Raksha Bandhan 2025: దేశ వ్యాప్తంగా శనివారం రక్షా బంధన్ పండుగ జరగనుంది. ఇప్పటికే చాలామంది మహిళలు తమ తమ ఉద్యోగాలకు సెలవు పెట్టేశారు. రాఖీ పండుగ నేపథ్యంలో వివిధ ప్రభుత్వాలు మహిళలకు బంపరాఫర్లు ప్రకటించాయి. ఉచిత బస్సు ప్రయాణాలు చేయవచ్చని వివిధ ప్రభుత్వాలు వెల్లడించాయి.
రాఖీ వేడుకల సమయంలో తమ సోదరులు, కుటుంబాలను సందర్శించే మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. తేదీలు, ముఖ్య వివరాలతోపాటు ఉచిత బస్సు సేవలను అందించే రాష్ట్రాల పూర్తి జాబితాపై ఇప్పుడు చూద్దాం.
యూపీ– యోగి ఆదిత్యనాథ్ సర్కార్ రాఖీ పండుగ నేపథ్యంలో మహిళలకు మూడు రోజుల పాటు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రకటించింది. శ్రావణ శుక్రవారం మొదలు అనగా శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 10 అర్ధరాత్రి వరకు యూపీ ఎస్‌ఆర్‌టీసీ బస్సులతోపాటు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే సిటీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు బస్సులు నడపనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
రాజస్థాన్ ప్రభుత్వం ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేలేదు. మహిళలు రెండు రోజుల పాటు ఉచిత ప్రయాణ సౌకర్యం కలిపించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. శనివారం, ఆదివారాల్లో రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆ రాష్ట్రంలో ఉచిత బస్సు ఆఫర్ ఇవ్వడం ఇదే తొలిసారి.
ALSO READ: ఒక సింగిల్ బెడ్ రూమ్ ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట
హర్యానా ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు జాబితాలోకి చేరింది. శ్రావణ శుక్రవారం రోజు అనగా ఆగస్టు 8న మధ్యాహ్నం 12 గంటల నుండి ఆగస్టు 9 అర్ధరాత్రి వరకు ఉచిత బస్సు సదుపాయం కల్పించింది. మహిళలతోపాటు పిల్లలకు ఈ సదుపాయం అందించనుంది. ఢిల్లీ- చండీగఢ్‌లకు నడిచే బస్సుల సహా అంతర్రాష్ట్ర సర్వీసులకు ఈ ఆఫర్ చెల్లుబాటు అవుతుందని రవాణా మంత్రి అనిల్ విజ్ తెలిపారు.
మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం కొన్ని ప్రాంతాలకు పరిమితం చేసింది. భోపాల్, ఇండోర్ సిటీల్లో ప్రయాణించే మహిళలు ఆగస్టు 9న సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. లాడ్లీ బెహ్నా యోజన కింద అర్హత కలిగిన మహిళలు రూ.1,500 రక్షా బంధన్ బోనస్, రూ.250 పండుగ బహుమతిని అందుకుంటారు. రాష్ట్రంలో LPG సబ్సిడీలతోసహా 28 లక్షలకు పైగా మహిళలకు రూ.43.9 కోట్లు పంపిణీ చేసింది.
ఉత్తరాఖండ్- ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రతీ ఏటా మాదిరిగా ఈసారి రక్షాబంధన్ పెస్టివల్ సందర్భంగా మహిళలు, పిల్లలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. చండీగఢ్-మొహాలి-పంచకుల వంటి సిటిల్లో రాఖీ రోజు మహిళలు ఉచిత బస్సు సేవలు పొందవచ్చు.
పంజాబ్, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు పథకం అమల్లో ఉంది. ఢిల్లీలో ఈ స్కీమ్ కేవలం స్థానిక మహిళలకు డీటీసీ బస్సులకు పరిమితం చేసింది. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంది. ఆగష్టు 15 నుంచి ఏపీలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అందుబాటులోకి రానుంది.