WhatsApp News: పాకిస్థాన్‌లో దారుణమైన ఘటన జరిగింది. వాట్సాప్ చాట్ నుంచి తొలగించాడన్న ఒక్క కారణంతో గ్రూప్ అడ్మిషన్‌ని తుపాకీతో కాల్చి చంపేశాడు ఓ వ్యక్తి. ఈ సంచలనం రేపిన ఈ ఘటన పెషావర్ లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో నిందితుడ్ని ఇప్పటివరకు పోలీసులు పట్టుకోలేక పోయారు.
అసలేం జరిగింది?
పెషావర్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వ ప్రాంతంలో దారుణమైన ఘటన జరిగింది. ముస్తఖ్ అహ్మద్ అనే వ్యక్తి ఓ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌గా ఉన్నాడు. అదే గ్రూప్‌లో ఉన్న అష్ఫఖ్ అనే వ్యక్తితో అతడికి గొడవ జరిగింది. ఫలితంగా ఆ వాట్సాప్ గ్రూప్ నుంచి అష్ఫఖ్‌ని తొలగించాడు. కేవలం గొడవ జరిగిందన్న కారణంతో గ్రూప్ నుంచి తొలగించడం అష్ఫఖ్‌కి నచ్చలేదు. దీంతో పగ తీర్చుకోవాలని భావించాడు.
గతంలో వీరిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం సరైన స్కెచ్ వేశాడు అష్ఫఖ్. చివరకు గురువారం సాయంత్రం గొడవను పరిష్కరించు కుందామని చెప్పి గ్రూప్ అడ్మిన్ ముస్తఖ్‌ని పిలిపించాడు. పక్కాగా ప్లాన్ ప్రకారం వెళ్లిన అష్ఫఖ్ తనతో తెచ్చుకున్న గన్ తీసి వెంటనే ముస్తఖ్‌ని కాల్చి చంపేశాడు. ఈ విషయాన్ని ముస్తఖ్ బ్రదర్ పోలీసులకు వివరించారు.
ఘటన తర్వాత నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు నిందితుడ్ని ఇంకా పట్టుకోలేదని సమాచారం. అతడి కోసం గాలింపు ముమ్మరం చేశారు.ఈ ఘటనపై బాధితుడి కుటుంబసభ్యులు రియాక్ట్ అయ్యారు. ఇదేమీ పెద్ద గొడవ కాదన్నారు. చాలా చిన్న సమస్య అని, అసలు వివాదం ఎంటో మా కుటుంబానికి తెలియదన్నాడు. కేవలం గ్రూప్ నుంచి తొలగించినందుకు అష్ఫఖ్ తన సోదరుడ్ని చంపేశాడని మీడియా ముందు వాపోయాడు.
ALSO READ: విశాఖలో ఎన్నారై మహిళ మృతిపై అనుమానాలు
చిన్న విషయానికి హత్య జరుగుతున్న ఘటనపై ఆందోళన క్రమంగా మొదలైంది. సున్నితమైన ప్రాంతంలో సులభంగా విరివిగా ఆయుధాలు దొరకడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఈ తరహా వివాదాలు కేవలం పాకిస్థాన్ కు మాత్రమే పరిమితం కాలేదు. ఇండియాలో అక్కడక్కడ ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయి.
భారత్‌లో కూడా ఈ తరహా
ఆ మధ్య మహారాష్ట్ర థానెలో వాట్సాప్ చుట్టూ జరిగిన వివాదంలో ముగ్గురు వ్యక్తులు, తమ స్నేహితుడిపై దారుణంగా దాడి చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌గా ఉన్న విషయం తెల్సిందే. గ్రూప్‌కి తగ్గట్టుగా స్టేటస్ మార్చుకోవాలని తన ఫ్రెండ్‌కి చెప్పాడు. అతను ఆ పని చేయలేకపోవడంతో దాడి ఘటన జరిగింది. పట్టరాని కోపంతో ఊగిపోయిన గ్రూప్ అడ్మిన్, మరో ఇద్దరితో కలిసి స్నేహితుడిని కత్తితో పొడిచారు.
తీవ్ర గాయాలైన అతడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు అంటే 2023లో గుర్గావ్‌లో ఆ తరహా ఘటన జరిగింది. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ నుంచి తొలగించినందుకు మూడు మంది వ్యక్తులు అడ్నిన్‌పై కాల్పులు జరిపిన విషయం తెల్సిందే. కేవలం సమాచారం కోసం వినియోగించుకోవాల్సిన సోషల్ మీడియాను ఈ విధంగా వినియోగించుకుంటోంది నేటి యువత. యువతీయువకులు ఇలాంటి విషయాల్లో తస్మాత్ జాగ్రత్త.