Religious Conversion MP CM| మహిళల చేత బలవంతంగా మత మార్పిడి చేయిస్తే మరణశిక్ష విధిస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ హెచ్చరించారు. అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా బలవంతపు మత మార్పిడిపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బలవంతపు మత మార్పిడిని సహించబోమన్న ఆయన, నిందితులకు మరణశిక్ష పడేలా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీనికోసం తమ ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకు రాబోతోందని చెప్పారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రసంగించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. “మా అమాయక ఆడబిడ్డలపై దారుణాలకు పాల్పడే వారిపై రాష్ట్ర ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. వారిని బలవంతం చేసే వారిని మేం వదిలిపెట్టబోయేది లేదు. అలాంటి వారిని జీవించడానికి అనుమతించవద్దు. మత స్వేచ్ఛ చట్టం ద్వారా బలవంతపు మత మార్పిడులు చేసే వారికి మరణశిక్ష విధించే నిబంధన తెచ్చేందుకు మేం కృషి చేస్తున్నాం” అని అన్నారు.
ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై మండిపడిన కాంగ్రెస్
మరోవైపు, ముఖ్యమంత్రి వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరిఫ్ మసూద్ బీజేపీ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. కాషాయ పార్టీ ఒక నిర్దిష్ట మతాన్ని లక్ష్యంగా చేసుకుందని ఆరోపణ చేశారు. ఆ పార్టీ రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నిస్తుందన్నారు.
Also Read: మహిళలు ఒక హత్య చేసినా శిక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలి.. ఎన్సీపీ నేత వివాదాస్పద వ్యాఖ్య
“మత మార్పిడిలు, మహిళల రక్షణ అని గొప్పలు చేప్పేవారు.. భోపాల్‌లో మూడు రోజులు క్రితం ఒక అమ్మాయి తప్పిపోయింది. అయితే ఆమె ఆచూకీ ఇప్పటివరకు కనుక్కోలేదు. ప్రభుత్వం అవసరమైన పనులు మానేసి.. ఒక నిర్దిష్ట సమాజాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శించడం ఎల్లప్పుడూ ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది” అని మసూద్ అన్నారు.
బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు ‘లవ్ జిహాద్’గా పేర్కొంటూ బలవంతపు మత మార్పిడులపై కఠిన వైఖరిని అవలంబిస్తున్నాయి. ఇందులో భాగంగానే 2021 సంవత్సరం మార్చి 8న మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో మత స్వేచ్ఛ చట్టాన్ని ఆమోదించారు. అక్రమ మత మార్పిడులకు పాల్పడిన వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.50,000 వరకు జరిమానా విధించే నిబంధన ఈ చట్టంలో ఉంది. అలాగే ఈ చట్టాన్ని ఉల్లంఘించి ఎవరు వివాహం చేసుకున్నా.. ఆ వివాహం కూడా చెల్లుబాటు కాదు. ఎవరైనా మధ్య ప్రదేశ్ పౌరుడు తన మతాన్ని మార్చకుంటే అతని తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకునే విధంగా ఈ చట్టం అనుమతిస్తుంది. అలాగే ఎవరైనా మతం మారాలనుకుంటే జిల్లా యంత్రాంగానికి 60 రోజులు ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ చట్ట ప్రకారం.. ఎవరైనా పెళ్లి పేరుతో మతం మారినా, పెళ్లి చేసుకుంటామని చెప్పి మతం మార్పించినా, లేదా ఒత్తిడి చేసి, మోసపూరితంగా, మతం మార్పించినా అది నేరంగా పరిగణిస్తారు.
మధ్యప్రదేశ్ తో పాటు బిజేపీ అధికారంలో ఉన్న గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా మత మార్పిడులకు వ్యతిరేకంగా ఇలాంటి చట్టాలు అమలులో ఉన్నాయి. అలాగే తాజాగా మహారాష్ట్రలో కూడా బిజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే అక్కడ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రం మత మార్పిడి అంశంపై చట్టం తీసుకువచ్చేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సమాజంపై మత మార్పిడి ప్రభావాన్ని అధ్యయనం చేసి చట్టం గురించి ప్రతిపాదనలు చేస్తుంది.