బస్సు ప్రయాణం అయినా, రైలు ప్రయాణం అయినా టికెట్ రేటుతోపాటు ప్రమాద బీమా కోసం అదనంగా కొంత రుసుము వసూలు చేస్తుంటారు. అయితే ఇది కొన్నిసార్లు ఆప్షనల్ గా ఉంటుంది. అలాగే విమాన ప్రయాణాలకు కూడా బీమా కవరేజ్ ఉంటుంది. టికెట్ తోపాటు అదనంగా బీమాకోసం కొంత రుసుము వసూలు చేస్తుంటారు. అసలు విమాన ప్రమాదం జరిగితే బీమా కవరేజ్ ఎవరికి వర్తిస్తుంది. మరణించిన వారి కుటుంబాలకు ఎంత నష్టపరిహారం ఇస్తారు. గాయాలపాలైతే ఆస్పత్రి ఖర్చులకు ఎంతమొత్తం జమచేస్తారు..? ఈ వివరాలు ఇప్పుడు చూద్దాం.
మాంట్రియల్ ప్రోటోకాల్..
విమాన ప్రమాదాలు, బాధితులకు చెల్లించాల్సిన నష్టపరిహారం విషయంలో అంతర్జాతీయ ఒప్పందాలు ఉన్నాయి. 199లో అమలులోకి వచ్చిన మాంట్రియల్ కన్వెన్షన్ ప్రకారం విమాన ప్రమాదం జరిగితే మరణించినవారి కుటుంబాలకు సదరు విమానయాన సంస్థ కోటిన్నర రూపాయల పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఒప్పందంపై భారత్ 2009లో సంతకం చేసింది. అయితే ఇక్కడ నిర్లక్ష్యం ఎవరిది, విమాన ప్రమాదానికి కారణం ఏంటి అనే విషయాలను పట్టించుకోరు. ఏ సంస్థకు చెందిన విమానం ప్రమాదానికి గురైతే ఆ సంస్థ కచ్చితంగా నష్టపరిహారం చెల్లించాల్సిందే. అయితే ఇది కేవలం అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుండగా, దేశీయ విమానయాన సంస్థలు కూడా DGCA మార్గదర్శకాల ప్రకారం ఈ తరహా నియమాలకు కట్టుబడి ఉంటున్నాయి.
మధ్యంతర పరిహారం
ఆమధ్య కోజికోడ్ విమాన ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియా సంస్థ 12 ఏళ్లు ఆ పైన వయసు ఉన్న వారు మరణిస్తే వారి కుటుంబాలకు రూ.10 లక్షలు మధ్యంతర పరిహారంగా ఇచ్చింది. 12 ఏళ్లలోపు పిల్లలు మరణిస్తే, వారి కుటుంబాలకు రూ. 5 లక్షలు ఇచ్చింది. గాయపడిన వారికి తక్షణ వైద్యం కోసం రూ.2 లక్షలు మధ్యంతర పరిహారాన్ని ఇచ్చింది. ఇది కేవలం మధ్యంతర పరిహారం మాత్రమే. ఆ తర్వాత ఈ పరిహారాన్ని పెంచి ఇస్తారు. ఇక విమానయాన సంస్థ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు రుజువైతే ఆ పరిహారం మరింత భారీగా పెరుగుతుంది.
కోర్టు కేసులు
ఒకవేళ పరిహారం విషయంలో బాధిత కుటుంబాలు సంతృప్తి చెందకపోతే వారు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. మాంట్రియల్ కన్వెన్షన్ ప్రకారం వివిధ అంతర్జాతీయ న్యాయస్థానాల్లో వారు కేసులు దాఖలు చేయవచ్చు. సదరు విమానయాన సంస్థ ఎక్కడ ఉంది, ప్రమాదం ఎక్కడ జరిగింది, ప్రయాణీకుడు స్వస్థలం ఎక్కడ అనే అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది.
భారీగా పరిహారం
విమాన ప్రమాదాలు అరుదుగా జరుగుతుంటాయి కాబట్టి.. ఈ పాలసీల్లో పరిహారం బారీగానే ఉంటుంది. కొన్ని సంస్థలు రూ.25 లక్షలనుంచి రూ.కోటి వరకు పరిహారం ఇస్తుంటాయి బీమా సంస్థలు. సాధారణ పాలసీ ప్రయోజనాలకు ఇది అదనం. ప్రమాదానికి గురైనవారికి అంగవైకల్యం సంభవిస్తే 5 నుంచి 10 లక్షల రూపాయలు పరిహారంగా ఇస్తారు. ఇక సాధారణంగా విమాన ప్రయాణాల్లో తీసుకునే బీమా చాలా విషయాలను కవర్ చేస్తుంది. ఒకవేళ విమానం ఆలస్యమైనా, రద్దయినా దానికి కలిగే అసౌకర్యానికి కూడా బీమా సొమ్ము ఇస్తారు. విమానంలో తమ వెంట తీసుకెళ్లే లగేజ్ కి కూడా కవరేజ్ ఉంటుంది. అయితే ఈ చెల్లింపులకోసం కచ్చితంగా మనం బీమా తీసుకుని ఉండాలి. ఇక బీమా తీసుకోని వారికి విమానయాన సంస్థలే పరిహారం ఇస్తుంటాయి. తాజాగా జరిగిన బోయింగ్ డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదంలో ఎయిరిండియా నిర్వాహకులైన టాటా సంస్థ ఒక్కో బాధిత కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ప్రకటించింది.
ప్రభుత్వ పరిహారం
బీమా తీసుకుంటే ఆ కవరేజ్ లభిస్తుంది. బీమా తీసుకోకపోయినా విమానయాన సంస్థ విధిగా నష్టపరిహారం ఇవ్వాలి. ఇక వీటికి ప్రభుత్వం ప్రకటించే ఎక్స్-గ్రేషియా అదనం. క్రెడిట్ కార్డ్-లింక్డ్ పాలసీలు కూడా కొన్నిసార్లు బాధిత కుటుంబాలకు ఆసరాగా నిలబడతాయి. విమానయాన సంస్థలు సంఘటన జరిగిన 90 రోజుల్లోపు రూ.10 లక్షల మధ్యంతర పరిహారాన్ని అందించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని తరువాత ఫైనల్ సెటిల్మెంట్ సమయంలో సర్దుబాటు చేస్తారు.