PM Cares Fund : మాయదారి కొవిడ్ మహమ్మారి.. ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎంతో మంది తల్లిదండ్రులకు కన్నబిడ్డల్ని దూరం చేసి వారికి శోకాన్ని మిగిల్చగా.. ఎంతో మంది చిన్నారులకు వాళ్ల తల్లిదండ్రులను పొట్టనపెట్టుంది. అంతటి విషాద సమయంలో వీధిన పడిన ఎంతో మంది చిన్నారులు.. తల్లిదండ్రుల ఆలనాపాలనలకే కాదు.. కనీస పోషణకు సైతం నోచుకోక అనేక ఇబ్బందులు పడ్డారు. అలాంటి చిన్నారుల సంరక్షణ బాధ్యతల్ని భుజానికెత్తుకున్న పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్.. ఇప్పటి వరకు 4,543 మంది చిన్నారుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. ఈ విషయాన్ని తాజాగా సమర్పించిన ఆడిట్ స్టేట్‌మెంట్‌లో వెల్లడించింది.
కొవిడ్ -19 మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో అనాథలైన పిల్లలను ఆదుకునేందుకు 2021లో పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రభుత్వ నిధితో సంబంధం లేకుండా.. దాతల సహాయసహకారాలతో నడిచేలా ఏర్పాటు చేశారు. ఈ నిధి ద్వారా తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలైన చిన్నారులకు అనేక విధాల భరోసా కల్పించాలని సంకల్పించారు. అందులో భాగంగా.. ఇప్పటి వరకు 4,543 మంది చిన్నారుల కోసం రూ.346 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్రం తెలిపింది. ఈ విషయం.. 2022-2023 ఆడిట్ లో భాగంగా వెల్లడించింది.
కొవిడ్ ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో.. 2021 మే 29న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకాన్ని ప్రారంభించారు. ఇది.. 2020 మార్చి – 2023 మే మధ్య.. తల్లిదండ్రులు, చట్టపరమైన సంరక్షకులు, పెంపుడు తల్లిదండ్రులు వంటి వారిని కోల్పోయిన పిల్లలకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా మొదలైంది. పిల్లలకు కేవలం వసతి కల్పించడమే కాకుండా.. వారికి అన్ని విధాలా అండగా నిలిచేందుకు వివిధ కార్యక్రమాలను ఈ పథకం ద్వారా అమలు చేస్తున్నారు. పిల్లల సమగ్ర సంరక్షణ, నిరంతరం వారికి రక్షణ కల్పించడం, ప్రత్యేక ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించడం, వారికి ఉత్తమ విద్యను అందించి శక్తివంతం చేయడం ఈ పథకం ప్రధాన ఉద్దేశాలు. అలాగే.. అనాథలైన చిన్నారులకు 23 ఏళ్లు వచ్చేసరికి ఆర్థిక సహాయంతో స్వయం సమృద్ధి సాధించేలా చేయడం దీని లక్ష్యం.
ఉన్నత లక్ష్యాలతో ప్రారంభమైన పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం ద్వారా దేశంలోని 31 రాష్ట్రాల్లోని 558 జిల్లాల నుంచి అనాథలైన చిన్నారులకు మద్ధతుగా నిలిచినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ పథకం ప్రయోజనాల్ని అత్యధికంగా.. మహారాష్ట్ర నుంచి 855 మంది చిన్నారులు, ఉత్తరప్రదేశ్- 467, మధ్యప్రదేశ్ – 433, తమిళనాడు- 426, ఆంధ్రప్రదేశ్ -351 మంది చిన్నారులు ప్రయోజం పొందారని వివిధ మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ పథకం ద్వారా అనాథ పిల్లలకు ఆర్థిక భరోసా కల్పిస్తుండగా.. చిన్నారులు జీవితాల్లో స్థిరపడే వరకు ప్రభుత్వమే సాయంగా నిలువనుంది. ఈ పథకం ద్వారా పిల్లలందరికీ రూ.10 లక్షల ఆర్థిక సహాయం చేస్తున్నారు. అలాగే.. సురక్షితమైన పునరావాసం, వారికి కావాల్సిన వసతులు అందించడం, పాఠశాలల్లో అడ్మిషన్ సహా.. ఉన్నత విద్య చదివే విద్యార్థులకు.. విద్యా రుణాలు అందించనున్నారు. అలాగే.. ప్రతీ చిన్నారికి రూ.5 లక్షల మేర ఆరోగ్య బీమా.. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పాఠశాలకు వెళ్లే పిల్లలందరికీ ఏడాదికి రూ.20 వేలు స్కాలర్‌షిప్ గా అందిస్తున్నారు.
Also Read : బీహార్ బాలికకు ప్రధాని మోదీని ప్రశ్నించే అరుదైన అవకాశం!.. ఎలా దక్కిందంటే?
కొవిడ్-19 మహమ్మారి పిల్లలపై గణనీయమైన ప్రభావాన్ని చూపిందని అనేక అధ్యయనాలు తెలుపుతున్నాయి. వాళ్లు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోవడం, వికసించాల్సిన దశలో నాలుగు గోడల మధ్య బంధీలుగా మారిపోవడంతో.. వాళ్లు సాధారణ జీవితాన్ని కోల్పోయారు. అలాగే.. పాఠశాలకు వెళ్లలేకపోవడం, ఎంతో ప్రియమైన వాళ్లను కోల్పోవడంతో తీవ్ర ఒత్తిడి, ఆందోళనలను ఎదుర్కొన్నారు. చాలా మంది చిన్నారులు.. ఇద్దరు తల్లిదండ్రులను సైతం కోల్పోయినట్లు కేంద్రం చెబుతోంది. అలాంటి వారికి.. బాధ్యతగా అండగా ఉండడంతో పాటు 18 ఏళ్ల వరకు నెలవారీ స్టైఫండ్, 23 ఏళ్లు నిండినప్పుడు ఒకేసారి రూ.10 లక్షల సాయం అందించనున్నారు.