ ఆ గదిలోనే మంగళసూత్రం, ఉంగరం వదిలేసి వెళ్లిపోయింది సోనమ్. పోలీసులు వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. రాజా రఘువంశీ హత్య కేసులో ఐదుగురు నిందితులను.. ఎనిమిది రోజుల కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు.