ISI Honey trap : రాజస్థాన్ లోని బికనీర్ లో ఓ రైల్వే ఉద్యోగి మన శత్రు దేశం పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) కోసం గూఢచర్యం చేస్తూ పట్టుబడ్డాడు. భారత్ లోని సున్నితమైన సైనిక సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేశాడని అతనిపై ఉన్న ప్రధాన ఆరోపణ. రైల్వేలో పని చేస్తున్న నిందితుడిని భవానీ సింగ్ గా పోలీసులు వెల్లడించారు. ఇతను.. పాకిస్థాన్ నుంచి విసిరిన హనీ ట్రాప్ లో చిక్కుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దేశ వ్యతిరేక కార్యకలాపాలలో అతని ప్రమేయానికి సంబంధించిన అనేక ఆధారాలను సేకరించిన అధికారులు.. అతన్ని అరెస్టు చేశారు. భవానీ సింగ్ పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
నిందితుడు భవానీ సింగ్ మహాజన్ స్టేషన్ లో పాయింట్ మ్యాన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అతన్ని ఫిబ్రవరి 27న సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటుగా ఈ-మిత్రా ఆపరేటర్ ను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరిని ప్రశ్నించిన తర్వాత.. తగిన ఆధారాలు లేవంటూ ఈ – మిత్ర ఆపరేటర్ను పోలీసులు విడుదల చేశారు. ఇతనిపై అనుమానంతో మరింత లోతుగా విచారించేందుకు నిఘా వర్గాలు, పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా.. ఇతను సరిహద్దు అంతటా సున్నితమైన సమాచారాన్ని పంచుకునేలా పాకిస్తాన్ మహిళ అతన్ని హనీ-ట్రాప్ చేసిందని అధికారులు భావిస్తున్నారు.
నిఘా అధికారులు ఏమి కనుగొన్నారు?
పాయింట్ మెన్ గా పనిచేస్తున్న భవానీ సింగ్ కార్యకలాపాలు అనుమానాస్పదంగా ఉన్నట్లుగా గుర్తించిన నిఘా వర్గాలు. అతని కదలికలపై ఓ నిఘా బృందం కన్నేసి ఉంచింది. వీరి పరిశీలలో ఇతను తీవ్రమైన దేశ ద్రోహానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. దాంతో.. తగిన నిర్ధారణలు, ఆధారాలు సేకరించిన అధికారులు.. నిందితుడిని మహాజన్ రైల్వే స్టేషన్ లో అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేసేందుకు జైపూర్ స్టేషన్ కి తీసుకొచ్చారు. విచారణలో నిఘా అధికారులకు భవానీ సింగ్ చేస్తున్న పనిపై మరింత సమాచారం తెలిసిందని, అతను దేశ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్నట్లు ఆధారాలు లభించాయని ఇంటెలిజెన్స్ డీజీ సంజయ్ అగర్వాల్ వెల్లడించారు. భవానీ సింగ్ పాకిస్తాన్ కు రహస్య సమాచారాన్ని పంపినట్లు స్పష్టమవుతుందని, ఏ సమాచారాన్ని, ఎవరికి పంపారనే విషయాలపై మరింత స్పష్టత కోసం సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు.
సరిహద్దు ప్రాంతానికి దగ్గరగా ఉన్న మహాజన్ రైల్వే స్టేషన్ నుంచి.. ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్, సైనిక సిబ్బందికి సంబంధించిన సమాచారం, మహాజన్ రైల్వే స్టేషన్ నుంచి రవాణా అవుతున్న వివిధ సైనిక సామాగ్రికి సంబంధించిన సమాచారాన్ని వాట్సాప్ సందేశాలు, కాల్స్ ద్వారా పాకిస్థాన్ కు చేరవేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. కాగా.. అతన్ని ఎలా ట్రాప్ చేశారు. సున్నితమైన సమాచారం అందించడం ద్వారా అతనికి ఏం ప్రయోజనాలు అందిస్తున్నారు. అతన్ని ఎలా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు వంటి విషయాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామని, ఇందులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు.
Also Read : IAF Fighter Jets : రక్షణ శాఖ కీలక నిర్ణయం – వారికి ఫైటర్ జెట్ల తయారీ బాధ్యతలు.
ఈ ప్రాంతం భారత సైన్యానికి ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్, సరఫరా డిపో కావడంతో ఇక్కడ రోజూ అనేక సైనిక కార్యకలాపాలు జరుగుతాయి. దీంతో.. ఇక్కడి విషయాల్ని తెలుసుకునేందుకు పాకిస్తాన్ సైన్యం.. ఇక్కడి వ్యక్తులపై తరచుగా హనీ ట్రాప్ నకు పాల్పడుతుంది. పాకిస్తాన్ మహిళలు వార్తా విలేకరులుగా, హిరోయిన్లుగా నటిస్తూ భారతీయ పౌరులను ఆకర్షిస్తుంటారు. ఇలా గతంలోనూ అనేక మంది గుర్తించగా… గతేడాది మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లోని ఒక క్యాంటీన్ యజమాని ISI కోసం గూఢచర్యం చేస్తున్నట్లు కనుక్కున్నారు.