BigTV English

Rewind 2023: 2023లో జరిగిన అతిపెద్ద 11 సంఘటనలు ఇవే..!

Rewind 2023: 2023లో జరిగిన అతిపెద్ద 11 సంఘటనలు ఇవే..!

Rewind 2023: కాలం ఒడిలో మరో ఏడాది కరిగిపోయే సమయం వచ్చేసింది. మరోవైపు కొత్త ఆశలతో, సరికొత్త ఆకాంక్షలతో నూతన సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు ప్రపంచమంతా సన్నద్ధమవుతోంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే 2023 కూడా మనదేశానికి కొన్ని తీపి గుర్తులను, గుండెను మెలిపెట్టే చేదు జ్ఞాపకాలనూ మిగిల్చింది. ఆ మధురానుభూతులు, జాతి దిగమింగిన విషాదాలు, కంగారుపెట్టిన ఘటనలేమిటో ఓసారి అవలోకనం చేసుకుందాం..!


మహిళా క్రీడాకారులు తమకు ఎదురవుతున్న లైంగిక ఆరోపణలతో ఈ ఏడాదంతా రోడ్డుమీదనే ఉన్నారు. జనవరిలో న్యూఢిల్లీలో భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్ సింగ్‌‌కు వ్యతిరేకంగా మొదలైన వీరి ఆందోళన.. నేటికీ కొనసాగుతూనే ఉంది. తాము న్యాయం జరగటంలేదనే ఆవేదనతో ఒక సమయంలో క్రీడాకారులు తమకు భారత ప్రభుత్వం ఇచ్చిన క్రీడా పతకాలను గంగానదిలో నిమజ్జనం చేసేందుకు బయలుదేరటం, మరికొందరు తమ అవార్డులను వెనక్కి ఇవ్వటంతో ఈ పోరాటం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

మోదీ ఇంటిపేరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సూరత్‌ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించిన 24 గంటల్లోనే.. ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దైపోయింది. గట్టి న్యాయపోరాటం తర్వాత ఈ కేసులో సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇవ్వటంతో 5 నెలల తర్వాత తిరిగి రాహుల్ లోక్‌సభకు రాగలిగారు.


ప్రపంచపు అత్యధిక జనాభా గల దేశంగా గత ఏప్రిల్ నెలలో భారత్ అవతరించింది. ఈ విషయంలో ప్రపంచపు నంబర్ వన్ చైనాను దాటిన భారత్ సరికొత్త రికార్డును సృష్టించింది. 1950 నుంచి ఐరాస జనాభా లెక్కల్ని ప్రచురిస్తోన్న సంగతి తెలిసిందే.

కుకీలు, మైతేయిల మధ్య జాతి వైరం కారణంగా మణిపూర్ అట్టుడికిపోయింది. మైతేయిలకు రిజర్వేషన్లు వద్దంటూ ఆదివాసీలు మొదలుపెట్టిన ఆందోళనలు దాడులకు దారితీయగా, కాలక్రమంలో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఒక గిరిజన మహిళను వివస్త్రగా లాక్కుపోయిన వీడియో ఈ హింసకు మరింత ఆజ్యం పోయగా, దేశం సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలతో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది.

స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లైన సందర్భంగా దేశానికి నూతన పార్లమెంటు భవనం అందుబాటులోకి వచ్చింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని, సకల హంగులతో నిర్మించారు. అయితే.. ఇందులోని స్పీకర్ స్థానానికి పక్కన ద్రవిడ సంస్కృతికి, సంగమ కాలానికి చెందిన సెంగోల్‌ను ప్రతిష్టించటం వివాదానికి దారితీసింది.

కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌, ఓ గూడ్స్‌ రైలు, యశ్వంత్‌పూర్‌-హావ్‌డా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఒడిశాలోని బాలేశ్వర్‌లో జూన్‌ 2 అర్థరాత్రి అనూహ్యంగా ఢీకొన్న ఘటనలో 296 మంది బలికాగా, 1200 మందికి పైగా గాయపడ్డారు. ఒకదానిపై ఒకటి ఎక్కిన బోగీలు, ముక్కలైన మృతుల శరీరాల దృశ్యాలను చూసిన దేశం.. కన్నీరు కార్చింది. ఇంతటి విషాదంలోనూ స్థానిక యువత క్యూ లైన్లతో నిలబడి రక్తదానం చేయటం, సహాయ కార్యక్రమాల్లో భాగస్వాములు కావటం జాతిని ఆశ్చర్య పరచింది.

అంతరిక్ష రంగంలో అగ్రగాములుగా ఉన్న అమెరికా, రష్యా, చైనాలకు సైతం సాధ్యం కాని విజయాన్ని మన ఇస్రో సాధించింది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ -3, ఆగస్టులో చందమామ దక్షిణ ధ్రువంపై భద్రంగా దిగటంతో అంతరిక్ష చరిత్రలో భారత్ కొత్త చరిత్రను రాసినట్లయింది. ల్యాండర్‌ విక్రమ్‌, రోవర్‌ ప్రజ్ఞాన్‌లు 14 రోజుల పాటు చంద్రుడికి సంబంధించిన సమాచారాన్ని అందించాయి. ఇది జరిగిన కొన్నాళ్లకే.. మన ఇస్రో సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేసేందుకు ‘ఆదిత్య ఎల్‌1’ ను ప్రయోగించగా..2024 జనవరి 6న ఇది గమ్యస్థానానికి చేరుకోనుంది.

‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ అనే నినాదంతో గత సెప్టెంబరులో ఢిల్లీలో జరిగిన జీ-20 శిఖరాగ్ర సదస్సు ప్రపంచం దృష్టిని ఆకట్టుకుంది. ఈ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన భారత్.. ‘దిల్లీ డిక్లరేషన్‌’పై సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం తీసుకురాగలిగింది. ఈ సదస్సు నిర్వహణతో భారత సామర్థ్యాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. అలాగే.. పశ్చిమాసియా, తూర్పు యూరోపులను భారత్‌తో అనుసంధానం చేసే కారిడార్ విషయంలోనూ ఈ సదస్సులో అవగాహన కుదరటం విశేషం.

ఈ నవంబర్‌‌లో జరిగిన వన్డే ప్రపంచకప్.. మన క్రీడాభిమానులను నిరాశకు గురిచేసింది. ఆరంభం నుంచి అదరగొట్టిన భారత సేన, ఫైనల్ మ్యాచ్‌లో తడబడి.. పరాజయం పాలైంది. కపిల్‌ దేవ్‌, ధోనీ తర్వాత భారత్‌కు కప్పు అందించాలనుకున్న రోహిత్ టీం.. ఆఖరికి ఆ కప్‌ను కంగారూలకు సమర్పించుకోవాల్సి వచ్చింది.

41 మంది కూలీలు, 17 రోజుల పాటు ఉత్తరాఖండ్‌లోని ఉత్తర్‌కాశీలో సొరంగంలో చిక్కుకుపోవటం, సహాయక చర్యలు నెమ్మదిగా సాగటం పలువురిని కంగారు పెట్టింది. అయితే.. ప్రతికూల వాతావరణాన్ని, టెక్నికల్ సమస్యలను అధిగమించిన మన సైనిక బలగాలు.. అందరినీ సురక్షితంగా కాపాడటంతో దేశం ఊపిరి పీల్చుకుంది.

ఇటీవలి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో లోక్‌సభలోని సందర్శకుల గ్యాలరీ నుంచి ఇద్దరు దుండగులు సభ్యుల మధ్యకు దూకిన ఘటన కలకలం రేపింది. వీరిలో ఒకరు నినాదాలు చేయగా, మరొకరు పొగబాంబు వేయటం, సరిగ్గా అదే సమయానికి పార్లమెంటు బయట మరో ఇద్దరు నినాదాలకు దిగటంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీనిపై నిరసనకు దిగిన విపక్ష సభ్యుల్లో ఒకే సెషన్‌లో 146 మందిని సస్పెండ్ చేయటం రాజకీయ కలకలాన్ని సృష్టించింది.

Tags

Related News

Justice Yashwant Varma: జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు.. స్పీకర్ ఓం బిర్లా సంచలన నిర్ణయం

Stray Dogs: వీధి కుక్కలు కనిపించకూడదన్న సుప్రీంకోర్టు.. రంగంలోకి అధికారులు, మండిపడ్డ పెటా

Indian Air Force: పాకిస్తాన్ ని ఇలా చావుదెబ్బ కొట్టాం.. ఆపరేషన్ సిందూర్ అరుదైన వీడియో

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Big Stories

×