Rohini Khadse Woman Murder Immunity | అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్) మహిళా విభాగం అధ్యక్షురాలు రోహిణి ఏక్నాథ్‌రావు ఖడ్సే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఓ అనూహ్యమైన అభ్యర్థన చేశారు. మహిళలపై పెరుగుతున్న నేరాలను అణచివేయడానికి, మహిళలు ఒక హత్య చేసినా వారికి ఎటువంటి శిక్ష విధించకూడదని కోరారు. అలాంటి వారికి రక్షణ కల్పించాలని ఆమె అన్నారు. ఈ మేరకు రాష్ట్రపతికి రాసిన లేఖలో దీనికి గల కారణాలను వివరించారు.
‘‘ముందుగా మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. బుద్ధుడు, మహాత్మా గాంధీ వంటి వ్యక్తులు నడిచిన దేశం మనది. శాంతికి, అహింసకు నిలయం. అలాంటి దేశంలో మహిళలకు రక్షణ కరవైంది. మహిళలపై హింసా ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం ముంబైలో 12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. అందుకే మానవమృగాల్లో ఉన్న ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనావిధానాన్ని అంతమొందించేందుకు మాకు అనుమతినివ్వండి’’ అని లేఖలో కోరారు.
Also Read: కాంగ్రెస్‌లో ఉంటూ బిజేపీ కోసం పనిచేస్తున్నారు.. పార్టీ నాయకులపై రాహుల్ ఫైర్
మహిళలకు మన దేశంలో సరైన రక్షణ లేదని ఇటీవల విడుదలైన ఓ జాతీయ సర్వే ద్వారా తెలిసింది. ఆసియాలోనే మన దేశం అసురక్షిత దేశంగా పేర్కొంది. మహిళల కిడ్నాపింగ్‌లు, మహిళల అదృశ్యం కేసులు, గృహ హింస వంటి తీవ్రమైన ఘోరాలు మహిళలపై జరుగుతున్నాయి. కాబట్టి మేం చేసే ఒక్క తప్పును క్షమించాలని మహిళ తరఫున కోరుతున్నా’’ అని రోహిణి ఖడ్సే తన లేఖలో ప్రస్తావించారు. దేశాన్ని రక్షించుకునేందుకు మహారాణి తారా రాణి, పుణ్య శ్లోక అహల్యాదేవి హోల్కర్ వంటి వారు కత్తి బయటకు తీశారని, కాబట్టి మెరుగైన సమాజం కోసం తమ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని రోహిణి ఖడ్సే కోరారు.
మహిళలు ఆత్మరక్షణ కోసం తమ పర్సుల్లో లిప్‌స్టిక్‌లతో పాటు కత్తులు, కారం పొడి (Chilli powder) తీసుకెళ్లాలని మహారాష్ట్ర మంత్రి, శివసేన సీనియర్ నేత గులాబ్‌రావ్ పాటిల్ (Gulab Rao Patil) సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు.
‘‘మహిళా సాధికారతపై నిరంతరం మాట్లాడుతున్నాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో మహిళలపై అనేక అఘాయిత్యాలు జరుగుతున్నాయి. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే (Bal Thackeray) ఓ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలు తమ వెంట కారం పొడి, రాంపురి కత్తిని తీసుకెళ్లాలని చెప్పారు. అందుకు ఆయనను జర్నలిస్టులు తీవ్రంగా విమర్శించారు. కానీ నేటికీ ఆ పరిస్థితి అలాగే ఉంది. యువతులు స్వీయ రక్షణ కోసం అలాంటి వస్తువులనే తీసుకెళ్లాలని నా విజ్ఞప్తి’’ అని మంత్రి గులాబ్ రావ్ వ్యాఖ్యానించారు.
మహిళా అభ్యున్నతికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోదని అన్నారు. అన్ని రంగాల్లోనూ మహిళలు భాగస్వామ్యం కావాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.