Election Commission: కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తన వాదనలను నిరూపించేందుకు వారం రోజులపాటు సమయం కావాలని ఎన్నికల సంఘంను కోరారు. ఇందుకు ఎన్నికల సంఘం నిరాకరించింది. జూన్ 4న జరగనున్న పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ముందు 150 మంది జిల్లా మెజిస్ట్రేట్లు, కలెక్టర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయంటూ జైరాం రమేష్ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం స్పందించింది. వాస్తవ వివరాలను బయటపెట్టాలని జైరాం రమేష్ ను కోరింది. ఆదివారం సాయంత్రం లోగా ఆ వివరాలను బయటపెట్టాలని తెలిపింది. కాగా, అందుకు వారం రోజుల గడువు ఇవ్వాలంటూ జైరాం రమేష్ సోమవారం ఈసీకి లేఖ రాశారు.
ఈ క్రమంలో ఈసీ స్పందించింది. సమయాన్ని పొడిగించాలన్న మీ అభ్యర్థనను కమిషన్ పూర్తిగా తిరస్కరిస్తుందంటూ తేల్చి చెప్పింది. సోమవారం సాయంత్రం 7 గంటలలోపు మీ ఆరోపణలు రుజువు చేయాలని కోరింది. ఒకవేళ ఆధారాలు సమర్పించకపోతే మీపై ఈసీ తగిన చర్య తీసుకుంటదంటూ జైరాం రమేష్ కు తెలిపింది. రిటర్నింగ్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులైన దాదాపు 150 లోక్ సభ నియోజకవర్గాల జిల్లా మెజిస్ట్రేట్స్ లను ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందని జైరాం రమేష్ ఆరోపించడంపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. జైరాం ఆరోపించినట్లు ఏ డీఎం కూడా అనవసర ప్రభావం చూపలేదని ఎన్నికల సంఘం పేర్కొన్నది.
అయితే, శనివారం ఎన్నికలు ముగిసిన తరువాత అమిత్ షా.. కలెక్టర్లు, జిల్లా మెజిస్ట్రేట్స్ ను పిలిచి భయపెడుతున్నారని జైరాం రమేష్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఇప్పటి వరకు 150 మందితో మాట్లాడారని ఆయన అందులో పేర్కొన్నారు. ఈ క్రమంలో అధికారులు ఎవరు కూడా ఎటువంటి ఒత్తిడికి గురికావొద్దంటూ ఆ పోస్ట్ లో పేర్కొన్న విషయం తెలిసిందే.
కాగా, దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. మొత్తం ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించారు. ఈ ఏడు దశల్లో జరిగిన పోలింగ్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆసక్తిగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఏ పార్టీకి ఎక్కువ సీట్లు రాబోతున్నాయి.. ఎవరు కేంద్రంలో అధికారంలోకి రాబోతున్నారు అంటూ తెలుసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నాయకులు తామంటే తాము అధికారంలోకి రాబోతున్నామంటూ పేర్కొంటున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురీ స్పందిస్తూ వ్యంగ్యంగా మాట్లాడిన విషయం తెలిసిందే. ఇటు ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదలయ్యాయి. అందులో బీజేపీ ఎక్కువ సీట్లు సాధించబోతుందంటూ పేర్కొన్నాయి. ఈ క్రమంలో బీజేపీ నేతలు, శ్రేణుల్లో సంబరం మొదలైంది.
Also Read: అమ్మవారికి పొర్లు దండం పెట్టిన సినిమా హీరో.. తన భార్య ఎంపీగా గెలవాలని వేడుకోలు (వీడియో)
ఇటు ఈశాన్య రాష్ట్రాలైనటువంటి సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లో కూడా ఎవరు అధికారం దక్కించుకున్నారో అనేది ఇప్పటికే తెలిసిపోయింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అధిక సీట్లను కైవసం చేసుకుంది. దీంతో ఆ రాష్ట్రంలో మరోసారి బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇటు సిక్కింలో ఎస్కేఎం పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చింది. సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ ఆధ్వర్యంలో ఎస్కేఎం పార్టీ రాష్ట్రంలో రెండోసారి అత్యధిక స్థానాలను గెలుచుకుంది.